మసీదుల్లోకి షియా ముస్లిం మహిళలను అనుమతించండి - తెలంగాణ హై కోర్టు
మసీదుల్లోకి షియా ముస్లిం మహిళలను అనుమతించండి, దేవుని ముందు అందరూ సమానమే, సంచలన తీర్పును వెలువరించిన తెలంగాణ హైకోర్టు
మనభారత్ న్యూస్, 12 డిసెంబరు 2023, హైదరాబాదు :- తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని దారుల్‌షిఫాలో ఉన్న ఇబాదత్‌ఖానాలోకి అక్బరీశాఖ సహా షియా ముస్లిం మహిళలందరినీ అనుమతించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.ఇబాదత్‌ఖానా అంటే..
ప్రార్థనలు, కూటములు, వేడుకలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకొనే ప్రదేశం. షియావర్గానికి చెందిన మహిళలను ఇబాదత్‌ఖానాలోకి అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ అంజుమన్-ఏ-అలవి, షియా ఇమామియా ఇత్నాసారి అక్బరీ సొసైటీ నాయకురాలు ఆస్మా ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భీమపాక నగేశ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ విచారణ సందర్భంగా మహిళలను మసీదుల్లోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా పేర్కొంది. ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానమేనని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. మసీదు, జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలను రానివ్వకపోవడానికి కారణాలు వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని వక్ఫ్‌బోర్డు సహా ఇతర ప్రతివాదులకు ఆదేశాలు జారీచేస్తూ విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.
శని శింగనాపూర్, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల పరంపరలో రాష్ట్ర హైకోర్టు ముస్లిం మహిళలకు సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది. మసీదులు, జషన్‌లతోపాటు ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించాలని వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
మహిళలు పురుషులకంటే ఏమాత్రం తక్కువ కాదని అభిప్రాయపడింది. పురుషుడికంటే స్త్రీ ఎలా తక్కువ అవుతుందని ప్రశ్నించింది. దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానులేనని, దేవునికి లింగ వివక్ష ఉండదని స్పష్టంచేసింది. పురుషుడి కంటే స్త్రీ తక్కువ అని భావిస్తే.. జన్మనిచ్చిన తల్లి కూడా మహిళేనని, తల్లి మనకంటే తక్కువ ఎలా అవుతుందని కోర్టు నిలదీసింది. నిర్దిష్టమైన కొద్దిరోజులు మినహా మహిళలు నిరభ్యంతరంగా ప్రార్థనా స్థలాల్లోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
మహారాష్ట్రలోని శని శింగనపూర్ (శనీశ్వరుడి) ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దుచేస్తూ బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. ముంబైలోని హాజీ అలీ దర్గాలో పవిత్ర స్థలం లోకి మహిళలను అనుమతించాలని బొంబాయి హైకోర్టు 2016, ఆగస్టు 26న తీర్పు చెప్పింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలని ఆదేశిస్తూ 2018, సెప్టెంబర్ 29న సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
What's Your Reaction?