కర్మ సిద్ధాంతం ఏం చెబుతుంది?

Jul 23, 2024 - 14:52
 0
కర్మ సిద్ధాంతం ఏం చెబుతుంది?

అన్ని జన్మలలోను మానవ జన్మ దుర్లభమైనది మరియు ఉత్తమమైనది. 

మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాడు. చేసిన ప్రతి కర్మకు ఫలితము అనుభవించి తీరాలి. 

ఈ ఫలితాలనే కర్మ ఫలములు అని కూడా అంటారు. ఈ కర్మ ఫలములు అనేక జన్మలు జీవుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. 

పుణ్య కర్మలు పక్వానికి వచ్చినప్పుడు దేవలోకంలో జన్మించి ఆ భోగములను అనుభవించి తిరిగి మనుషుడుగా జన్మ ఎత్తుతాడు. 

దేవలోకంలో కర్మ చేసే వీలు ఉండదు. అది భోగ భూమి. "క్షీనే పుణ్యే మర్త్యలోకం విశంతి". 

అలానే పాప కర్మలు పక్వానికి వస్తే జీవుడు జంతువులూ, పశువులు, పక్షులు, క్రీములు, కీటకాలుగా నీచ యోనులయందు జన్మిస్తాడు. అనేక బాధలు అనుభవిస్తాడు. 

ఈ జన్మలలో కూడా శరీరం మనస్సు ఉంటాయి గాని బుద్ది మాత్రం ఉండదు. కాబట్టి జంతు జన్మలో కూడా భగవంతుని సాక్షాత్కారము కలిగే అవకాశమే లేదు.

పుణ్య పాప కర్మలు మిశ్రమముగా పక్వానికి వచ్చినప్పుడు జీవుడు మానవ జన్మ ఎత్తుతాడు. 

కర్మ ఫలముగా సుఖములను, దుఃఖములను అనుభవిస్తాడు. కర్మ ఫలముని అనుభవించటమే కాక కొత్త కర్మలు కూడా చేసే అవకాశం కేవలం మానవ జన్మలోనే కలుగుతుంది. 

పరమాత్మని అందుకోవడానికి కావలసిన కర్మలు చేసే అధికారం, జ్ఞానం వున్నా ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది. "జంతూనాం నర జన్మ దుర్లభం" అని శంకరులు వివేక చూడామణి లో తెలియచేసారు. 

ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మని సార్ధకం చేసుకోడానికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి.

రోజు మనం అనుభవించే సుఖములు అశాశ్వతమైనవి. ఎవరు  ఎంత సంపాదించిన ఎదో వెలితి ఉంటుంది. 

అనిత్యమైన వస్తువులతో వచ్చే సుఖములు కూడా అనిత్యమైనవే. ఏది నిత్యమైనదో, ఏది శాశ్వతమైనదో, ఏది పరిపూర్ణమైనదో అదే మనకి శాశ్వతమైన సుఖమును ఇస్తుంది. 

నిత్యమైన వస్తువు ఏకమైనా పరమాత్మ మాత్రమే. శాశ్వతమైన సుఖము అంటే - "మోక్షం". సర్వబంధాలనుండి విముక్తి.

అనంత కోటి జన్మలనుండి మనం చేస్తున్న కర్మలే మనల్ని ఈ ప్రపంచానికి కట్టివేసి బంధాలై వున్నాయి. 

ఏవేవో కోరికలతో ఎన్నో కర్మలు చేసే ఆ కర్మలకు ఫలములుగా, ఇల్లు, వాకిళ్లు, తోటలు, పరిశ్రమలు, పదవులు ఎన్నెన్నో సంపాదించుకుంటాము. 

సంపాదించిన ప్రతిఒక్కటి మనం వదిలి వెళ్ళవలసిందే. కానీ సంపాదించటానికి చేసిన కర్మలు, ఆలోచనలు, సంకల్పాలు జీవునితోనే వాసనలుగా వచ్చి బంధించి వేస్తుంటాయి. 

ఈ బంధాలు ఉన్నంత కాలం మనిషి చస్తూ బతుకుతూ ఉండవలసిందే. ఈ బంధాలన్నీ వదిలేయాలంటే కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవాలి.

