టిడిపి పై.. మోడీ షా ఆట స్టార్ట్...!?
ఏపీలో చంద్రబాబు ఇక మళ్లీ సీఎం కాకూడదు. ఇది కేంద్ర స్థాయి బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలగా ఉంది అని అంటున్నారు.
మనభారత్ న్యూస్, 04 మార్చి 2024 :- ఏపీలో చంద్రబాబు ఇక మళ్లీ సీఎం కాకూడదు. ఇది కేంద్ర స్థాయి బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలగా ఉంది అని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటికంటే మించి మోడీ అమిత్ షాలు చంద్రబాబుని బాగా చదివేశారు. చదివేసిన బాబు రాజకీయ జీవిత పుస్తకంలో అనేక పేజీలు కీలక పుటలు వారికి బాగా గుర్తు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ప్రతీ సారీ ఊపిరిపోస్తూంటే బీజేపీని బాబు ఏపీలో అంతకంతకు పాతాళం లోతులు చూపిస్తూ ముంచేశారు అనేది ఒక పార్టీ పెద్దలుగా వారికి ఉన్న ఆవేదన.
దానితో పాటుగా చంద్రబాబు నమ్మదగిన వారు కాదు అన్నది ఇంకా గట్టి భావన. చంద్రబాబుని వాజ్ పేయ్ అద్వానీ ద్వయం ఎంతో నమ్మి చేరదీస్తే 1999 నుంచి 2004 మధ్య బాబు ఆడుకున్న ఆట నాడు గుజరాత్ సీఎం గా మోడీ ఆయన మంత్రి వర్గ సహచరుడిగా అమిత్ షా చాలా దగ్గర ఉండి చూశారు అని అంటున్నారు. గెలుపు వచ్చిన ప్రతీసారి తాను ఎంజాయ్ చేస్తూ ఓటమి నెపం బీజేపీ మీద నెట్టేస్తూ బాబు గత పాతికేళ్ళుగా బీజేపీతో సయ్యాట ఆడారని కమలనాధుల గట్టి నమ్మిక.
ఇదిలా ఉంటే 2014లో బాబుని చేరదీసి ఊపిరి పోస్తే ఆయన పార్టీ నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తే ఏపీలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినట్లే ఇచ్చి వారికి ఏ విధంగానూ అధికారాలు లేకుండా చేశారు అన్నది బీజేపీ పెద్దల వైపు నుంచి వస్తున్న మరో మాట. ఇక నాలుగేళ్ల పాటు ఏపీలో బీజేపీ నుంచి అన్ని రకాల ప్రయోజనాలు పొంది 2018 నాటికి బీజేపీని దోషిగా జనం ముందు పెట్టి మోడీ అమిత్ షాలను ఎన్ని రకాలుగా బాబు నిందించారో తీవ్ర విమర్శలు చేశారో అందరికీ గుర్తుందిట. బీజేపీ పెద్దలకు అవి మరచిపోలేనివే అని అంటున్నారు.
ఇక 2018లో ఏకంగా కాంగ్రెస్ తోనే పొత్తులు పెట్టుకుని తెలంగాణాలో బాబు పోటీ చేసిన తీరుని వారు గుర్తు చేసుకుంటున్నారు. అంతవరకూ ఎందుకు 2023 ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ పోటీ పెట్టకుండా కాంగ్రెస్ కి తన ఓట్లు వేయించి హెల్ప్ చేసింది అన్న ఆక్రోశం కూడా ఉందిట. ఇక నాడు టీడీపీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ గెలిచేది కాదని, బీజేపీ కూడా ఎక్కువ సీట్లు తెచ్చుకునేదని, ఆ విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి బలం ఇచ్చేలా టీడీపీ కాంగ్రెస్ కి తెలంగాణాలో ఊపిరిపోసిందని కమలనాధులు మండిపోతున్నారు.
పోనీ అనుకుని పొత్తులకు రెడీ అవుతున్నా కూడా బాబు గత మూడు నెలల్లో చేసిన అనేక చర్యలు ఇక పొత్తుకు రాం రాం అనిపించేలా చేశాయని అంటున్నారు. అవెలా అంటే బాబు తమతో మిత్రుడిగా ఉన్న జనసేన పవన్ ని తన వైపునకు తిప్పుకున్నారు. ఇక ఆయనతో కలసి పొత్తు పెట్టుకుని కూటమిలోకి పిలిచారు. దీని మీద బీజేపీ అగ్ర నాయకత్వం చంద్రబాబుని ఢిల్లీకి పిలిపించుకుని చర్చించింది.
వారు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. దాని ప్రకారం చూస్తే మూడు పార్టీలకు ఏపీలో అధికారం ఉండేలా ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఉండేలా సీట్ల పంపిణీ ఉండాలని ఒక కండిషన్ పెట్టారు. అంతే కాదు సింహ భాగం ఎంపీ సీట్లు బీజేపీకి కట్టబెట్టాలని కోరారు. అయితే ఆ ప్రతిపాదన మీద టీడీపీ ఏమీ చెప్పకుండా కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండి సడెన్ గా టీడీపీ జనసేన తొలి విడత జాబితాను రిలీజ్ చేసేశారు. ఇది బీజేపీ పెద్దలకు మండుకొచ్చే చర్య అని అంటున్నారు.
తమను పొత్తుకు పిలిచి మళ్లీ ఆ రెండు పార్టీలే సీట్లను పంచుకుంటే అందులో తాము కోరిన సీట్లు కూడా ఉంటే ఇక ఇపుడు పొత్తు పేరంటం ఎందుకు అన్నదే బీజేపీ పెద్దల మాటగా ఉందిట. దాంతో పాటు ఏపీలో వైఎస్ షర్మిలను తెచ్చి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసి అందులోకి కామ్రేడ్స్ ని పొత్తుకు పంపించడంలో కూడా టీడీపీ వ్యూహాలు ఉన్నాయని బీజేపీ పెద్దలు అనుమానిస్తున్నారుట. అంటే కాంగ్రెస్ తో బంధం తెలంగాణా టూ ఏపీ అలా కంటిన్యూ అవుతూంటే మధ్యలో తామెందుకు అన్నదే బీజేపీ పెద్దల ఆగ్రహంగా ఉందిట.
ఈ నేపధ్యంలో ఏపీలో టీడీపీ అయినా వైసీపీ అయినా రేపు తాము గెలిస్తే తమతోనే ఉంటాయని ఆ మాత్రం భాగ్యానికి పొత్తు పేరుతో టీడీపీకి ఊపిరి పోయడం ఎందుకు అన్న భావన బీజేపీ అగ్ర నాయకత్వంలో ఉంది అని అంటున్నారు. బాబుని మళ్లీ సీఎం ని చేస్తే ఏపీలో ఇక బీజేపీ అన్నది ఉండదని అందుకే ఆయన గెలుపునకు తాము మాత్రం కారణం కారాదని బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు. దీంతో దాదాపుగా బీజేపీ ఒంటరి పోరుకే రెడీ అవుతుందని అంటున్నారు.
అయితే టీడీపీని పొత్తు విషయం తేల్చకుండా ముంచకుండా అలా టెన్షన్ కి పెడుతూ నోటిఫికేషన్ వచ్చేశాక ఏ సంగతీ చెబుతారు. అదే అసలైన వ్యూహం అని అంటున్నారు. అంటే టీడీపీకి బ్రేకులు వేసి వారిని ఎన్నికల వేళ ఏమీ కాకుండా చేయడమే కమల వ్యూహం అని అంటున్నారు.
What's Your Reaction?