కూటమికి ఓట్లేస్తే... ముస్లిం రిజర్వేషన్లు గోవిందా!
తెలంగాణ బీజేపీలో చాలా స్పష్టంగా మత పరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేయడాన్ని గమనించొచ్చు
మనభారత్ న్యూస్, 18 ఏప్రిల్ 2024, ఆంధ్రప్రదేశ్ :- ఏపీలో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తే... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తారా? అంటే... బెననే సమాధానం వస్తోంది. దీనికి తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోనే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, విద్యావంతులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రిజర్వేషన్లను రద్దు చేయరని టీడీపీకి చెందిన ముస్లిం నేతలతో చెప్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ బీజేపీలో చాలా స్పష్టంగా మత పరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేయడాన్ని గమనించొచ్చు. "We will Abolish Unconstitutional Religion Based Reservations" అని తెలంగాణ బీజేపీలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు తేల్చి చెప్పారు. బీజేపీ విధానాలు ఏపీలో ఒకలా, తెలంగాణలో అందుకు భిన్నంగా వుండవు. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పాలసీని అమలు చేస్తారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ బహిరంగంగానే ప్రకటిస్తుంటే, ఏపీలో మాత్రం చేయరని ఏ ప్రాతిపదికన తెలుగుదేశం నేతలు చెబుతున్నారనే ప్రశ్నకు వారి నుంచి సమాధానం మాత్రం వుండదు.
బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్నప్పుడు, ఏపీలో మాత్రం మొహమాటం ఎందుకని ఆ పార్టీకి చెందిన నాయకులు నిలదీయడం చర్చనీయాంశమైంది. ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు, విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన రెండు ట్వీట్లను గమనిస్తే, ఏపీలో ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తారనే నమ్మకం లేదు. ఆయన రెండు ట్వీట్లలో ఏముందంటే...
"వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన మతపరమైన రిజర్వేషన్లను అధికారంలోకి రాగానే తొలగిస్తామని బీజేపీ తెలంగాణ నొక్కి చెబుతున్నది. ఈ రిజర్వేషన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి వర్తిస్తాయి. తెలంగాణ విధానమే ఏపీ బీజేపీకి వర్తించాలి. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టో కూటమి విడుదల చేసిందా అంటే అలాంటిదేమీ లేదు. అటువంటప్పుడు ఈ విషయంలో అంత మొహమాట పడాల్సిన అవసరం ఏపీ బీజేపీకి ఎందుకు వస్తుందో అర్ధం కావటం లేదు".
వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఏపీలో బీజేపీతో పొత్తు వల్ల ఆ పార్టీ చెప్పిందానికల్లా చంద్రబాబు తల ఊపాల్సిన పరిస్థితి. నిర్ణయాధికారం చంద్రబాబు చేతిలో ఏమీ వుండదు. ఏపీలో కూడా రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ ప్రకటించి వుండేది. కానీ ఎన్నికల్లో నష్టపోతామని చంద్రబాబునాయుడు బతిమలాడుకోవడంతో తాత్కాలికంగా బీజేపీ జాతీయ నాయకత్వం దయ చూపింది.
అంతే తప్ప, ఎవరికోసమో మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలనే తన నిర్ణయాన్ని అమలు చేయడంలో బీజేపీ వెనక్కి తగ్గదు. అందుకే కూటమి పార్టీలకు ఓట్లు వేస్తే, తమ రిజర్వేషన్లు రద్దు అవుతాయనే ఆందోళన ముస్లింలలో నెలకుంది. ముస్లింల ఆందోళనను అర్ధం చేసుకోదగ్గదే. రిజర్వేషన్లను కాపాడుకోవడం ముస్లింల చేతల్లోనే వుంది. రద్దు చేస్తామన్న వారితో జత కట్టిన వారిని రానున్న ఎన్నికల్లో ఏం చేయాలో వారిష్టం.
What's Your Reaction?