రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
మనభారత్ న్యూస్, ఢిల్లీ : తొలకరి పలకరిస్తున్న వేళ అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వానాకాలం సీజన్ ఆరంభం అవుతున్న తరుణంలో 2023-24 సీజన్ కు పలు పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారుల ఉత్పత్తులను లాభదాయకం చేయడంతో పాటు పంటల వైవిధ్యతను ప్రోత్సహించేలా పలు పంటల కనీస మద్దతు ధరను పెంచినట్లు వెల్లడించారు.
తాజా నిర్ణయంతో వరి ఏ గ్రేడ్ రకం మద్దతు ధర క్వింటాల్ కు 143 పెంచారు. సాధారణ రకం క్వింటాల్ కు రూ.2,040 ఉండగా తాజా నిర్ణయంతో 2,183కు పెరగనుంది. జొన్న (హైబ్రిడ్) రూ.2,979 ఉండగా 3180 కు, జొన్నలు (మల్దండి) రూ.2990 నుండి రూ.3225కు పెరగనున్నాయి. ఇక రాగులపై క్వింటాల్ కు రూ.268 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సజ్జలపై రూ.150, మొక్కజొన్నపై రూ.128, కందులు రూ.400, పెసర రూ.803, మినుములు రూ.350, వేరుశనగలు రూ.527, సన్ ఫ్లవర్ రూ.360, పత్తి (మీడియం స్టేపుల్) రూ. 540, పత్తి (లాంగ్ స్టేపుల్) 640 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
What's Your Reaction?