కాలుష్యం పై కోహన్స్ లైఫ్ సైన్సెస్ కెమికల్ కర్మాగారం వద్ద ముక్త్యాల గ్రామస్తుల ఆందోళన
కాలుష్యం పై గ్రామస్తుల ఆందోళన
జగ్గయ్యపేట, జనవరి 20 (మనభారత్ న్యూస్) : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్తేశ్వరపురం(ముక్త్యాల) గ్రామ సమీపంలో ఉన్న కోహన్స్ లైఫ్ సైన్సెస్ కెమికల్ కర్మాగారం విస్తరణ మూలంగా వస్తున్న కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. కోహన్స్ లైఫ్ సైన్సెస్ కెమికల్ కర్మాగారం వల్ల ఇప్పటికే నీటి కాలుష్యం, వాయు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, రైతుల పంట పొలాలు దెబ్బ తింటున్నాయని,కృష్ణా నది సైతం కంపెనీ మూలంగా నీటి కాలుష్యం జరుగుతుందని ఆందోళన కారులు ఆరోపించారు.
కంపెనీ వారికి ఎన్నోసార్లు సమస్యలను మోరపెట్టుకున్న వారు మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కర్మాగారం నుండి వెలువడుతున్న కెమికల్ కాలుష్యం వలన ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆరోగ్య పరంగానూ, పంట దెబ్బ తినట్టంతో ఆర్థికంగా నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కంపెనీ గేటు ముందు గ్రామస్తులు ఆందోళనతో నిరసన వ్యక్తం చేశారు. హుటాహుటిన పోలీసులు చేరుకున్నారు. తమకు 24 గంటల సమయం ఇవ్వాలని, కంపెనీ యాజమాన్యం తో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియచేశారు.
What's Your Reaction?