మెదక్ ఎంపీగా ప్రియాంకా గాంధీ!!
మనభారత్ న్యూస్, 01 డిసెంబరు 2023 , హైదరాబాద్ : తెలంగాణాలో కాంగ్రెస్ పాగా వేయడం ఖాయం అని తేలిపోయిన పరిస్తితులలో కాంగ్రెస్ వైపు నుంచి రకరకాలైన ప్రచారాలు సాగుతున్నాయి. సౌత్ లో కర్నాటక తరువాత తెలంగాణాను కనుక కాంగ్రెస్ పట్టేస్తే హస్తానికి ఎదురు లేదన్న సంకేతాలు కూడా జాతీయ స్థాయిలో వెళ్తాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఒకపుడు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ కి కంచుకోట. ఇందిరా గాంధీని ఎమర్జెన్సీ టైం లో దేశమంతా ఓడిస్తే ఉమ్మడి ఏపీ ఆదుకుంది. విభజన ముందు వరకూ కూడా కాంగ్రెస్ కి తెలంగాణా ఏపీలలో బలం గట్టిగా ఉంది. ఇక పదేళ్ల తరువాత తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది అని సంకేతాలు వస్తున్నాయి.
ఈ నెల 3న వచ్చే ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాంగ్రెస్ హై కమాండ్ కి హాట్ ఫేవరేట్ స్టేట్ గా తెలంగాణా మొత్తం సౌత్ లోనే మారుతుంది అని అంటున్నారు. దానికి భౌగోళిక రాజకీయ పరమైన కారణాలు కూడా అనేకం ఉన్నాయి. తెలంగాణా నుంచి మహారాష్ట్రకు కాంగ్రెస్ ప్రభావం పాకే అవకాశం ఉంది. అలాగే ఏపీ మీద ప్రభావం చూపించేందుకు ఆస్కారం ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు ఒక ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ మెదక్ నుంచి 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారు అని. దీని మీద కాంగ్రెస్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే ఉంది. ఈసారి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అధికారానికి గురి పెడుతోంది.
దాంతో పాటు సౌత్ నుంచి నార్త్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతోంది. రాహుల్ గాంధీ మరోసారి అమేధీ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో ప్రియాంకా గాంధీ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ నుంచి పోటీకి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది.
ఇక్కడే ఒక అందమైన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది అని అంటున్నారు. ఉక్కు మహిళ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ 1980లో మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆమె చివరి సారి ప్రధాని పదవిని నిర్వహించింది మెదక్ ఎంపీగానే.
ఇంతటి విశిష్టత కలిగిన మెదక్ పార్లమెంట్ సీటు ఒకపుడు కాంగ్రెస్ కి కంచు కోట. కానీ గత పాతికేళ్ళుగా చూస్తే ఇక్కడ నుంచి ఇతర పార్టీలే గెలుస్తూ వస్తున్నాయి. 1999, 2004లో బీజేపీ గెలిస్తే 2009 నుంచి ఈ రోజు దాకా బీయారెస్ నాలుగు సార్లు గెలిచింది. విజయశాంతి తో పాటు కేసీయార్ కూడా మెదక్ నుంచి పోటీ చేసి ఎంపీలు అయ్యారు.
ఇంతటి రాజకీయ విశిష్టత కలిగిన మెదక్ ఎంపీ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వస్తే ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు కూడా గెలుచుకోవడం కష్టం కాదు అని భావిస్తోంది. దాంతో ప్రియాంకా గాంధీని పోటీకి దించితే ఆ ప్రభావం మొత్తం తెలనగణా మీద ఉంటుందని కూడా భావిస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రియాంకా గాంధీ గెలుస్తారు అన్న ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.
What's Your Reaction?