కూటమి కి అమిత్ షా షాక్!!
మనభారత్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్, (23/04/2034) : తెలుగుదేశం పార్టీ భయపడినట్లే అయ్యింది. చంద్రబాబు అంచనా వేసినట్టే పరిస్థితి మారింది. బిజెపితో కలవడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ముస్లింలు దూరం అవుతారు అన్న భయం ఉండేది.
కానీ ఎన్నికల నిర్వహణ, బలమైన వైసీపీని ఢీకొట్టాలంటే కేంద్ర సాయం ఉండాలని చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే పేరుకే పొత్తు కానీ.. బిజెపి అంటేనే టిడిపి శ్రేణులకు ఒక రకమైన భావన ఉంది. మనస్ఫూర్తిగా పనిచేయలేకపోతున్నారు. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో.. బిజెపి నేతలను కనీసం ప్రచారానికి పిలవడం లేదు. బిజెపి జెండా కూడా కనిపించడం లేదు. ఎన్నికల అవసరాల కోసమే బిజెపితో కలిశామని.. ఆ పార్టీతో తమకు సంబంధం లేదని ముస్లిం ఓటర్లకు టిడిపి నాయకులు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బిజెపి అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా చేసిన కీలక ప్రకటనతో తమకు డ్యామేజ్ తప్పదని టిడిపి తో పాటు చంద్రబాబు ఆందోళనకు గురవుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి ముస్లిం, మైనారిటీ ఓటు బ్యాంకు ఉండేది. కానీ ఆ పార్టీ బిజెపితో జతకట్టడంతో చాలావరకు మైనారిటీలు దూరమయ్యారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి చేరువయ్యారు. 2014లో ప్రత్యేక పరిస్థితుల్లో ముస్లింలు చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టినా.. 2019 కి వచ్చేసరికి పూర్తిగా సీన్ మారింది. ముస్లింలు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు. వైసిపి అంతులేని విజయానికి కారణమయ్యారు. అయితే అదే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు పెట్టలేదు. పైగా టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రకటించిన పథకాలను సైతం రద్దు చేసింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో స్నేహం కొనసాగించింది. దీంతో ముస్లింలలో మార్పు ప్రారంభమైంది. కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించారు. అయితే తాజా ఎన్నికల్లో బిజెపితో టిడిపి జతకట్టింది. అయినా సరే ఏ పరిస్థితుల్లో చంద్రబాబు కలిశారో అన్నది వారికి తెలుసు. అందుకే వారు గుంభనంగా ఉన్నారు.
బిజెపితో జత కట్టినా ముస్లింలు తమను ఆదరిస్తారని చంద్రబాబు భావించారు. గతం మాదిరిగా గుంప గుత్తిగా ముస్లిం ఓట్లు వైసిపికి పడే ఛాన్స్ లేదని ఒక అంచనా వేశారు. అయితే తాజాగా బిజెపి అగ్రనేత అమిత్ షా కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ముస్లింలు బిజెపి పై ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయంగా బిజెపిని విభేదిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బిజెపితో టిడిపి జతకట్టడంతో ఆ ప్రభావం ఉంటుందన్నది ఒక అంచనా. ఈ సమయంలోనే వైసిపి పావులు కదుపుతోంది. అమిత్ షా చేసిన ప్రకటనతో కూటమిని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తోంది. ముస్లింల రిజర్వేషన్లు తొలగింపు అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంటుంది.దీంతో ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో తమకు నష్టం తప్పదని తెలుగుదేశం పార్టీ భయపడుతోంది. ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమవుతోంది. బిజెపితోనే దిద్దుబాటు ప్రకటనకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి అయితే టిడిపి భయపడినంత పని జరిగింది. దీని నుంచి ఆ పార్టీ బయట పడుతుందా? లేదా? అన్నది చూడాలి.
What's Your Reaction?