బాబు అందరివాడు కాదా? కొందరివాడేనా?
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 3.30 గంటలకు కమ్మ వారి ఆత్మగౌరవ సభ
మనభారత్ న్యూస్, 17 అక్టోబరు 2023, ఆంధ్రప్రదేశ్ : తెలుగుదేశం పార్టీని కమ్మ సామాజిక వర్గం పుట్టి ముంచుతోందా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. టీడీపీ ఆవిర్భావ సమయంలో కులమతాలకు అతీతంగా అందరి ఆదరణతో అద్వితీయ విజయాన్ని దక్కించుకుంది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని దక్కించుకున్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ రికార్డు నెలకొల్పింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
చంద్రబాబు అరెస్ట్ పుణ్యమా అని టీడీపీ కేవలం ఒక కులానికి చెందిన పార్టీగా పరిమితం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇందుకు చంద్రబాబు సామాజిక వర్గం అతే కారణమని చెప్పక తప్పదు. ఒక మీడియాధిపతి వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) ఇవాళ రాసిన కొత్త పలుకు కాలమ్‌లో బాబు అరెస్ట్‌తో కమ్మ సామాజిక వర్గం రగిలిపోతున్నట్టు రాశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా, అలాగే కాంగ్రెస్‌కు అనుకూలంగా రానున్న ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్ణం మద్దతుగా నిలవడానికి నిశ్చయించినట్టు ఆయన రాసుకొచ్చారు.
అంతేకాదు, చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో హడావుడి చేస్తోంది కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐటీ ఉద్యోగులే అని ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అంటే చంద్రబాబును ఆరెస్ట్ చేస్తే ఆవేదన చెందుతోన్నది, రోడ్డెక్కుతున్నది కేవలం ఆయన సామాజిక వర్గం వారే అని చెప్పినట్టు అవుతోంది. తాజాగా బాబు సామాజిక వర్గం మరో తప్పిదానికి ఒడగట్టింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 3.30 గంటలకు కమ్మ వారి ఆత్మగౌరవ సభ నిర్వహించ తలపెట్టారు. "మన జాతి గౌరవం కోసం, మన మనుగడ కోసం, మన భావితరాల ఉజ్వల భవిష్యత్ మనం ఏర్పాటు చేసుకుంటున్న ఆత్మగౌరవ సభను మనవాళ్లంతా వచ్చి విజయవంతం చేయాలి" అని పిలుపునివ్వడం గమనార్హం. ఇలాంటి పిలుపు ద్వారా ఎలాంటి సంకేతాలను కమ్మ సామాజిక వర్గం పంపాలని అనుకుంటోందని ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
చంద్రబాబు అరెస్ట్ కేవలం కమ్మ వారి ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారమా? బాబుకు మిగిలిన కులాలకు ఎలాంటి సంబంధం లేదా? మన జాతి గౌరవం, మనుగడ, భవిష్యత్ తరాల కోసం అని చెప్పడం ద్వారా, ఇంతకాలం టీడీపీని , చంద్రబాబును మోస్తున్న మిగిలిన సామాజిక వర్గాల గురించి అసలు పట్టించుకోరా? వాళ్లందరినీ కలుపుకెళ్లాలనే కనీస ఆలోచన చేయకపోవడం అహంకారం కాదా? ఇలాంటి ఆత్మగౌరవ సభలతో టీడీపీని, చంద్రబాబును సామాజిక, రాజకీయ పరంగా ఒంటరి చేయడం కాదా? బాబు అరెస్ట్ కుల గొడవగా చిత్రీకరించడం వల్ల టీడీపీకి రాజకీయంగా నష్టం చేస్తున్నట్టు కాదా? “WE ARE WITH CBN” అని కమ్మ వాళ్లు మాత్రమే అంటే సరిపోతుందా? మరి మిగిలిన కులస్తుల్ని కమ్మ వాళ్లే వేరు చేసి, ప్రత్యర్థుల వైపు పంపుతున్నట్టుగా గుర్తించడం లేదా? కమ్మ వాళ్లలో కొందరి కులపైత్యం, రాజకీయంగా, సామాజికంగా టీడీపీకి, చంద్రబాబుకు భారీగా నష్టం చేయనుంది.
హైదరాబాద్‌లో టీడీపీ అనుకూల ఐటీ ఉద్యోగుల విపరీత పోకడలతో మిగిలిన సామాజిక వర్గాలు ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇంతకాలం టీడీపీని, చంద్రబాబును అభిమానిస్తున్న తమను పరిగణలోకి తీసుకోకపోవడంతో కమ్మేతరులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. కేవలం కమ్మ వాళ్లకు మాత్రమే చంద్రబాబునాయకుడైతే, అన్ని కులాలను ఆదరించే నాయకత్వం వైపు ఎందుకు చూడకూడదనే ఆలోచన రగిల్చిన ఘనత మాత్రం లోకేశ్ కులానికే దక్కింది.
What's Your Reaction?