ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకపై ఉచితంగా, మార్గదర్శకాలివే!

Jul 5, 2024 - 16:29
Jul 6, 2024 - 14:30
 0
ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకపై ఉచితంగా, మార్గదర్శకాలివే!

మనభారత్ న్యూస్, 05 జూలై  2024, ఆంధ్రప్రదేశ్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనుంది. ఉచిత ఇసుకపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు.. సోమవారం (జులై 8) నుంచి ఈ మార్గదర్శకాలు అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను రూపొందించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇకపై ప్రభుత్వం రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను ఇసుకను రూ.475 చొప్పున విక్రయించగా.. ఇందులో కాంట్రాక్టర్ తవ్వకాలు, రవాణా ఖర్చు రూ.100 తీసేస్తే.. మిగిలిన రూ.375 ప్రభుత్వానికి వచ్చేది. తాజా నిర్ణయం ప్రకారం.. రూ.375 కాకుండా.. కేవలం రూ.88 మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ డబ్బులు కూడా స్థానిక సంస్థలకు జమ చేయనున్నారు.. ఇందులో సీనరేజ్‌ ఛార్జ్ కింద రూ.66 (టన్నుకు) తీసుకుంటున్నారు. ఈ రూ.66ను నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. రూ.19.80 జిల్లా ఖనిజ నిధి కింద వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది. రూ.1.32 గనులశాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్‌కు వెళ్లనుంది. గతంలో ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక ప్రతి టన్నుకు రూ.287 భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ పాయింట్లలో ఈనెల 8 నుంచి ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు రూ.88 వసూలు చేస్తారు. అలాగే ఆ స్టాక్ పాయింట్ ఏ రీచ్‌ నుంచి ఇసుక తవ్వి, తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్‌ పాయింట్‌లో లోడింగ్‌ అయ్యే ఖర్చు తీసుకుంటారు. ఈ రేట్‌ను కలెక్టర్లు ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నదుల్లోకి పడవల్లో వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను రూ.625కి విక్రయిస్తుండగా.. ఇందులో బోట్స్‌మెన్‌ సొసైటీకి.. టన్నుకు రూ.200 వెళుతుంది. కొత్తగా రాబోతున్న ఉచిత ఇసుక విధానంలో.. ఇకపై బోట్స్‌మెన్‌ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు రూ.200తో పాటుగా సీనరేజ్‌ రూ.88 కలిపి రూ.288కే విక్రయిస్తారు. ఉచిత ఇసుకకు సంబంధించి.. సెప్టెంబరు వరకు ఆన్‌లైన్‌ పర్మిట్లు లేకుండా విక్రయిస్తారు. అక్టోబరు నుంచి ఆన్‌లైన్‌ పర్మిట్లు జారీచేసి, ఆన్‌లైన్‌ చెల్లింపులు ఉంటాయంటున్నారు అధికారులు. కొత్త విధానం ప్రకారం.. ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్‌ గనులశాఖ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సిందే. అంతేకాదు ఈ వాహనాలు ఒక రూట్‌కు అనుమతి తీసుకొని, మరో మార్గంలో వెళితే చర్యలు తప్పవు. ఉచిత ఇసుకకు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సెప్టెంబరు వరకు కోటి టన్నుల ఇసుక అవసరం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే ఐదారు నెలలు వర్షాకాలం కావడంతో నదుల్లో ఇసుక తవ్వకాలకు కుదరదు.. పర్యావరణ అనుమతులు కచ్చితంగా తీసుకోవాల్సిందే. అందుకే ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో ఎంత ఇసుకు ఉందని ఆరా తీస్తోంది ప్రభుత్వం. కొన్ని అనధికారికంగా ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నట్లు సమాచారం ఉండటంతో.. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే ఇసుక విషయంలో అక్రమాలు చేసిన వారిపై చర్యలు తప్పవంటోంది ప్రభుత్వం. మొత్తం మీద ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు మేలు జరుగుతుంది అంటోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

suneelkumaryandra My Name is Dr Suneelkumar Yandra, Journalist, Writer & Film Director.