సందేశ్‌ఖాలీ యిచ్చే సందేశం

Mar 30, 2024 - 14:07
Mar 30, 2024 - 14:20
 0  8
సందేశ్‌ఖాలీ యిచ్చే సందేశం

మనభారత్ న్యూస్, 30 మార్చి 2024  :- బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామమైన సందేశ్‌ఖాలీ రాజకీయ నాయకులకు పెద్ద సందేశమే యిచ్చింది. ఎన్నో ఏళ్లగా దాష్టీకాన్నీ, దౌర్జన్యాన్నీ భరించినా చలిచీమలు ఎప్పుడో ఒకప్పుడు తిరగ బడతాయని, బలవంతమైన సర్వాన్ని కూడా భక్తిస్తాయని ఆ వూరు చాటి చెప్పింది. ఆ గ్రామ ప్రజలు నిజంగా చలిచీమలే. బడుగు, పేద వర్గాల వారే. కులరీత్యా ఎస్సీ, ఎస్టీలే. దశాబ్దాల యీ దోపిడీ గురించి పేపర్లలో సరిగ్గా రాకపోవడానికి అది ప్రధాన కారణం. ఇలా ఎన్నాళ్లు సాగేదో కానీ మనం ఏం చేసినా చెల్లుతుందనుకున్న షాజహాన్‌ అనుచరులు జనవరి 5న ఈడీ అధికారులపై చేసిన దాడితో కథ మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ మూసుకున్న నోళ్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఈ తిరుగుబాటుతో పరిస్థితులు సాంతం మారిపోతాయనలేం కానీ యిదిచ్చిన కుదుపుతో నాయకులు కాస్త బెదరవచ్చు.  

ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది బలహీనులపై దుండగులు చేసిన గూండాగిరీ. అవినీతి, హింస కలగలసిన పాలకుల ప్రజాపీడన. దీన్ని మతకోణంలో చూస్తే, మనకు సరైన చిత్రం రాదు. షాజహాన్‌ అనే అతను పేపర్లకి ఎక్కాడు కాబట్టి, యిదేదో ముస్లిము డాన్‌ హిందూ స్త్రీలపై చేసిన అత్యాచారం అనే కలరింగు యివ్వకూడదు. ఆ షాజహాన్‌కి బాస్‌ జ్యోతి ప్రియా మల్లిక్‌ (బాలూ దా అని పిలుస్తారు) హిందూ. షాజహాన్‌ ప్రధాన అనుచరులుగా ఉంటూ ఆ గ్రామాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన ఉత్తమ్‌ సర్దార్‌, శివప్రసాద్‌ హజ్రాలు హిందువులు. అనుచరుల్లో ముస్లిములూ ఉన్నారు తప్ప కేవలం ముస్లిములే లేరు. అక్కడి జనాభాలో హిందువులు (ప్రధానంగా షెడ్యూల్‌ కాస్ట్‌, షెడ్యూల్‌ ట్రైబ్‌ వాళ్లు) 70-77% ఉన్నారు.  

ఇంకో విషయం కూడా మొదటే అర్ధం చేసుకోవాలి. బెంగాల్‌లో రాజకీయపరమైన, సాంఘికపరమైన హింస ఎక్కువ. విడిగా ఉంటే అరుపులతో సరిపెడతారు కానీ సమూహంగా ఉంటే మాత్రం హింసకు పాల్పడడం బెంగాలీ లక్షణం దేశవిభజన గురించి జిన్నా పట్టుబట్టే సమయంలో ముస్లిములు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. కానీ దాడులు విపరీతంగా జరిగినది బెంగాల్‌, పంజాబ్‌లలోనే! పంజాబ్‌లో విభజనకు 5 నెలల ముందు హింస జరిగితే, బెంగాల్‌లోని నవఖాలీలో విభజనకు 10 నెలలకు ముందే అల్లర్లు ప్రారంభమయ్యాయి. 1970, 80లలో కూడా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారన్న అనుమానం వస్తే సజీవదహనాలు చేసేసిన సంఘటనలు బెంగాల్‌లో జరిగాయి. హింసాత్మకమైన నక్సల్‌బాడీ ఉద్యమం పురుడు పోసుకున్నది బెంగాల్‌లోనే. 

