టీచర్ల అక్రమ బదిలీలు రద్దు

ఉపాధ్యాయుల అక్రమ బదిలీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం

Jul 23, 2024 - 14:37
 0
టీచర్ల అక్రమ బదిలీలు రద్దు

మనభారత్ న్యూస్, 19 జూలై  2024, ఆంధ్రప్రదేశ్, అమరావతి, : ఉపాధ్యాయుల అక్రమ బదిలీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు బదిలీ ఆర్డర్లు పొందిన 917 మంది బదిలీలను రద్దు చేసింది. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు పలు దఫాలుగా అప్పటి ప్రభుత్వం భారీగా అక్రమ బదిలీలు చేసింది. వాటిలో 653 మంది బదిలీలను అప్పటి సీఎం ర్యాటిఫై చేశారు. 917 మందికి ఆర్డర్లు ఇచ్చినా ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వాటిని ర్యాటిఫై చేయలేదు. దీంతో బదిలీ అయినప్పటికీ వారు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఆదేశాలను నిలుపుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆ తర్వాత తమను బదిలీ చేసినా రిలీవ్‌ చేయట్లేదంటూ 215 మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే పాఠశాల విద్యాశాఖ అప్పటి బదిలీలకు సంబంధించిన రాటిఫికేషన్‌ ఫైలును సీఎంకు పంపింది. దానిని పరిశీలించిన సీఎం చంద్రబాబు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 917 మంది బదిలీ ఉత్తర్వులు రద్దయి పోయాయి. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ అక్రమ బదిలీలను ఒక వ్యాపారంగా మార్చేసింది. అడిగినంత ఇస్తే బదిలీ అన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరించింది. 

తద్వారా రూ.వంద కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

చేసింది చాలా.. ఆగింది కొన్నే

సాధారణంగా ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై ఎప్పుడూ నిషేధం ఉంటుంది. బదిలీలు చేయాలని నిర్ణయించినప్పుడు సీఎం ఆమోదంతో ఆ నిషేధాన్ని కొద్దిరోజులు సడలిస్తారు. సడలింపులు లేకుండా బదిలీలు చేయాలనుకుంటే ఆ ఫైలుకు సీఎం ఆమోదం తప్పనిసరి. అయితే, అప్పటి సీఎం జగన్‌ ఆదేశాలతోనే గత ప్రభుత్వంలో పెద్దఎత్తున అక్రమ బదిలీలు చేశారు. దాదాపు రెండేళ్ల వ్యవధిలో 2,400 బదిలీలకు ఆర్డర్లు జారీచేశారు. వీటికి ‘సిఫారసు బదిలీలు’ అనే పేరు పెట్టారు. అంతకుముందు ఏ ప్రభుత్వంలోనూ ఇంత భారీ సంఖ్యలో సిఫారసు బదిలీలు చేయలేదు. ఒక్కో టీచర్‌ నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేసి ఈ బదిలీలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికలకు చాలా కాలం ముందే ఈ తరహాలో బదిలీలు పూర్తిచేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరోసారి ఈ తరహా అక్రమ బదిలీలకు తెరదీశారు. వాటిలో 653 మంది బదిలీలకు అప్పటి సీఎం జగన్‌ ఆమోదముద్ర వేశారు. దీంతో వాటిని ఆపే పరిస్థితి లేకుండా పోయింది. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు మరో 917 మందికి బదిలీ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ బదిలీలను సీఎం రాటిఫై చేయలేదు. కోడ్‌ ఉన్నందున కొత్త స్థానాలకు వెళ్లొద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. దీంతో అప్పు డు బ్రేక్‌ పడగా, ఇప్పుడు ఏకంగా రద్దయ్యాయి.

విచారణకు డిమాండ్లు

టీచర్ల అక్రమ బదిలీలపై విచారణ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయన కార్యాలయం జోక్యం ఈ బదిలీల్లో ఎక్కువగా ఉంది. అలాగే కొందరు అధికారులు, రెండు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రత్యక్షంగా ఇందులో భాగస్వామ్యం కావడంతో వారిపై చర్యలు తీసుకోవాలని టీచర్లు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో 1.7 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది కౌన్సెలింగ్‌ విధానంలో నిబంధనల ప్రకారం బదిలీ అయ్యా రు. ఇలా కొద్ది మంది నగదు, రాజకీయ సిఫారసులతో దొడ్డిదారిన బదిలీ చేయించుకోవడాన్ని మిగిలిన టీచర్లు సహించలేకపోతున్నారు. ఇలాగైతే అందరూ ఏదో ఒక సిఫారసు పట్టుకుని బదిలీ చేయించుకుంటారని, ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ విధానం కొనసా గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్పందించని ప్రభుత్వం

ఇకపై టీచర్ల బదిలీల్లో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల ప్రకటించారు. దీనికోసం గత ప్రభుత్వం ప్రతిపాదించిన టీచర్ల బదిలీల చట్టం రూపకల్పన అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా అంతకంటే ముందు జరిగిన బదిలీల సంగతేంటనే దానిపై ప్రభుత్వం స్పందించట్లేదు. దానిపై విచారణ జరిపించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా దానిపై ఎలాంటి ప్రకటన చేయట్లేదు. ఎలాగూ బదిలీలు జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు చేసేదేం లేదు అనే భావనలో కొత్త ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. కానీ టీచర్లు మాత్రం విచారణ చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News