మహిళా రెజ్లర్లు: ప్రభుత్వ అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని సవాల్ చేస్తున్న ఈ నిరసన ఏం చెబుతోంది?

బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు

May 10, 2023 - 05:56
May 10, 2023 - 05:59
 0
మహిళా రెజ్లర్లు: ప్రభుత్వ అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని సవాల్ చేస్తున్న ఈ నిరసన ఏం చెబుతోంది?

మనభారత్ న్యూస్, 10 మే 2023, ఢిల్లీ :   దేశ రాజధాని దిల్లీలో నిరసన తెలియజేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా నిలిచేందుకు గత ఆదివారం వేల మంది రైతులు తరలివచ్చారు.

భారత స్పోర్ట్స్‌లో ఈ నిరసన మునుపెన్నడూ చూడని అసాధారణ పరిణామంగా చెప్పుకోవాలి.

ఇదివరకెప్పుడూ ప్రముఖ రెజ్లర్లు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ఇలా నిరసన తెలియజేయలేదు.

స్పోర్ట్స్‌లో ప్రాధికార సంస్థల ఆదేశాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు చెందిన అథ్లెట్లూ నడుచుకుంటుంటారు. ఏదైనా నిరసన తెలియజేసినా అది ఆ ఆఫీసుకు లేదా విలేకరుల సమావేశానికి పరిమితం అవుతుంటుంది. కొన్నిసార్లు కొందరు క్రీడాకారులు మీడియాకు లీక్‌లు కూడా చేస్తుంటారు.

కానీ, ప్రస్తుతం రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ఆరుసార్లు ఎంపీగా గెలిచిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు బ్రిజ్ భూషన్ సింగ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారానికి, బీజేపీకి ప్రముఖ రెజ్లర్లు ఎదురు నిలవడం అనేది ఒక సాహసంగా చెప్పుకోవాలి.

స్పోర్ట్స్‌లో ''రాజకీయ అధికారం (పొలిటికల్ పవర్)'' అనేది కేవలం ఒకే దిశలోనే కనిపిస్తుంది. తమ అజెండాలు ప్రచారం చేసుకోవడానికి, తమ సామ్రాజ్యాల విస్తరణకు స్పోర్ట్స్‌ను రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటారు. స్పోర్స్ వాతావరణాన్ని కూడా తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటారు. క్రీడాకారులు కూడా తమకు విధేయులుగా ఉండాలని భావిస్తారు.

తెరవెనుక కథలు..

ప్రస్తుతం స్పోర్ట్స్ వ్యవస్థలను కుదిపేసే స్థాయిలో జరుగుతున్న తొలి నిరసనగా దీన్ని చెప్పుకోవాలి.

శక్తిమంతమైన రాజకీయ నాయకుడిపై ఆరోపణలు చేయడంతోపాటు తమ డిమాండ్లు నెరవేరేలా చూడాలని వీరు దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడిని కోరారు.

తమ ఉద్యమంతో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసిన రైతు ప్రతినిధులు కూడా ప్రస్తుతం రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు.

ఒకప్పుడు తెరవెనుక వినిపించే ఇలాంటి డిమాండ్లన్నీ నేడు ప్రజలు, మీడియా ముందు బహిరంగా చేస్తున్నారు.

ఈ డిమాండ్లు చేస్తున్న వారిలో ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌షిప్ పతక విజేతలు కూడా ఉన్నారు.

భారత రెజ్లింగ్‌లో ప్రతి కోణాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంతోపాటు మొత్తంగా స్పోర్ట్స్‌లో లోపాలను ఈ నిరసనలు కళ్లకు కడుతున్నాయి.

జనవరి నుంచే రెజ్లర్లు తమ నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే తమకు ఆ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లో ఇంకేమీ మిగిలిలేదని వారు భావించారు.

ముఖ్యాంశాలు..

  • దేశం కోసం పతకాలు గెలిచిన ప్రముఖ క్రీడాకారులు ప్రస్తుతం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్నారు.
  • నిరసనలు తెలియజేస్తున్న వారిలో వినేశ్ ఫోగాట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా లాంటి ప్రముఖ రెజ్లర్లు కూడా ఉన్నారు.
  • బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు.
  • సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్రిజ్ భూషణ్‌పై దిల్లీ పోలీసులు ఒక ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)ను కూడా నమోదు చేశారు.
  • బ్రిజ్ భూషణ్‌పై ఫిర్యాదుచేసి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని, అందుకే నిరసనకు కూర్చున్నామని రెజ్లర్లు చెబుతున్నారు.

