అగ్రనేతలపై రాళ్ల దాడులు...జనం ఏమనుకుంటున్నారంటే!
మనభారత్ న్యూస్, 15 ఏప్రిల్ 2024, ఆంధ్రప్రదేశ్ :- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో శనివారం రాత్రి జరిగిన దాడి ఒరిజినల్ అని చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ నిర్ధారించారు. జగన్పై దాడి తానే చేయించకున్నది కాదని, ఆగంతుకుల పనే అని ప్రతిపక్ష నేతలిద్దరూ తమ చర్యల ద్వారా నిరూపించారు. ఎందుకంటే, వెంటనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సభల్లో రాళ్ల దాడులంటూ టీడీపీ, జనసేన ఓవరాక్షన్ చేయడం ఆ పార్టీలకు నష్టం తీసుకొచ్చింది.
పైగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సమీపాలకు కూడా ఆ రాళ్లు వెళ్లకపోవడంతో ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం చేసుకున్నారనే అభిప్రాయాన్ని కలిగించారు. దాడి అంటే జగన్కు అయినట్టు రక్త గాయాలు కావాలి కదా అనే ప్రశ్న సామాన్య ప్రజానీకం నుంచి కూడా వస్తోంది. అదేంటో గానీ, పవన్, చంద్రబాబులకు అలాంటివి ఏవీ కాకుండానే, ఏదో జరిగిపోయిందనే ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా సిద్ధంగా వుంటుంది. కానీ నమ్మడానికే జనం సిద్ధంగా లేరు.
జగన్పై రాయి దాడి అంటే... మాపై కూడా రాళ్ల దాడి జరిగిందని చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ అంటున్నారు జగన్ది డ్రామా అంటున్న ఈ పెద్ద మనుషులు, తమనెలా చూస్తారనే వెరపు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బాబు, పవన్లను కనీసం ఆ రాళ్లు తగలకపోవడం చూసిన జనం... కనీసం స్క్రిప్ట్ అయినా మార్చండయ్యా అని హితవు చెబుతున్నారు.
విశాఖపట్నం నగర పరిధిలోని పాతగాజువాక జంక్షన్లో నిర్వహించిన సభలో చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడని కొత్త పల్లవి అందుకున్నారు. ఆ రాయి చంద్రబాబు వాహనాన్ని ముందున్న ఇనుప బారికేడ్కు తగిలి కింద పడిపోయిందట. గట్టిగా శబ్దం రావడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది, పోలీసులు అప్రమత్తం అయ్యారని నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నాన్ని చూడొచ్చు.
అసలే రాజకీయ తెరపై నటనలో ఆరితేరిన చంద్రబాబునాయుడు రాయి దాడిని ఆడ్డం పెట్టుకుని బీరాలు పలికారు తనపై క్లైమోర్ మైన్స్‌తో దాడి జరిగితేనే భయపడలేదని, రాళ్ల దాడి చేస్తే భయపడతానా? అంటూ తన మార్క్ నటన ప్రదర్శించారు.
ఇదిలా వుండగా గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి యాత్రపై మార్కెట్‌యార్డ్ సమీపంలో రాయి విసిరినట్టు జనసేన నాయకులు తెలిపారు. అయితే ఆ రాయి ఆయనకు తగలకుండా పక్కకు పోయిందట. రాయి విసిరిన యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే రాయి ఎవరూ విసరలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. పవన్పై రాయి విసురుతున్నాడనుకుని అభిమానులు తమకు అప్పగించారని పోలీసులు తెలిపారు.
కనీసం రాళ్ల దాడి విషయంలో జనం నవ్విపోతారనే స్పృహ కూడా లేకుండా చంద్రబాబు, పవన్ డ్రామాలాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్పై రాళ్ల దాడి చంద్రబాబే చేయించారనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. దీంతో నష్ట నివారణకు తమపై కూడా రాళ్ల దాడి అంటూ బాబు, పవన్ నాటకానికి తెర తీశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేంటో గానీ, రాళ్లు చంద్రబాబు, పవన్ను తాకడానికి ఎందుకు భయపడుతున్నాయో ఎవరికీ అర్థం కాని విషయం. జగన్కు ఏది జరిగితే, దాన్నే ఆ ఇద్దరు నేతలు అనుసరించడం విమర్శలకు దారి తీస్తోంది.
జగన్కు గాయాలు కావడం, పవన్, చంద్రబాబు దగ్గరికి కూడా రాళ్లు వెళ్లకపోవడంతో... ఇదంతా టీడీపీ, జనసేన ఆడుతున్న డ్రామాగా జనానికి అర్థమైంది. అంతేకాదు, జగన్పై వీళ్లే దాడి చేయించి, దాని నుంచి బయటపడడానికే కొత్త నాటకం మొదలు పెట్టారనే అభిప్రాయం బలపడుతోంది.
What's Your Reaction?