ఇకపై పేపర్ లీక్ చేయాలంటే భయపడాల్సిందే
ఓ పెద్ద పోటీ పరీక్ష వస్తుందంటే చాలు ఎక్కడ పేపర్ లీక్ అవుతుందా అని స్టూడెంట్స్ బిక్కుబిక్కుమనే పరిస్థితి వచ్చింది.
మనభారత్ న్యూస్, 10 ఫిబ్రవరి 2024 :- పోటీ పరీక్ష వస్తుందంటే చాలు ఎక్కడ పేపర్ లీక్ అవుతుందా అని స్టూడెంట్స్ బిక్కుబిక్కుమనే పరిస్థితి వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. దీనిపై కేంద్రం ఓ కఠిమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లో ఆ చట్టానికి ఆమోద ముద్ర లభించింది.
ఇకపై పరీక్షల్లో ఎవరైనా అవకతవకలకు, తీవ్రమైన దుర్వినియోగానికి పాల్పడితే వాళ్లకు పదేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు.. కోటి రూపాయల వరకు జరిమానా విధించేలా కొత్త చట్టం అమల్లోకి రానుంది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అక్రమాల నిరోధక బిల్లు-2024ను 3 రోజుల కిందట లోక్ సభలో ఆమోదించారు. ఈరోజు మూజువాణి ఓటుతో రాజ్యసభలో ఆమోదించారు. రాష్ట్రమతి ఆమోదముద్రతో త్వరలోనే ఇది చట్టంగా రూపుదాల్చనుంది.
పోటీ పరీక్షల్లో అక్రమాల్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. ఐపీసీలో ఈ స్థాయిలో జరిమానా విధిస్తూ బిల్లును ఆమోదించడం ఈమధ్యకాలంలో ఇదే తొలిసారి.
ఇది ప్రధానంగా ప్రశ్నా పత్రాలను లీక్ చేయడం లేదా జవాబు పత్రాలను ట్యాంపరింగ్ చేయడం వంటి వ్యవస్థీకృత మోసాలు, కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుంది. ఇలాంటి అక్రమాల్లో పాల్గొన్న వ్యక్తులు ఇకపై కఠిన శిక్షలు ఎదుర్కోబోతున్నారు.
అయితే దీనిపై ప్రతిపక్షాలు, విద్యావేత్తలు మరోలా స్పందిస్తున్నారు. పరీక్షల్లో అక్రమాల్ని నిరోధించడానికి ఆల్రెడీ ఉన్న చట్టాలు సరిపోతాయని, పైగా విద్యార్థులకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వడం ఏంటంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మరోవైపు విద్యావేత్తలు ఏమంటున్నారంటే, ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే కంటే, విద్యావనరుల పెంపు, విద్యార్థులపై పరీక్ష ఒత్తిడి తగ్గించడం, పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు చేయడం ఉత్తమమని అంటున్నారు. త్వరలోనే చట్టంగా రాబోతున్న ఈ బిల్లు, సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
What's Your Reaction?