కారు అద్దాలు బద్దలు కొట్టి, కాలర్ పట్టుకొని లాక్కెళ్లి.. ఇమ్రాన్ అరెస్టు
మనభారత్ న్యూస్,10 మే 2023 : ఇస్లామాబాద్/లాహోర్: అధికారంలో ఉన్నప్పుడు భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్(70)ను పారామిలటరీ రేంజర్లు మంగళవారం అరెస్టు చేశారు.
ఇదే కేసులో ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణకు హాజరైన ఆయనను న్యాయస్థానం ఎదుటే అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు పాకిస్తాన్ సైన్యం కుట్ర పన్నుతోందంటూ ఆరోపించిన మరుసటి రోజే ఇమ్రాన్‌ను అరెస్టు చేయడం గమనార్హం.
కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. కోర్టులో ప్రవేశించేందుకు తన వాహనంలో కూర్చొని బయోమెట్రిక్ ప్రక్రియ నిర్వహిస్తుండగా పారామిలటరీ రేంజర్లు రంగప్రవేశం చేశారు. వాహనం గ్లాస్ డోర్‌ను పగులగొట్టి, ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ భద్రతా సిబ్బందిని, లాయర్లను రేంజర్లు దారుణంగా కొట్టారని పీటీఐ సీనియర్ నేత షిరీన్ మజారీ ఆరోపించారు. ఇమ్రాన్ పట్ల రేంజర్లు అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వా రా వెల్లడయ్యింది. కాలర్ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లి, జైలు వ్యాన్‌లోకి విసిరేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 1న అరెస్టు వారెంట్
ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి చెందిన అల్-ఖదీర్ ట్రస్టుకు బాహ్రియా పట్టణంలో రూ.53 కోట్ల విలువైన భూమిని బదిలీ చేసిన కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు ఇస్లామాబాద్ పోలీసులు ప్రకటించారు. మంగళవారం ఉదయమే అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆయనను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్‌ఏబీ)కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ అరెస్టు వారెంట్‌ను ఈ నెల 1న జారీ చేసినట్లు దానిపై ఉన్న తేదీని బట్టి తెలుస్తోంది.
అవినీతి వ్యవహారాల్లో ఆయన నిందితుడని అందులో పేర్కొన్నారు. అరెస్టు తర్వాత ఇమ్రాన్‌ను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇమ్రాన్‌ను హింసించారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదని, అందుకే ఎన్‌ఏబీ ఆ యనను అదుపులోకి తీసుకుందని తెలియజేశారు.
140కి పైగా కేసులు
ఇమ్రాన్ అరెస్టు పట్ల పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంగణంలోనే లాయర్లపై రేంజర్లు దాడి చేశారని, దేశంలో అరాచకం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కస్టడీలో ఉన్న ఇమ్రాన్‌ను దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్ పదవి కోల్పోయారు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అవినీతి, ఉగ్రవాదం, దైవదూషణ, హత్య, హింసకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద ఇమ్రాన్‌పై 140కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ అరెస్టు నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
జైలుకు వెళ్లడానికి సిద్ధం: ఇమ్రాన్
ఇమ్రాన్ అరెస్టయిన తర్వాత.. ముందుగా రికార్డు చేసిన ఓ వీడియోను పీటీఐ విడుదల చేసింది. ''నా మాటలు మీకు చేరుకునేలోపు ఎలాంటి ఆధారాల్లేని కేసులో నన్ను అరెస్టు చేస్తారు. పాకిస్తాన్‌లో ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యానికి సమాధి కట్టినట్లు దీనిద్వారా తేటతెల్లమవుతుంది. అవినీతికి పాల్పడినట్లు నేను అంగీకరించాలని వారు(పాక్ పాలకులు) కోరుకుంటున్నారు. దిగుమతి అయిన ప్రభుత్వాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దారు. వారెంట్ ఉంటే నన్ను అరెస్టు చేసుకోండి. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా'' అని ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
ఇమ్రాన్ అనుచరుల విధ్వంసం
పాకిస్తాన్‌లో అవాంఛనీయ దృశ్యాలు కనిపించాయి. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు వీధుల్లోకి వచ్చారు. విధ్వంసానికి పాల్పడ్డారు. రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన గేటును ధ్వంసం చేశారు. సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ప్రధాన గేటును ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి. లాహోర్‌లో సైనిక కమాండర్ నివాసాన్ని సైతం నిరసనకారులు దిగ్బంధించారు. సైనిక కంటోన్మెంట్‌లో గుమికూడి నినాదాలు చేశారు. రహదారులపై బైఠాయించడంతో లాహోర్ నుంచి చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇమ్రాన్ అరెస్టు వార్తా ఉదయమే దావానలంగా వ్యాపించింది. వెంటనే ఆయన అనుచరులు వివిధ నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇమ్రాన్‌ను పారామిలటరీ రేంజర్లు శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని నినదించారు. నిరసనలు హింసాత్మకంగా మారాయి. పెషావర్, కరాచీ, హైదరాబాద్, క్వెట్టా తదితర ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పింది. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి, ఇమ్రాన్ మద్దతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
What's Your Reaction?