ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పించన్లు పంపిణీ జరగాలి
మనభారత్ న్యూస్, 29 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, అమలాపురం :- నూతన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం పింఛన్ల పంపిణీ ఉద్యోగులతో ఎంపీడీవో జి.రాజ్ మనోజ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ ప్రసాద్ మాట్లాడుతూ సాధ్యం కాని హామీలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చారని వైఎస్‌ఆర్ పార్టీ నాయకులు హేళన చేసారన్నారు. సాధ్యమవుతుందని సోమవారం కూటమి ప్రభుత్వం నిరూపిస్తుందన్నారు. మూడు వేల రూపాయల పింఛను సొమ్మును ఒకే సారి నాలుగు వేలుకు పెంచడమేగాక హామీ ఇచ్చిన నాటినుండి మూడు నెలలకు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు సోమవారం నుంచి అందజేస్తారన్నారు. అలాగే వికలాంగ పించను సొమ్ము మూడు వేలు నుంచి ఆరు వేలకు పెంచి పంపిణీ చేస్తామన్నారు. ఒక్క కడియం మండలం లోని 12,144 మంది పెన్షన్ దారులకు ఎనిమిది కోట్ల 20 లక్షల 43వేల 500 రూపాయలు బ్యాంకుల నుంచి శనివారం డ్రా చేసినట్లు ఎంపిపి ప్రసాద్ వివరించారు. ఎంపీడీవో రాజ్ మనోజ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలు మేరకు సోమవారం ఉదయం నుంచి ఈ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి సాయంత్రానికి 98శాతం పూర్తిచేయాలన్నారు. ఇందుకుగాను 27 సచివాలయాల పరిధిలో 14 మంది మండల స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
What's Your Reaction?