ఏపీ సీఎం పదవి.. బాబుకు మోదీ షాక్‌!

ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ మాటలపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది...

Mar 18, 2024 - 20:08
 0
ఏపీ సీఎం పదవి.. బాబుకు మోదీ షాక్‌!

మనభారత్ న్యూస్, 18 మార్చి 2024, ఆంధ్రప్రదేశ్  :-  ఆంధ్రప్రదేశ్‌ లో పొత్తు కుదిరాక టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో తొలి సభను ‘ప్రజాగళం’ పేరుతో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు మూడు పార్టీల ముఖ్య నేతలు.. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ మాటలపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్లు ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రసంగం మొత్తంలోనూ ఆయనెక్కడా చంద్రబాబును, పవన్‌ కళ్యాణ్‌ ను అభినందిస్తూ మాట్లాడకపోవడంపై టాక్‌ నడుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేయాలని అని చెప్పకుండా ఎన్డీయే కూటమికి ఓట్లేయాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీయే కావడం ఇక్కడ గమనార్హం.

మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆశించిన చంద్రబాబుకు మోదీ గట్టి షాకే ఇచ్చారని టాక్‌ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీయేకు రాకుండా కాంగ్రెస్‌ కు మళ్లించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని కూడా మోడీ ఆరోపించారు. ఇలా తన ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ ఎన్డీయే కూటమిని గెలిపించాలని అన్నారే కానీ చంద్రబాబు సీఎం కావాలని లేదా పవన్‌ సీఎం కావాలని వ్యాఖ్యానించలేదు.

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలు ఉండాలంటున్న మోదీ మాటల వెనుక నిగూడార్థం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అంటే బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారనేది ఆయన మాటల ఉద్దేశమని ఊహాగానాలు నడుస్తున్నాయి.

ఎన్డీయే కూటమి తరఫున పురందేశ్వరిని ఏపీ ముఖ్యమంత్రిని చేయాలనేది నరేంద్ర మోదీ ఉద్దేశమా అని ఆయన మాటల వెనుక నిగూడార్థాన్ని వెతుక్కుంటున్నారు. చంద్రబాబుపై ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఆయనను 50 రోజులకుపైగా జైలులో పెట్టింది. అలాగే చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ తో పాటు టీడీపీ ముఖ్య నేతలందరిపైన కేసులు దాఖలయ్యాయి.

ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసుల విచారణ ముందుకు సాగకుండా ఉండటానికి ప్రధాని మోదీ ఏదడిగినా ఇవ్వడానికి చంద్రబాబు ముందుంటారని అంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి కూడా ఆయన సిద్ధపడొచ్చని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాని మోదీ చంద్రబాబును ఏమాత్రం అభినందించకపోవడం, పొగడకపోవడం దీన్నే సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు అనుభవాన్ని కానీ, విజన్‌ ను కానీ, ఆయన సీఎంగా ఉండాల్సిన అవసరాన్ని కానీ మోదీ ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.

కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అనే మాట వెనుక మోదీ ఉద్దేశాలు వేరని అంటున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని మోదీ పలుమార్లు నొక్కిచెప్పడం వెనుక కీలక వ్యూహం ఉందని చెబుతున్నారు.

బీజేపీ ఏపీలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.. ఎన్ని గెలుస్తుంది? అనే విషయాన్ని పక్కనపెడితే కూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరనే అంతిమ అధికారం మోదీకే ఉంటుందంటున్నారు. ఎన్డీయే ముఖ్యమంత్రి అని ప్రధాని మాటల వెనుక ఉద్దేశం కూడా అదేనని అంటున్నారు. దీని ప్రకారం.. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సీఎంను చేయడమే మోదీ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు. పురంధేశ్వరి ఏపీకి సీఎం అవుతారని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి గతంలోనే ప్రస్తావించడం గమనార్హం.

మోదీ ప్రసంగం టీడీపీ శ్రేణులకు సంతోషాన్ని ఇవ్వలేదని అంటున్నారు. చంద్రబాబు అనుభవాన్ని పొగుడుతూ వైఎస్‌ జగన్‌ ను మోదీ తిట్టిపోస్తారని టీడీపీ శ్రేణులు అంచనా వేశాయి. అయితే వారి అంచనాలు తప్పడంతో తీవ్ర నిరాశ తప్పలేదని అంటున్నారు.

కాగా ప్రధాని మోదీ హిందీ ప్రసంగానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన అనువాదం ఫన్నీగా సాగిందని అంటున్నారు.

‘యహాన్‌ కే లోగ్‌...రాజ్య సర్కార్‌ సే ఇత్నా అక్రోసిత్‌ హై కీ ఉసే హఠానే కా మన్‌ కర్‌ చుకే హై’ అని నరేంద్ర మోదీ హిందీలో అన్నారు.

దీనికి ఖచ్చితమైన అనువాదం ఏమిటంటే.. ‘ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడి ప్రభుత్వంపై చాలా కోపంగా ఉన్నారు, వారు దానిని తొలగించాలని నిర్ణయించుకున్నారు’ అని. కానీ పురందేశ్వరి దానిని తెలుగులో కొన్ని అదనపు పదాలతో అనువదించారు, ‘ఏదైతే రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం ఉందో.. దానిని పెకలించి విసిరివేయాలని ఆంధ్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారని నాకైతే అర్థమౌతున్న విషయం‘ అని తెలిపారు. 

మోదీ తన ప్రసంగంలో అవినీతిలో వేళ్లూనుకున్న ప్రభుత్వం అని అనకపోయినా పురందేశ్వరి మాత్రం కొన్ని అదనపు పదాలను చేర్చి అనువాదం చేశారు. తద్వారా టీడీపీ, జనసేన శ్రేణులను సంతోషపెట్టడానికి ప్రయత్నించారు.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్