పవన్ టార్గెట్ గా ముద్రగడ....!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరువు మొత్తం తీసేసారు మాజీ మంత్రి వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

Mar 16, 2024 - 19:04
 0
పవన్ టార్గెట్ గా ముద్రగడ....!

మనభారత్ న్యూస్, 16 మార్చి 2024, ఆంధ్రప్రదేశ్  :-  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరువు మొత్తం తీసేసారు మాజీ మంత్రి వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు అని ఇండైరెక్ట్ గానే అయినా హాట్ కామెంట్స్ చేశారు. వీళ్ళా నాకు రాజకీయ పాఠాలు చెప్పేది అంటూ ఒక స్థాయిలో ఆయన మండిపడ్డారు.

మీరేమిటి గొప్ప అని కూడా ప్రశ్నించారు. తన కుటుంబం సినిమాల్లోనే 1951లో ప్రవేశించింది అని కొత్త విషయం చెప్పారు. రాజకీయాల్లో కూడా తమ కుటుంబం ఎంతో ముందు నుంచి ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు రాజకీయాల్లో ఏబీసీడీలు తెలియని వాళ్లా నన్ను విమర్శించేది అంటూ ముద్రగడ ఫైర్ అయ్యారు.

నీవు సినిమాల్లో మాత్రమే హీరో రాజకీయాల్లో కాదు అని ఏకి పారేశారు. అసలు సినిమా హీరోలకు రాజకీయాల్లో ఆదరణ అన్నది ఎన్టీఆర్ తోనే పోయిందని ఆయన విశ్లేషించారు. ప్రజలు సినిమా నటులు ఎపుడూ ప్రజలకు చేరువ కాలేరని కూడా అన్నారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్నారు.

తాను రాజకీయాల్లో హీరోను అని ముద్రగడ బిగ్ సౌండ్ చేశారు. అంతే కాదు ముద్రగడ ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను వైసీపీ వ్యవస్థాపకులలో ఒకడిని అని అన్నారు. ఆనాడు జగన్ తో పాటే నడవాలనుకున్నా కొన్ని శక్తులు కాకుండా చేశాయని చెప్పారు. ఇపుడు తాను వైసీపీలోకి రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

తనకు జగన్ ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తాను అని ముద్రగడ హామీ ఇచ్చారు. తనను ఎక్కడ నుంచి పోటీ చేయమన్నా కూడా పోటీ చేస్తాను అని ఆయన చెప్పారు. జగన్ ని ముప్పయ్యేళ్ల పాటు సీఎం గా ఉంచేందుకు అవసరమైన ప్రణాళిక తన వద్ద ఉందని ముద్రగడ అన్నారు.

ఇదిలా ఉంటే తనను కాపు జాతిని చంద్రబాబు అవమానించినపుడు ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. చంద్రబాబు తనను దారుణంగా అవమానించిన రోజున తాను ఆత్మహత్య చేసుకుందామని తలచాను అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అయితే దేవుడే తనకు మాట చెప్పినట్లుగా బతికి ఉంచారని అన్నారు.

చంద్రబాబు పతనం కళ్లారా చూడమని దేవుడు తనను ఆ ప్రయత్నం విరమింపచేశారు అని అన్నారు. 2019లో చంద్రబాబు ఘోరంగా ఓడి ఇంటికి చేరారు అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో తమ కుటుంబం కీలక పాత్ర పోషించింది అని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నపుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళన చేసారు అని ఆయన చెప్పారు.

ఏపీకి న్యాయం చేయమని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దని అపుడే తాను బీజేపీలో చేరుతాను అని ఆ పార్టీ పెద్దలకు లేఖ రాశాను అని ఆయన చెప్పారు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాలేదని ఆయన చెప్పడం విశేషం. తనను వైసీపీ ఆదరించినందువల్లనే వారి వెంట ఉన్నాను అని చెప్పారు.

తనకు కాపులతో పాటు బీసీలు, ఎసీ లు ఇతర వర్గాలు కూడా ఎపుడూ మద్దతుగా నిలిచాయని ఆయన చెప్పారు. మొత్తం మీద చూస్తే ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ముద్రగడ చెప్పడం చూస్తూంటే ఆయన పిఠాపురం నుంచి ఏకంగా పవన్ మీదనే తలపడతారు అని అంటున్నారు. అందుకే ఆయన వైసీపీలో చేరిన మరుసటి రోజే కిర్లంపూడిలో తన ఇంట్లో మీడియా మీటింగ్ పెట్టి మరీ పవన్ ని ఘాటుగా విమర్శించారు అని అంటున్నారు.

పిఠాపురంలో ముద్రగడకు మంచి పట్టు ఉంది. 2009లో ఆయన పోటీ చేస్తే నలభై అయిదు వేల ఓట్లు వచ్చాయి. ఈసారి ఆయన పిఠాపురంలో పోటీకి దిగవచ్చు లేదా మొత్తం ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ తరఫున ఆయన ప్రచారం చేపట్టవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ తోనే తేల్చుకుంటాను చంద్రబాబు రాజకీయ పతనం మరోసారి చూస్తాను అంటూ ముద్రగడ వైసీపీలో చేరారు. ఈ పరిణామాలతో గోదావరి జిల్లాల రాజకీయ సామాజిక పరిణామాలు పెద్ద ఎత్తున మారిపోయాయని అంటున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్