డోలాయమానంలో షర్మిల!

తెలంగాణ కాంగ్రెస్‌ లో షర్మిల చేరికకు కొందరు మొగ్గుచూపుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు

Aug 29, 2023 - 13:47
 0
డోలాయమానంలో షర్మిల!

మనభారత్ న్యూస్ ,29-08-23, హైదరాబాదు : తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ వైఎస్సార్‌ పార్టీ ఏర్పాటు చేశారు.. దివంగత సీఎం వైఎస్సార్‌ కుమార్తె.. షర్మిల. అయితే షర్మిల పార్టీని అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓవైపు కాంగ్రెస్‌ పార్టీ, మరోవైపు భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అత్యంత బలంగా ఉన్నాయి. వీటికి తోడు తాను ఉన్నానంటూ బీజేపీ కూడా అడపదడపా ఉనికి చాటుకుంటోంది. ఇంకా చిన్నాచితక పార్టీలు ఎలాగూ ఉన్నాయి.

రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణలో కాలికి బలపం కట్టుకుని పాదయాత్ర చేశారు.. షర్మిల. అయితే ఇన్ని పార్టీల మధ్య ఆ పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు రాష్ట్రమంతా పాదయాత్ర చేసినా ఒక్కరంటే ఒక్క పేరున్న నేత కూడా ఆ పార్టీలో చేరలేదు. దీంతో షర్మిల కూడా రూటు మార్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలవగానే ఆ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ను పలుమార్లు కలసి వచ్చారు. కాంగ్రెస్‌ లోకి ఎంట్రీ ఇవ్వడానికే షర్మిల.. డీకే శివకుమార్‌ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

కాగా షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లేదా క్రై స్తవులు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయొచ్చని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వ్యూహం మరోలా ఉందని అంటున్నారు. షర్మిలను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనేది వ్యూహమని చెబుతున్నారు. ఏపీలో షర్మిలతో పాదయాత్ర చేయించి తమకు దూరమైన ఎస్సీ, మైనారిటీ, ఎస్టీ వర్గాలను, కొంతమేరకు రెడ్డి సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలనేది కాంగ్రెస్‌ వ్యూహమని పేర్కొంటున్నారు.

అయితే షర్మిల ఏపీపైన ఆసక్తి చూపడం లేదని ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాకే చెందిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయనను కాంగ్రెస్‌ లోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. తుమ్మల కాంగ్రెస్‌ లోకి వస్తే పాలేరు సీటు ఇస్తామని చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ లో షర్మిల చేరికకు కొందరు మొగ్గుచూపుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గతంలోనే వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏపీకి చెందిన వ్యక్తి అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణను తెచ్చుకుందే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికి అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అలాంటిది.. షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తామంటే అంటే ఊరుకుంటామా? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

తాను జీవించి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకి నాయకత్వం వహించరు అని రేవంత్‌ రెడ్డి కుండబద్దలు కొట్టారు. షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమే అన్నారు.

అదే సమయంలో షర్మిల ఏపీ కాంగ్రెస్‌ కి పని చేస్తే తప్పకుండా స్వాగతిస్తాను అని రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అయితే సహచర పీసీసీ చీఫ్‌ గా తాను ఆమెని కలుస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కూడా షర్మిలను ఏపీ నుంచే పోటీ చేయించడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కు షర్మిల అవసరం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ రూపంలో గట్టి మాస్‌ లీడర్, అనుభవం రీత్యా జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలాంటి నేతలు ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

దీంతో షర్మిల పరిస్థితి డోలాయమానంలో పడిందని చెబుతున్నారు. ఏపీలో కంటే తెలంగాణలోనే రాజకీయాలు చేయాలని షర్మిల భావిస్తున్నారని అంటున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచే ఆమె బరిలోకి దిగడానికే మొగ్గుచూపుతున్నారని పేర్కొంటున్నారు. అయితే అందుకు ఇంకా కాంగ్రెస్‌ అధిష్టానం ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో షర్మిల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందని అంటున్నారు.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News