కాంగ్రెసు వారు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఎవరూ హింసకు అతీతులు కారు. మేం కలకత్తాలో ఉండే రోజుల్లో (1982-85) ఎన్నికలు వస్తే మా పనిమనిషి సొంత ఊరెళ్లి ఓటు వేస్తానంది. ఖర్చు పెట్టుకుని అంత దూరం వెళ్లడం దేనికి? వెళ్లకపోతే కొంప మునుగుతుందా? అన్నాను. (ఓట్లకు డబ్బు పంపిణీ అలవాటు అప్పట్లో అక్కడ లేదు). “కొంప మునగదు కానీ కూలుతుంది. ఓటేయకపోతే పార్టీల వాళ్లు వచ్చి యిల్లు కూలుస్తారు.” అందామె. ఓటేస్తే చేతులు నరుకుతాం అనే నక్సల్‌ ప్రాంతంలో లేదు ఆమె ఊరు. మామూలు ప్రాంతమే కానీ పార్టీలు బెదిరించే పద్ధతి అది. బతిమాలడం వాళ్లకు తెలియని విద్య. తెల్ల పంచె కట్టుకుని, తెల్ల లాల్సీ వేసుకుని, చేతిలో పేపరు మడిచి పట్టుకుని, మేధావితనం ఒలకపోస్తూ చక్కటి భాషలో వాదించగల బెంగాలీలు హింస దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఖండించరు.  

కులీన కుటుంబానికి చెంది, ఉన్నత విద్య నభ్యసించి, పెద్ద బారిస్టరుగా ఉండి, చూడగానే భద్రలోక్‌ అనిపించే కాంగ్రెసు ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్‌ రాయ్‌ కూడా ఆచరణలోకి వచ్చేసరికి 'పరమహింస' అనిపించుకున్నాడు. ఎమర్జన్సీ కంటె ముందే, 1971లో జరిగిన బెంగాల్‌ ఎన్నికలలో అతను ముఖ్యమంత్రిగా ఉంటూ ఘోరంగా రిగ్గింగ్‌ చేయించేసి, మొత్తం 294 సీట్లలో 216 సీట్లు తమకు, 35 సీట్లు తమతో జట్టు కట్టిన సిపిఐకు వచ్చేట్లు చేశాడు. అమిత ప్రజాదరణ కలిగిన సిపిఎం లీడరు జ్యోతి బసు తన సొంత నియోజకవర్గమైన బారానగర్‌లో ప్రత్యర్థి కంటె సగం కంటె ఓట్లు తెచ్చుకునేట్లు చేశారు. అది జరిగి 50 ఏళ్ల దాటింది. కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి రాలేదు.  

1977 నుంచి అధికారంలోకి వచ్చి దశాబ్దాల పాటు పాలించిన లెఫ్ట్‌ ఫ్రంట్‌, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు హింసాత్మకంగా తలపడుతూనే వచ్చాయి. కాంగ్రెసు ఉండే రోజుల్లో కమ్యూనిస్టుల చేతిలో ఉన్న ట్రామ్‌ వర్కర్స్‌ యూనియన్‌, ప్రతి చిన్నదానికీ సమ్మె చేస్తూ ట్రాములు రోడ్ల మీద ఆపేసి ప్రజల వాహనాలు అటూయిటూ కదలకుండా చేసేసేవారు. లెఫ్ట్‌ అధికారంలోకి రాగానే కాంగ్రెసు చేతిలో ఉన్న విద్యుత్‌ ఉద్యోగుల యూనియన్‌ వాళ్లు యంత్రాలను పాడు చేసి, కరంటు సరఫరా జరగకుండా చేసేవారు. నేను కలకత్తాలో ఉన్నవి ఆ రోజులు. కరంటు కోతలతో నానా అవస్థా పడేవాళ్లం. మమతా బెనర్జీ అప్పుడప్పుడే కాంగ్రెసులో యువ నాయకురాలిగా ఎదుగుతున్న రోజులు. ఘనీఖాన్‌ చౌధురిని మించిన రౌడీగా పేరు తెచ్చుకుంది. ఈమె రౌడీతనానికి మురిసి, కాంగ్రెసు యీమెను పెద్ద నాయకురాలిగా చేసింది.  

