జనసేన ఆఫీసుకు టులెట్ బోర్డు.. భారీ షాక్!

Feb 10, 2024 - 14:54
 0
జనసేన ఆఫీసుకు టులెట్ బోర్డు.. భారీ షాక్!

మనభారత్ న్యూస్, 10 ఫిబ్రవరి 2024 :-  ఏపీలో జనసేన ప్రభుత్వం వస్తుంది అని అధినాయకులు చెబుతున్నారు. అయితే దిగువ స్థాయిలో పరిణామాలు చూస్తే షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అన్ని పార్టీల మాదిరిగానే జనసేన కూడా ఉందని అంటున్నారు. పార్టీ కోసం ఏళ్లకు ఏళ్ళు పనిచేస్తున్న వారిని పక్కన పెట్టేసి ఎన్నికల వేళకు వచ్చే వారికి కండువాలు కప్పి టికెట్లు ఇస్తున్నారు అని విమర్శలు వినిపిస్తున్నాయి.

 

జనసేనలో చేరడం కోసం తన ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలేసిన ఒక నేతకు పార్టీ ఇపుడు ఢోకా ఇవ్వడంతో ఆయన నాకెందుకొచ్చిన తంటా అనుకుంటూ చాలా కాలంగా పార్టీ అఫీసుని అద్దె కట్టి నడుపుతున్నది కాస్తా మూత వేయించేశారు. నెలకు అరవై ఆరు వేల రూపాయలు అద్దె కట్టి విశాఖ లాంటి సిటీలో కీలకమైన చోట జనసేన పార్టీ ఆఫీసు పెట్టి ఏళ్లకు ఏళ్ళు నడిపారు ఆయన.

 

ఆయన ఒక్కరే కాదు, ఒక కీలక మహిళా నాయకురాలు, గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె కూడా విశాఖలో జనసేనను పటిష్టం చేశారు. అలాగే పర్యావరణం కోసం నిరంతరం పోరాడే మరో ముఖ్య నేత కూడా జనసేనకు విశాఖలో పెద్ద దిక్కుగా ఉండేవారు. ఇపుడు ముగ్గురు నేతలనూ పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు అన్న బాధ ఉంది.

 

దాంతో మాకెందుకొచ్చిన తంటా అని అద్దె కట్టడాన్ని ఒక కీలక నేత మానుకుంటే జనసేన ఆఫీసు ఓవర్ నైట్ మూత పడిపోయింది. దానికి టులెట్ బోర్డు పెట్టేశాడు సదరు ఇంటి యజమాని. ఎన్నికలు ముంగిట పెట్టుకుని జనసేన ఆఫీసు మూతపడడం మంచి పరిణామమేనా అన్నది కార్యకర్తలలో ఆలోచనలు రేపుతోంది.

 

పార్టీని భుజాల మీద మోసిన వారికి సరైన గుర్తింపు లేదని నిన్న కాక మొన్న వచ్చిన వైసీపీ జంపింగ్ ఎమ్మెల్సీ, అలాగే అనకాపల్లికి చెందిన మరో మాజీ మంత్రి, వైసీపీ పార్టీ పదవికి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్ళిన ఇంకో నేతకు మాత్రమే పార్టీ విశాఖలో ప్రాధాన్యత ఇస్తోంది అని అంటున్నారు.

 

దీంతో పార్టీలో ఆది నుంచి ఉంటూ నిలబెట్టిన వారి సంగతేంటి అని వారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పార్టీలకు జనసేనకు మధ్య తేడా ఉందని, పవన్ ఆదర్శాలు నచ్చి తాము పార్టీలో చేరితే చివరికి ఇలాగేనా అని సీనియర్లు మధన పడుతున్నారు.

 

ఇదిలా ఉంటే రోజుకు విశాఖలో జనసేన ఆఫీసు అంటూ లేదు. దాంతో వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ అయిన ఎమ్మెల్సీ ఇపుడు ఆఫీసుని కొత్తగా ఓపెన్ చేసి ఆర్ధిక భారాలు మోయాలని ఆదేశాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో జంపింగ్స్ వల్ల పార్టీలో ఆది నుంచి ఉన్న వారికి అన్యాయమే జరుగుతోంది. ఇది అన్ని పార్టీలలోనూ ఉంటోంది. వలస నేతలు మొదటి వరసలో ఉంటూ సీట్లూ పదవులూ దక్కించుకుంటే పార్టీ అధినేతలు అసలైన క్యాడర్ కి ఇస్తున్న సందేశం ఏంటి అని అడుగుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్