బాలయ్య.. పవన్.. లోకేశ్.. మహిళా అభ్యర్థులతో పోటీ
షెడ్యూల్ కు నాలుగైదు గంటల ముందే అభ్యర్థులందరినీ ప్రకటించేసి సమరానికి సిద్ధం అని స్పష్టం చేసింది
మనభారత్ న్యూస్, 16 మార్చి 2024, ఆంధ్రప్రదేశ్ :- ఏపీలో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. గతంలో లాగే తనదైన శైలిలో ఒకేసారి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లనూ వెల్లడించింది. దీంతోపాటు 25 ఎంపీ సీట్లకూ పోటీ చేసేవారిని ప్రకటించింది. షెడ్యూల్ కు నాలుగైదు గంటల ముందే అభ్యర్థులందరినీ ప్రకటించేసి సమరానికి సిద్ధం అని స్పష్టం చేసింది.
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని రెండు స్థానాలపై అందరి చూపూ ఉంటుందని అనడంలో సందేహం లేదు. అవి పిఠాపురం, మంగళగిరి. 2019లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, నాడు మంత్రిగా ఉన్న లోకేశ్ సైతం మంగళగిరిలో పరాజయం పాలయ్యారు. వీరిద్దరికీ అవి తొలి ప్రత్యక్ష ఎన్నికలు కావడం గమనార్హం. నాడు వీరు ఓడింది కూడా పురుష అభ్యర్థుల చేతిలోనే. ఇక ఆ తర్వాత ప్రజా క్షేత్రంలోనే ఉంటూ వివిధ కార్యక్రమాల ద్వారా తమ పట్టును పెంచుకునేందుకు ప్రయత్నించారు. మరోసారి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.
మహిళా అభ్యర్థులతో ఢీ
వైసీపీ వచ్చే ఎన్నికలకు ప్రకటించిన జాబితాలో పిఠాపురంలో కాకినాడ ప్రస్తుత ఎంపీ వంగా గీత పోటీ చేయనున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వంగా గీత పలు పదువులు చేపట్టారు. పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీలోకి వెళ్లారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచే కాకినాడ ఎంపీగానూ గెలిచారు. అంతకుముందు టీడీపీ నుంచిరాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించారు. ఇలా అసెంబ్లీ, లోక్ సభ, రాజ్య సభ మూడు చట్ట సభలకూ ప్రాతినిధ్యం వహించిన ప్రత్యేకత సొంతం చేసుకున్నారు.
లోకేశ్ ఇక మంగళగిరి లో గత ఎన్నికల్లో ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఈసారీ అక్కడినుంచే పోటీకి దిగబోతున్నారు. ఆయనపై వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేయనున్నారు. వాస్తవానికి ఈసారి గంజి చిరంజీవిని బరిలో దింపుతారని భావించినా నిర్ణయం మార్చుకుని లావణ్యకు టికెట్ ఇచ్చారు. ఈమె మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అంతేకాక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడులు. ఇక కాండ్రు కమలకు వైఎస్సార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
బాలయ్య హిందూపురంలోనూ..
హిందూపురం నుంచి 2014, 2019లో పోటీచేసి గెలిచారు టీడీపీ కీలక నేత బాలక్రిష్ణ. హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్న ఆయనపై వైసీపీ ఈసారి టీఎన్ దీపికను నిలిపింది. గత రెండు ఎన్నికల్లో నవీన్ నిశ్చల్, మొహమ్మద్ ఇక్బాల్ తో తలపడిన బాలయ్య సులువుగానే గెలిచారు. ఈసారి దీపిక ఎంపిక వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నాయని హిందూపురంలో టాక్ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీలో నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ ఇక్బాల్‌తో పాటుగా దివంగత నేత చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబం టికెట్ రేసులో నిలిచాయి. ఇలా వరుసగా తలనొప్పులు రావడంతో వ్యూహాత్మకంగా దీపికను తెరపైకి తీసుకొచ్చారు. హిందూపురం వైఎస్సార్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి భార్య దీపిక.. ఆమెది కురుబ సామాజికవర్గం కాగా.. భర్త రెడ్డి సామాజిక వర్గం. ఈ నిర్ణయంతో ఈ రెండు కులాలకు దగ్గర కావచ్చన్న ప్లాన్‌తో దీపికకు హిందూపురం బాధ్యతలు అప్పగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
What's Your Reaction?