బెంగాల్‌, కేరళ అనగానే మన తెలుగువాళ్లలో చాలామంది వాళ్లందరూ కమ్యూనిస్టులు అనేస్తారు. అది తప్పు. అక్కడి జనాభాలో సగం మంది మాత్రమే వామపక్షాభిమానులు. తక్కిన వాళ్లు కమ్యూనిజం అంటే మండిపడేవాళ్లు. జ్యోతి ఐసు పాలించే రోజుల్లో కూడా కాంగ్రెసు పోటాపోటీగా ఉండేది. అందుకనే సిపిఎం తక్కిన వామపక్షాలను, సోషలిస్టులను కలుపుకుని ఫ్రంట్‌గా ఏర్పడి పోరాడవలసి వచ్చింది. లెక్క ప్రకారమైతే మమతా బెనర్జీ దురుసుతనం చూసి బెంగాలీ భద్రలోక్‌ దడుచుకుని దూరం పెట్టాలి. కానీ అలా జరగలేదు. ఇందిర హత్య తదనంతరం జరిగిన 1984 డిసెంబరు పార్లమెంటు ఎన్నికలలో ఆమె మార్కిస్ట్‌ దిగ్గజం సోమనాథ్‌ చటర్జీని జాదవపూర్‌ నియోజక వర్ణంలో ఓడించ గలిగింది. 1989లో అక్కడ ఓడిపోయాక, దక్షిణ కలకత్తా నియోజకవర్గానికి మారింది. అక్కణ్చుంచి మేధావులు, ప్రొఫెసర్లు ఎంపీలుగా ఎన్నికవుతూండేవారు. అలాటిది 1991 నుంచి 2009 వరకు ఈమె ఎన్నిక అయింది. 2009 తర్వాత నుంచి అసెంబ్లీకి వెళ్లింది.  

1998లో కాంగ్రెసుతో పోట్లాడి, తృణమూల్‌ పార్టీ పెట్టింది. కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ యీమె పంచన చేరారు గ్రామగ్రామాన కమ్యూనిస్టులతో యుద్ధాలు చేస్తూ, పార్టీ బలపడింది. మొదట్లో లెఫ్ట్‌ ప్రంట్‌ నాయకులు మధ్యతరగతి వారు, విద్యావంతులు. క్రమేపీ వారి స్థానంలో డబ్బున్న రైతులు, వ్యాపారస్తులు వచ్చి చేరారు. వీళ్లకు ఆదర్శాలు, ఆశయాలు గట్రా ఏమీ తెలియవు. జబర్దస్తీ చేసి పెత్తనం చలాయించడం మాత్రమే వచ్చు. మమత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక బలప్రయోగంతో కమ్యూనిస్టులను అణిచడంతో యీ జనాభా అంతా ఆ పార్టీ వదిలి యీ పార్టీలో చేరి, తమ వసూళ్లు కొనసాగించారు. ఇప్పుడు బెంగాల్‌లో కమ్యూనిస్టులనేవారు శల్యావశిష్టులై కాంగ్రెసువారి సరసన కూలబడ్డారు.

మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవుతూనే తను లెఫ్ట్‌ ఫ్రంట్‌లా ప్రభుత్వాన్ని నడపలేనని గ్రహించింది. ఎందుకంటే ఆమె పార్టీకి కమ్యూనిస్టుల్లా ఒక నిర్మాణం లేదు. బహుళ నాయకత్వం లేదు. పార్టీలో చర్చలు లేవు. అంతా తన పేరుగా నడవాల్సిందే! అందరూ తన పేరు చెప్పుకుని బతకాల్సిన వాళ్లే. మంత్రుల్లో తెలివైన వారూ లేరు. అందుకని కొందరు ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులను బృందంగా ఏర్పరచి, వాళ్లను నేరుగా తన కంట్రోలులో పెట్టుకుని, వారి ద్వారా పాలన సాగించింది. పార్టీ వారి కంటె వారికే ఎక్కువ ప్రాధాన్యత యిచ్చింది. కమ్యూనిస్టుల్లా సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, మన్నూమశానం అని కూర్చోకుండా, కొన్ని కొన్ని గ్రూపుల నాయకులను చేరదీసి వాళ్లకు పార్టీలో మంచి పదవులు యిచ్చింది. తన పార్టీలో చేరిన వాళ్లకు ప్రభుత్వపు అండ కల్పిస్తూ వాళ్ల వ్యాపార ప్రయోజనాలు పెంపొందించు కునేందుకు అనుమతించింది. వసూళ్లు చేసుకోనిచ్చింది.  

ఇక తృణమూల్‌ ముఠాలకు ఎదురు లేకుండా పోయింది. మోదీ వచ్చాకనే బిజెపి రూపంలో ప్రతిఘటన ప్రారంభమైంది. తృణమూల్‌ దౌర్జన్యకారుల్లో కొందరు అటు చేరారు. ఇద్దరి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలలో తృణమూల్‌ ఓడిపోయి, బిజెపి గెలిచినా యీ హింసరచనలో మార్పు వస్తుందని అనుకోలేము. వంగ సమాజస్వభావమే అటువంటిది. 19072023 నాటి “హిందూ”లో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల సంఖ్యను రాష్ట్రాల వారీగా యిచ్చారు. గ్రాపుల్లో యిచ్చారు కాబట్టి గణాంకాలు పూర్తిగా యివ్వలేక పోతున్నాను. 2016 నుంచి జులై 2023 వరకు మొత్తం కశ్మీర్‌లో 8301 అయితే (మిలిటన్సీ ఉంది కాబట్టి సహజం), యుపిలో 2618 అయితే అంతకంటె తక్కువ జనాభా ఉన్న బెంగాల్‌లో 3338 జరిగాయి. 2019 సందర్భంగా బెంగాల్‌లో చాలా హింస జరిగింది. 2023 జులై నాటి స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెలలో 40 మంది మరణించారు.  

