జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు.. పూర్తి వివరాలు

Jul 1, 2024 - 15:20
 0
జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు.. పూర్తి వివరాలు

మనభారత్ న్యూస్, 01 జులై 2024, భారత్‌ :-  భారత్‌లో జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్ల పాటు అంటే.. బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు మారనున్నాయి. అయితే ఓవైపు ఈ కొత్త చట్టాలపై నిరసనలు వస్తుండగా.. మరోవైపు వీటి అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

భారత్‌లో జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్ల పాటు అంటే.. బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు మారనున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ (CRP) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ (IEA) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం (BSA) రాబోతున్నాయి. అయితే ఓవైపు ఈ కొత్త చట్టాలపై నిరసనలు వస్తుండగా.. మరోవైపు వీటి అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మార్పుల వల్ల జీరో ఎఫ్‌ఐఆర్‌, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్‌ఎంఎస్‌ వంటి ఎలక్ట్రానిక్ మోడల్ ద్వారా సమన్లు జారీ చేయడం, పెద్ద నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి రూల్స్ అమల్లోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలో రాజద్రోహం స్థానంలో.. దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని కేంద్రం ప్రభుత్వ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 

కొత్త చట్టాల ప్రత్యేకత

నిందితులను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు ఉద్దేశించిన గడువును ఈ కొత్త చట్టాల్లో పెంచారు. ఎవరైన అరెస్టయితే 14 రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్ ఉంటుంది. అయితే 60 రోజుల్లోపు దర్యాప్తును పూర్తి చేయాల్సిన కేసుల్లో దీన్ని 40 రోజులకు పొడిగించారు. అలాగే 90 రోజుల్లోపు దర్యాప్తు చేయాల్సిన కేసుల్లో 60 రోజుల వరకు పెంచారు. ఏడేళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్ ఉన్న నేరాల్లో దర్యాప్తు అధికారులు తప్పకుండా ఫోరెన్సిక్‌ నిపుణులతే ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే FIR నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి. అత్యాచారానికి గురైన బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి. పిల్లలను కొనడం, అమ్మడాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మైనర్‌పై సామూహిక అత్యాచారం చేస్తే.. జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు.

ఆర్థిక సంబంధ నేరాలు

ఇక ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరాల ద్వారా వచ్చిన డబ్బులతో వారుకొన్న చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును రెండు నెలల్లోనే పూర్తి చేయాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. వాళ్లు లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా పోలీసులు కేసు నమోదు చేయాలి. అయితే పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు. క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించడానికి న్యాయస్థానాలు గరిష్ఠంగా కేవలం రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది.

సోదాలు చేసేటప్పుడు అది తప్పనిసరి

కేసు నమోదు నుంచి న్యాయ విచారణ పూర్తయ్యే దాకా ప్రతి సమాచారం కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా బాధితులకు అందించాలి. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలను జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన డిజి లాకర్‌లో జాగ్రత్తగా భద్రపరుస్తారు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌ సిస్టం (CCTNS) ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానం చేశారు. దీంతో సాక్ష్యాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతారు. డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్‌ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ICJS)కు అనుసంధానిస్తారు. దీంతో పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు.. అసరమైనప్పుడు సాక్ష్యాలను పరిశీలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేరు. ఇక ఇళ్ల సోదాల ప్రక్రియను పోలీసులు తప్పకుండా వీడియో తీయించాల్సి ఉంటుంది. సోదాల్లో ఎవైనా అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు.. దానికి సంబంధించిన రిపోర్టును 48 గంటల్లోనే కోర్టులో సమర్పించాలి. దీంతో వాటిని తారుమారు చేసే ఛాన్స్ తగ్గుతుంది. అంతేకాదు బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫర్యాదుపై పోలీసులు 3 రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాలు తీసుకోవాలి. మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు, 15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటినవారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. తాము ఉండే చోటే పోలీసుల సాయం తీసుకోవచ్చు.

దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు ఇకనుంచి డిజిటల్ రూపంలోనే అంటేవ వాట్సప్‌ తదితర మార్గాల్లో పంపొచ్చు. ఇలా చేయడం వల్ల అటు బాధ్యులు, ఇటు పోలీసులు సాకులు చెప్పి తప్పించుకనే ఛాన్స్ ఉండదు. అలాగే సాక్షి మరో ఊరికి వెళ్లి కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వస్తే.. ఆ ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న ఊర్లోనే గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం ఇవ్వొచ్చు. బాధితుల అరెస్టు సమాచారాన్ని వాళ్ల స్నేహితులు, కుటుంబీకులు, బంధువులకు పోలీసులు తెలపాలన్న రూల్‌ను పెట్టారు. దీంతో బాధితులకు తక్షిణమే సాయం లభించే అవకాశం ఉంటుంది. అరెస్టు వివరాలను పోలీస్‌ స్టేషన్లతో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లో బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. బాధితులకు, నిందుతులకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఫ్రీగా అందిస్తారు. పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను రెండు వారాల్లోనే పొందే అవకాశం ఉంటుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News