బాబోయ్ ' కాల్ ' కేయులు.... పోలీసుల వేషధారణలో వీడియో కాల్ బెదిరింపులు
కెసులు నమోదయ్యాయని భయపెట్టి ఖాతాలు ఖాళీడిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్ల దోపిడీ
మనభారత్ న్యూస్, 21 జూన్ 2024, అమరావతి, ఆంధ్రప్రదేశ్ :- నిత్యం కొత్త ఎత్తుగడలతో దోచుకునే సైబర్ నేరగాళ్లు..
ఇప్పుడు కొత్తగా 'డిజిటల్ అరెస్టు' పేరుతో బెదిరిస్తూ అందినకాడికి ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసుల అరెస్టులే చూశాం. తాజాగా.. డిజిటల్ అరెస్టులతో తీవ్ర ఒత్తిడికి గురి చేసి కష్టార్జితాన్ని కొట్టేస్తున్నారు. 'మీరు వీడియో కాల్ చేసి, మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. మీపై కేసు నమోదు అయింది'.. 'మీరు అశ్లీల సైట్లు చూస్తున్నారు. మిమ్మల్ని అరెస్టు చేసేందుకు వారెంటుతో వస్తున్నాం. అరెస్టు లేకుండా ఉండాలంటే జరిమానా కట్టాలి.'.. ఇలా కాల్స్ చేసి పోలీసు, సీబీఐ, కస్టమ్స్, తదితర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారుల పేరుతో అరెస్టు చేస్తామని బెదిరించి తమ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు కేటుగాళ్లు. అరెస్టు భయంతో పలువురు వీరి వలలో చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో పలువురు డిజిటల్ అరెస్టు బారిన పడి మోసపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
తీవ్ర ఒత్తిడికి గురి చేసి లూటీ..
మేం పోలీసు, ఆర్బీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులమని మోసగాళ్లు వీడియో కాల్స్ చేస్తారు. బాధితుడిని కాల్ కట్ చేయొద్దని గంటల తరబడి ఇంటరాగేషన్ పేరుతో ఇబ్బంది పెడతారు. తమ ముందు కనిపించేలా చూసుకుంటూ తమ డిమాండ్ల సాధన కోసం తీవ్రంగా ఒత్తిడి తెస్తారు. అచ్చు ప్రభుత్వ ఏజెన్సీ అధికారుల దుస్తులనే ధరించి.. పోలీసుస్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు అని భ్రమింపజేసేలా స్టూడియోల నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తూ మోసాలకు పాల్పడుతుంటారు.
తొలుత ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీ సిమ్ నుంచి నేరస్థులకు ఫోన్లు వెళ్లాయని.. మీ బ్యాంకు ఖాతా నుంచి మాఫియా డాన్‌ల ఖాతాలకు లావాదేవీలు జరిగాయనీ.. మీ ఫోన్ నుంచి మహిళ మొబైల్‌కు అసభ్య సందేశాలు వెళ్లాయని.. ఇలా రకరకాల పేరుతో భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. అనంతరం ఈ కేసు గురించి మాట్లాడడానికి సంబంధిత అధికారితో స్కైప్‌తో కలుపుతానని మోసగాడికి వీడియో కాల్ చేస్తారు. తర్వాత అతడు.. కేసు మాఫీ అని ఒత్తిడి చేసి, అందిన కాడికి డబ్బులు గుంజుతాడు. చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేసే వరకు పలురకాలుగా ఒత్తిడి చేస్తాడు. వీడియో కాల్ ఆఫ్ చేయనీయకుండా బాధితుడిని మానసికంగా ఒత్తిడి తెస్తారు.
నిజమే అని భ్రమింపజేస్తారు.
పోరంకిలో మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారికి ఇటీవల ఓ కాల్ వచ్చింది. తాను ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి కాల్ చేస్తున్నానని చెప్పి.. 'మీ ఫోన్ నంబరు నుంచి అసభ్య మెసేజ్‌లు వెళ్లినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై ముంబయిలోని నౌపడ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని వివరించారు. మరిన్ని వివరాల కోసం ఎస్.ఐతో మాట్లాడమని చెప్పి కాల్‌ను బదిలీ చేశారు. మీ ఆధార్ నంబరుతో సిమ్‌ను ముంబయిలో తీసుకున్నట్లు రికార్డు అయిందని భయపెట్టేందుకు చూశాడు. తాను ఎప్పుడూ ముంబయి నగరం వెళ్లలేదనీ, తనకే సంబంధం లేదని మత్స్య శాఖ అధికారి ఆందోళనతో సమాధానం ఇచ్చారు. కేసు మాఫీకి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు మోసగాళ్లు. దీంతో భయపడిన అధికారి.. చేసేది లేక దశలవారీగా రూ.లక్షల్లో డబ్బులు వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు.
విజయవాడ నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి ముంబయి క్రైం బ్రాంచి అధికారిని అని ఓ ఫోన్ వచ్చింది. మీ బ్యాంకు ఖాతా నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగాయనీ, దీనిపై ముంబయి క్రైమ్ బ్రాంచిలో కేసు నమోదు అయిందని వివరించాడు. మీపై అరెస్టు వారెంటు జారీ అయిందనీ, దానిని వాట్సాప్‌లో బోగస్ పత్రాన్ని పంపించాడు మోసగాడు. అది చూసి నిజమే అని నమ్మిన నగరానికి చెందిన వ్యక్తి ప్రాథేయపడ్డాడు. దీని కోసమే ఎదురుచూస్తున్న అవతలి వ్యక్తి.. తాను సూచించిన ఖాతాలకు డబ్బులు పంపించమని సూచించాడు. దీంతో దశల వారీగా రూ.11 లక్షలు జమ చేశాడు. తర్వాత నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.
అవగాహనతోనే అరికట్టవచ్చు
సైబర్ మోసాలపై తరచూ అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. తాము పోలీసులమని గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను పట్టించుకోవద్దు.
వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దు. వారి అస్థిత్వాన్ని ధ్రువీకరించుకోండి.
ప్రభుత్వ రంగ సంస్థలు కానీ.. అధికారులు కానీ.. ఫోన్ ద్వారా డబ్బులు బదిలీ చేయమని అడగరు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చెల్లింపులు చేయొద్దు.
మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే.. మోసగాళ్ల బారిన పడకుండా వెంటనే స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అనుమానాస్పద కాల్స్ గురించి సైబర్ సహాయవాణి నెంబరు 1930కు ఫిర్యాదు చేయాలి
What's Your Reaction?