నిత్యానంద దెబ్బకు.. పరాగ్వే మంత్రి పదవి పోయింది

దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలు.. దాదాపు భారత్ తరహాలోనే ఉంటాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు అవి.

Dec 1, 2023 - 20:40
 0  47
నిత్యానంద దెబ్బకు.. పరాగ్వే మంత్రి పదవి పోయింది

మనభారత్ న్యూస్, 01 డిసెంబరు 2023 , హైదరాబాద్ : ఎక్కడి భారత దేశం.. ఎక్కడి పరాగ్వే..? ఎక్కడి నిత్యానంద స్వామి..? ఎక్కడి పరాగ్వే వ్యవసాయ మంత్రి..? భారత దేశంలో అత్యంత వివాదాస్పదుడై.. పరారీలో ఉన్న నిత్యానంద ఎక్కడో తలదాచుకుని ఏకంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్ కే) పేరిట దేశాన్ని స్థాపించడం ఏమిటో..? ఆ దేశంతో పరాగ్వే మంత్రి ఒప్పందం చేసుకోవడం ఏమిటో..? మొత్తానికి నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు.

దక్షిణ అమెరికాను దడదడలాడిస్తూ.. దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలు.. దాదాపు భారత్ తరహాలోనే ఉంటాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు అవి. అలాంటి దేశాలను ఇప్పుడు నిత్యానంద స్వామి దడదడలాడిస్తున్నాడు. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస తో ఒప్పందాలు అంటూ దక్షిణ అమెరికా దేశాల ప్రభుత్వాలను ఆయన వణికిస్తున్నాడు. ఇలాంటి ఒప్పందమే చేసుకున్నందుకు పరాగ్వే వ్యవసాయ శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఇదే తీరున నిత్యానంద దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను తప్పుదోవపట్టించినట్లు సమాచారం.

ఐక్యరాజ్య సమితిలో కైలాస.. కొంత కాలం కిందట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు జెనీవాలో ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిపై తీవ్ర వివాదం రేగింది. అయితే , ఇదే సమయంలో కైలాసతో దౌత్య సంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని.. అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ఇస్తామని పరాగ్వే మంత్రి అర్నాల్డో చమర్రో సంతకం చేయడం గమనార్హం. ఇప్పుడదే అతడి కొంపముంచింది. ఇలా సంతకం చేయడంపై పరాగ్వేలో దుమారం రేగింది. ఇదొక కుంభకోణమని ఆరోపిస్తూ.. ఆ దేశ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఆడుకున్నారు. దీంతో పరాగ్వే వ్యవసాయ శాఖ మంత్రి ఆర్నాల్డో రాజీనామా చేశారు.

నిత్యానంద దెబ్బ అమెరికాకూ పాకిందా..? పరాగ్వే మంత్రి మాత్రమే కాకుండా.. అమెరికా, కెనడా స్థానిక నాయకులతోనూ కైలాస ప్రతినిధులు ఇదే తరహాలో పలు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రకటన గురించి ఆర్నాల్డో చమర్రో స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ..‘‘యునైటెడ్‌ స్టేట్స్ ఆఫ్‌ కైలాస ఎక్కడుందో నాకు తెలియదు. మౌలిక సదుపాయాలు, నీటి పారుదలకు సంబంధించి పరాగ్వేకు సాయం చేస్తామని కైలాస ప్రతినిధులు ముందుకు రావడంతో నేను సంతకం చేశాను’’ అని తెలిపారు. మరోవైపు పరాగ్వేలోని స్థానిక మున్సిపాలిటిలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన ప్రతులను కైలాస సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉంచడంతో దానిపై తీవ్ర దుమారం చెలరేగింది. గతంలో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్‌ నగర యంత్రాంగాన్ని కూడా కైలాస ప్రతినిధుల ఇదే తరహాలో మోసం చేశారు.

నాలుగేళ్ల కిందట పరార్.. బెంగళూరులోని ఆశ్రమంలో అత్యాచారం సహా వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద.. 2019లో భారత్ విడిచి పారిపోయారు. కొన్నేళ్ల కిందట ఈక్వెడార్‌ సమీపంలోని ఓ ద్వీపంలో ఉన్నట్లు ఇంటర్‌ పోల్‌ వర్గాలు తెలిపాయి. ఆ ద్వీపానికే యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస అని పేరు పెట్టి ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసకు సొంతంగా డాలర్‌, రిజర్వ్‌ బ్యాంకు, జెండా, పాస్‌ పోర్టును తీసుకొచ్చారు. అనంతరం కైలాస ప్రతినిధిగా చెబుతూ.. విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐరాస సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిత్యానందను భారత్‌ వేధిస్తోందని ఆరోపించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్