తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్.. రేపు అన్ని సంస్థలకు సెలవు
మనభారత్ న్యూస్,29 నవంబరు 2023, హైదరాబాదు:- పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసినందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేయొద్దని సూచించారు.
సోషల్‌మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం కుదరదని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో ఓటుహక్కు లేని స్థానికేతరులు వెంటనే నియోజకవర్గాలను విడిచి వెళ్లాలని స్పష్టంచేశారు. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం నుంచే 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడవద్దని సూచించారు. మంగళవారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంల మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం రాత్రి కల్లా ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలను ప్రలోభ పెట్టేవాటిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్‌రూం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలున్న విద్యాసంస్థలకు బుధ, గురువారాల్లో సెలవు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న విద్యాశాఖ సిబ్బందికి బుధ, గురువారాల్లో సెలవుతోపాటు డిసెంబర్ 1న స్పెషల్ క్యాజువల్ లీవుగా ప్రకటించారు.
What's Your Reaction?