ఒక ప్రభుత్వాన్ని నడపటానికి రాజ్యాంగం ఎలాగో, ఈ సృష్టినంతటిని నడపటానికి కర్మ సిద్ధాంతం ఒకటి వుంది. 

కర్మ సిద్ధాంతం భగవన్నిర్మితం. దీనిలో లొసుగులు వుండవు. ఎవరికీ మినహాయింపులు వుండవు. దీనికి అందరు సమానులే. సాక్షాత్తు శ్రీ రామచంద్రుని తండ్రి దశరధునికి పుత్రవియోగం తప్పలేదు. 

శ్రీ కృషుని తల్లి తండ్రులకి కారాగారవాసం తప్పలేదు. కర్మ సిద్ధాంతం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది.

మనం ఉదయం లేచిన దగ్గరనుండి చేసే పనులన్నీ కర్మలే. మనం చేసే ప్రతి కర్మ ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను మూడు రకాలుగా విభజించారు.

1 ఆగామి కర్మలు
2 సంచిత కర్మలు
3 ప్రారబ్ధ కర్మలు

ఆగామి కర్మలు - మనం భోజనం చేస్తే ఆకలి తీరుతుంది. నీళ్లు తాగితే దాహం తీరుతుంది. ఎవరినైనా తిడితే వాడు బలం కలవాడు అయితే తిరిగికొడతాడు. అది కర్మ ఫలం. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే కర్మఫలమును ఇచ్చి శాంతిస్తాయి. ఆలా శాంతించే కర్మలని ఆగామి కర్మలు అని అంటారు.

సంచిత కర్మలు - కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఉదాహరణకి ఒక చెట్టును నాటడం, ఒక చెరువు త్రవ్వించటం, ఒక పాఠశాల కట్టడం, దాన ధర్మాలు చెయ్యడం, ఒకడిని పరోక్షంగా దూషించడంలాంటివి. ఈ కర్మలు అదే జన్మలో ఫలితమును ఇస్తే అది ఆగామి. అలాకాని పక్షంలో ఆ కర్మలు జీవుడితోనే వాసనలుగా ఉంటాయి. ఒక జన్మ నుండి మరొక జన్మకు మోసుకు వచ్చిన కర్మలను సంచిత కర్మలు అని పిలుస్తారు. ఒక అద్దె ఇంటి నుండి ఇంకొక ఇంటికి మారేటప్పుడు మనం సంపాదించిన డబ్బును, వస్తువులను ఎలా అయితే తీసుకువెళ్తామో అలానే జీవుడు ఒక దేహంతో చేసిన కర్మఫలములని తరువాతి జన్మకి మూట కట్టుకుని వెళ్తాడు. అలంటి కర్మలే సంచిత కర్మలు.

ప్రారబ్ధ కర్మలు - పక్వానికి వచ్చిన సంచిత కర్మలని ప్రారబ్ధ కర్మలు అంటారు. ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి తగిన శరీరమును వెతుక్కుని జీవుడు జన్మ తీసుకుంటాడు.

ప్రారబ్ధ కర్మలు అనుభవించడం పూర్తి అయ్యేదాకా ఆ శరీరములో వుంది పూర్తి అయిన వెంటనే ఆ శరీరమును విడిచి వెళ్ళిపోతాడు. 

ఈ జీవితం ముగిసేలోగా చేసిన కర్మలు, ఇంతకుముందు చేసిన సంచితములతో కలిసి పోతాయి, 

మళ్ళి పక్వానికి సిద్ధముగా వున్న సంచితములన్ని ప్రారబ్ధములుగా మారి జీవుడు మళ్ళి జన్మ ఎత్తుతాడు.

భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు వేల మందిలో కొందరు మాత్రమే దైవాన్ని అన్వేషించి చివరకు మోక్షాన్ని పొందుతారు."వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమె నన్ను యదార్థంగా తెలుసుకోన గలుగుచున్నాడు." 

భగవద్గీత (7:౩)

మిగిలిన వాళ్ళు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండవలసిందే. "పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం"

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News