స్పోర్ట్స్ సంఘాల పరిస్థితి ఏమిటి?

ఆగస్టు 2010లో స్పోర్ట్స్ ఫెడరేషన్‌ల కోసం నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోడ్(ఎన్ఎస్‌డీసీ)ని తీసుకొచ్చారు.

స్పోర్ట్స్‌లో ప్లేయర్లు లైంగిక వేధింపులను ఎదుర్కోకుండా చూసేందుకు ఎన్‌ఎస్‌డీసీలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

ప్రతి స్పోర్ట్స్ ఫెడరేషన్‌లోని ఫిర్యాదుల నమోదుకు ఒక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటుచేయాలని, దీనికి చైర్మన్‌గా ఒక మహిళను నియమించాలని స్పష్టంగా ఆ కోడ్‌లో పేర్కొన్నారు.

ఈ కమిటీలో 50 శాతం మంది సభ్యులు కచ్చితంగా మహిళలే ఉండాలి. దీనిలో ఒక స్వతంత్ర సభ్యుడికి కూడా చోటుంది. ఆ స్వతంత్ర సభ్యుడిని స్వచ్ఛంద సంస్థలు లేదా లైంగిక దాడులపై పనిచేస్తున్న సంస్థల నుంచి నియమించుకోవాలి.

రెజ్లింగ్ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియాలోని లైంగిక వేధింపులను ఫిర్యాదులను స్వీకరించే కమిటీలో ఐదుగురు సభ్యులున్నారు. ఈ కమిటీకి మహిళలు కాకుండా వీఎన్ ప్రసూద్ నేతృత్వం వహిస్తున్నారు.

ఈ కమిటీలో సభ్యత్వమున్న ఏకైక మహిళ సాక్షి మలిక్. దీనిలో మిగతా సభ్యులుగా ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉన్నారు.

ఫెడరేషన్‌లో ఒక గ్రీవెన్స్ రీఅడ్రెసల్ కమిటీ కూడా ఉంది. పరిపాలనకు సంబంధించిన అవకతవకలు, ఇతర ఫిర్యాదులను ఈ కమిటీ స్వీకరిస్తుంది.

దీనిలో నలుగురు సభ్యులున్నారు. వీరిలో బ్రిజ్ భూషణ్‌తోపాటు సంస్థ కోశాధికారి, ఓ జాయింట్ సెక్రటరీ, ఓ ఎగ్జిటివ్ సభ్యుడు ఉన్నారు.

ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుందా?

ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరేషన్ అధ్యక్షుడిపైనే రెజ్లర్లు ఎలా ఫిర్యాదు చేయడం సాధ్యం? ఆయన అవకతవకలకు పాల్పడ్డారని ఈ కమిటీలు ఎలా చర్యలు తీసుకోగలవు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ఈ రెండు కమిటీల్లోనూ స్వతంత్ర సభ్యుడికి చోటు లేదు. ఈ విషయంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌పై చాలా విమర్శలు వస్తున్నాయి. చాలా స్పోర్ట్స్ ఫెడరేషన్‌లలోనూ పరిస్థితి ఇలానే కనిపిస్తోంది.

తాజాగా 30 స్పోర్ట్స్‌ ఫెడరేషన్లలోని ఈ కమిటీలపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది. వీటిలో సగం ఫెడరేషన్లలో అసలు ఫిర్యదుల నమోదుకు ఎలాంటి కమిటీ లేదని లేదా నిబంధనలకు అనుగుణంగా ఆ కమిటీని ఏర్పాటు చేయలేదని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బిలియర్డ్స్, స్నూకర్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, జూడో, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, రోవింగ్, వెయిట్ లిఫ్టింగ్ తదితర ఫెడరేషన్లలో అసలు కమిటీలు ఏర్పడలేదని లేదా కమిటీలు నిబంధనలకు అనుగుణంగా లేవని ఆ కథనంలో చెప్పారు.

