రెడ్ బుక్‌.. రెడ్ సిగ్న‌ల్‌!

Dec 19, 2023 - 11:58
Dec 19, 2023 - 11:59
 0
రెడ్ బుక్‌.. రెడ్ సిగ్న‌ల్‌!

మనభారత్ న్యూస్, 19 డిసెంబరు 2023 :-  నారా లోకేశ్‌కు సామాజిక ప్రయోజనాల కంటే వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధానమైంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టి... డిసెంబర్‌ 18న విశాఖలో ముగించారు 226 రోజుల పాటు నడక సాగించి 3,132 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకున్నారు.  

ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లిలో పాదయాత్ర విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో చంద్రబాబుకు లోకేశ్‌ రెడ్‌ బుక్‌ అందించనున్నారు. తెలుగుదేశం సంక్షేమ పథకాల కంటే, రెడ్‌ బుక్‌ గురించే లోకేశ్‌ ఎక్కువ ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కార్‌ టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించిన అధికారుల పేర్లను రెడ్‌ బుక్‌లో రాశారు. టీడీపీ అధికారంలోకి రాగానే రెడ్‌బుక్‌లో రాసుకున్న అధికారులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరుతూ చంద్రబాబుకు అందించనున్నట్టు లోకేశ్‌ చెబుతున్నారు.

మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన యువ నాయకుడు... దారి పొడవునా తెలుసుకున్న ప్రజా సమస్యలేంటో రాసుకున్న పుస్తకాన్ని చంద్రబాబుకు అందిస్తానని ప్రకటించి వుంటే బాగుండేది. పరిణితి కలిగిన నాయకుడిగా లోకేశ్‌ గుర్తింపు పొందేవాడు. అందుకు విరుద్ధంగా రెడ్‌బుక్‌ను చంద్రబాబుకు అందించి, ప్రతీకార వేట మొదలవుతుందని హెచ్చరించడం టీడీపీ శ్రేణులకు సంతోషం కలిగించవచ్చు.  

కానీ విద్యావంతులు, మేధావులెవరూ రెడ్‌ బుక్‌ లాంటి వార్నింగ్‌లను అంగీకరించరు. అధికారం అంటే ప్రతీకారం తీర్చుకోడానికి ప్రజలు ఇచ్చే బాధ్యత అనుకోవడం దుర్మార్గం. వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి మధ్య అధికార మార్చిడి జరిగినప్పుడల్లా వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని కేసులు, ఇతరత్రా పేర్లతో వేధించడం కొనసాగితే, ఇక పాలనపై దృష్టి సారించేదెప్పుడు? ఇందుకేనా జనం అధికార మార్చిడి కోరుకునేది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  

టీడీపీ నేతల వార్నింగ్‌లు చూస్తుంటే, రానున్న ఎన్నికల్లో అధికారం మారితే అరాచకం పెరగడమే తప్ప, ప్రజలకు ఒరిగేది శూన్యమనే సంకేతాల్ని రెడ్‌బుక్‌ తెలియజేస్తోంది అని చెప్పక తప్పదు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News