సచివాలయ వ్యవస్థను రద్దు చేయం : నారా లోకేష్
మనభారత్ న్యూస్, 25 ఏప్రిల్ 2023, ఆంధ్రప్రదేశ్ : గ్రామ సచివాలయ వ్యవస్థను రద్దు చేయబోమని, సర్పంచులతో అనుసంధానించి గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పెద్ద తుంబాల క్రాస్ వద్ద విడిది శిబిరం వద్ద సోమవారం ''పల్లె ప్రగతి కోసం మీ లోకేష్'' కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాకా సర్పంచుల బకాయిలు తీర్చేలా కృషి చేస్తామని, గ్రామాలను అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం వచ్చేలా చేస్తామన్నారు. గతంలో పంచాయతీలకు ఎలా నిధులు ఇచ్చామో అలాగే ఇచ్చి పనులు చేపిస్తామని హామీ ఇచ్చారు. తాము పంచాయతీ ఖాతాలకే నిధులు ఇస్తామని, సర్పంచులకు విధి, విధానాలు వెల్లడిస్తామని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా, గ్రామీణాభివృద్ధికి పాటుపడే సర్పంచులను ప్రోత్సహిస్తామని, పంచాయతీలకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరు అందిస్తామని, చెక్ పవర్‌ను సర్పంచులకు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
What's Your Reaction?