అథ్లెటిక్స్, బాక్సింగ్, సైక్లింగ్, హార్స్ రైడింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ తదితర ఫెడరేషన్లలో మాత్రమే ఆ కమిటీలు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటుచేశారు..

ప్లేయర్లు ఎక్కడికి వెళ్లాలి?

మొత్తంగా 13 ఫెడరేషన్లలో కమిటీలు నిబంధనలను అనుగుణంగా ఏర్పాటుచేశారని, 16 ఫెడరేషన్లలో పరిస్థితి దీనికి వ్యతిరేకంగా కనిపిస్తోందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో పేర్కొన్నారు.

అయితే, ఇక్కడ నిబంధనలకు అనుగుణంగా కమిటీ ఏర్పడినంత మాత్రాన ఆ కమిటీ పక్కాగా పనిచేస్తుందని కూడా చెప్పలేం. అయితే, కొంతవరకు దీని వల్ల ఫిర్యాదులను పైస్థాయికి తీసుకెళ్లేందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది.

ఈ కమిటీల్లో స్వతంత్ర సభ్యుడు కూడా తప్పనిసరిగా ఉండాలని ఎన్ఎస్‌డీసీ సూచిస్తోంది. అయితే, అలాంటి వ్యవస్థలు లేదా ఏర్పాట్లు లేకపోవడంతో వేధింపులు, వివక్షపై ఫిర్యాదు చేసేందుకు సురక్షితమైన మార్గం ప్లేయర్లకు లేకుండా పోతోంది.

ఇలాంటి కమిటీలో పనిచేయని ఫెడరేషన్లను స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ సమీక్షించడానికి ఇది సరైన సమయం.

ఏటా ఈ సంఘాల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించే సమయంలో పక్కాగా ఈ కమిటీల గురించి తెలుసుకోవాలి. ఒకవేళ ఆ కమిటీలో లేకపోతే, వీటిని ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలి.

బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయింది కదా? ఇక రెజ్లర్లు నిరసన మానుకోవాలని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇది రెజ్లర్ల ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే. స్పోర్ట్స్ తమకు ఎంత ముఖ్యమో వినేశ్ ఫోగాట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియాలకు తెలియకుండా ఉంటుందా?

స్పోర్ట్స్‌లో తమ లక్ష్యాలను చేరుకునేందుకు వీరు నిత్యం శ్రమిస్తూ ఉంటారు. తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు వీరు వారంలో కనీసం నాలుగు నుంచి ఐదు రోజులు ట్రైనింగ్ తీసుకుంటారు. ప్రస్తుతం అన్నీ పక్కన పెట్టి వారు నిరసన తెలియజేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విచారణ నడుమ ఆసియా చాంపియన్‌షిప్ ట్రయల్స్‌ను దిల్లీ నుంచి కజఖ్‌స్తాన్‌కు మార్చారు. వీటికి వినేశ్, సాక్షి, బజ్‌రంగ్‌లు కూడా హాజరుకాలేని పరిస్థితి నెలకొంది.

మరోవైపు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెర్బియాలో సెప్టెంబరు 16 నుంచి 24 మధ్య జరగబోతోంది. సెర్బియాలో పతకాలు సాధించేవారికి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించడానికి 90 పాయింట్లు వస్తాయి.

మరోవైపు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 9 మధ్య చైనాలో ఆసియా గేమ్స్‌ జరగబోతున్నాయి. వీటిలో వినేశ్, సాక్షి, బజ్‌రంగ్‌లు పతకాలు సాధిస్తారని అంచనాలు ఉన్నాయి.

ఈ నిరసనలు ఫలిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇది ఎంత కాలం కొనసాగితే రెజ్లర్ల ఫిట్‌నెస్‌పై అంత ప్రతికూల ప్రభావం పడుతుంది.

అయితే, ఈ పోరాటంలో రెజ్లర్లు వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం వీరు అత్యంత కఠినమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు. అదే ప్రభుత్వ అధికారం.

ప్రతిరోజూ ఈ ఉద్యమంలో కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయి. మీరు ఇక్కడ కన్నీళ్లు, అలసటను ప్రత్యక్షంగా చూడొచ్చు. కానీ, ఒక్కటి మాత్రం నిజం. వారి కళ్లలో భయం అసలు కనిపించడం లేదు.

నోట్: BBC India ప్రచురణ ఆధారంగా

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News