శరవేగంగా హైదరాబాద్-విశాఖ రహదారి నిర్మాణం
56 కిలోమీటర్లు తగ్గనున్న ప్రయాణ దూరం
తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరమైన విశాఖపట్నం మధ్య చేపట్టిన నాలుగులేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రాజెక్టు పనులు ఖమ్మం వద్ద శరవేగంగా కొనసాగుతున్నాయి.
వచ్చే ఏడాది చివరికల్లా పనులు పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
హైదరాబాద్, మే 9 (మనభారత్ న్యూస్): తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరమైన విశాఖపట్నం మధ్య చేపట్టిన నాలుగులేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రాజెక్టు పనులు ఖమ్మం వద్ద శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది చివరికల్లా పనులు పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్-విశాఖ మధ్య రోడ్డు కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు సూర్యాపేట నుంచి కోదాడ మీదుగా ఏపీలోని జగ్గయ్యపేట, కంచికచర్ల, విజయవాడ, దేవరపల్లి మార్గాన్ని ఉపయోగిస్తున్నారు.
కొత్త రోడ్డు సూర్యాపేట, ఖమ్మం, వైరా, కల్లూరు, దమ్మపేట, అశ్వారావుపేట మీదుగా ఏపీలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, దేవరపల్లి నుంచి రాజమండ్రికి వెళ్తుంది. ఈ మార్గంలో ఇప్పటికే ఖమ్మం, దేవరపల్లి మధ్య సుమారు 89 కిలోమీటర్ల వరకు రెండు లేన్ల రోడ్డు ఉన్నది. ఇప్పుడు దాన్ని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. నిరుడు సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ పనుల్లో ఇప్పటికే దాదాపు 10 కి.మీ. మేరకు పూర్తయ్యాయి. ఈ రహదారి కోసం 1,332 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్నదని, అందులో ఇప్పటికే 95% భూసేకరణ పూర్తయిందని అధికారులు తెలిపారు. మూడు ప్యాకేజీలుగా విభజించిన ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో రెండు ప్యాకేజీలను ఢిల్లీకి చెందిన సంస్థ, మిగిలిన ప్యాకేజీ పనులను ఏపీకి చెందిన సంస్థ చేపట్టాయని, వచ్చే ఏడాది చివరినాటికి ఈ పనులు పూర్తవుతాయని చెప్పారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణ దూరం 56 కి.మీ. మేరకు తగ్గుతుందని తెలిపారు.
What's Your Reaction?