బెంగాల్‌ సమాజంలో అలసత్వం, సోమరితనం, కలహించే తత్వం, ధిక్కారం, అరాచకత్వం ఉంది కానీ గతంలో అవినీతి తక్కువగా ఉండేది. సంక్షేమ పథకాల ధర్మమాని ఆ జాడ్యమూ అంటుకుంది. ప్రజలను మోసగించే కంపెనీలకు కొందరు రాజకీయ నాయకుల మద్దతు ఉంటూండేది కానీ యిప్పుడు ప్రభుత్వ నిధుల పంపిణీలోనే అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ కారణంగా గత ఎన్నికలలో దెబ్బ తగులుతుందని భయపడిన మమతా బెనర్జీ “మీ అవినీతి సొమ్ము ప్రజలకు వెనక్కి యిచ్చేయండి' అని తన ఎమ్మెల్యేలకు బహిరంగ ప్రకటన చేసింది. దాంతోనే తెలుస్తోంది అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో! ఆ ఎన్నికలలో నెగ్గి అధికారంలోకి మమత వచ్చాక ఆమె మంత్రులు స్కాముల్లో యిరుక్కుంటున్నారు. పార్థా చటర్జీ యిరుక్కున్నది స్కూలు సర్వీస్‌ కమిషన్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాము రెండోదైన రూ.10 వేల కోట్ల పిడిఎస్‌ (పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం) స్కాము గురించి ఫోకస్‌ చేసి రాస్తున్నాను ఎందుకంటే దీనికీ, సందేశ్‌ఖాలీకి లింకుంది. దీనిలో ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌) అరెస్టు చేసినది, జ్యోతి ప్రియా మల్లిక్‌ అనే కాబినెట్‌ మంత్రిని! ఇతనే షాజహాన్‌ షేక్‌కు బాస్‌. 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) వారు మల్లిక్‌ను అరెస్టు చేయడంతో ఆగకుండా, అతని అనుచరులను కూడా సోదా చేద్దామనుకున్నారు. వారిలో ఒకడైన షాజహాన్‌ యిల్లు సోదా చేద్దామని జనవరి 5న ఉత్తర 24 పరగణాల జిల్లా లోని సందేశ్‌ఖాలీ వెళితే అతని అనుచరులు ఇడి అధికారులు ముగ్గురిపై దాడి చేశారు. వెంటనే వారు పత్రికా ప్రకటన యిచ్చారు. “ఇది 9-10 వేల కోట్ల స్కాము. దీనిలో రూ.2 వేల కోట్లు బంగ్లాదేశ్‌ ద్వారా దుబాయికి పంపబడిందని మా అనుమానం.” అని. ఇడి రంగంలోకి దిగడానికి కారణం - బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు 2020, 2021లలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు. కోవిడ్‌ బాధితులకు యిచ్చిన సహాయం, రేషన్ల విషయంలో అక్రమాలు జరిగాయంటూ అప్పట్లో చాలా హింసాత్మక ఆందోళనలు జరిగాయి.  

ఇడి ప్రకారం యీ స్కాము మూడు రకాలుగా సాగింది. రైసు మిల్లర్లు రేషన్‌ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లతో కుమ్మక్కయి పిడిఎస్‌ కింద యిచ్చిన ఆహారధాన్యాలను తరలించేశారు. పిడిఎస్‌ ద్వారా పంపిణీ చేయవలసిన గోధుమ పిండిలో 26% పిండిని దారి మళ్లించారు. మిల్లర్లు రేషన్‌ డీలర్లకు గోధుమ పిండిని యిచ్చి, మళ్లీ వాళ్ల దగ్గర్నుంచే మధ్యవర్తుల ద్వారా కొనేవారు. దాన్ని తాజా పిండితో కలిపేసి, మళ్లీ అమ్మేవారు. ఆ విధంగా క్వాలిటీ కూడా తగ్గేది. రేషన్‌ డీలర్లు రేషన్‌ కార్డులున్న వారికి యివ్వవలసినదంతా యివ్వకుండా, కొంత ఎగ్గొట్టి మిల్లర్లకు అమ్మేసుకుని లాభాలు సంపాదించేవారు. మిల్లర్లు ప్రభుత్వం నుంచి మరో రకంగా కూడా డబ్బు సంపాదించేవారు. రైతులు మాకు యింత ధాన్యం యిచ్చారు. వారికి మీరు కనీస మద్దతు ధర చెల్లించండి' అంటూ ప్రభుత్వం నుంచి వారి పేర డబ్బు యిప్పించేవారు.  

అంతా ఉత్తిదే. తమతో సంబంధాలున్న కోఆపరేటివ్‌ సొసైటీ ఉద్యోగుల పేర్లపై, బంధువుల పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించి, వారినే రైతులుగా చూపేవారు. ప్రభుత్వం డబ్బు చెల్లించాక, వారి నుంచి డబ్బు తీసుకునేవారు. ఇలా సంపాదించిన దానిలో కొంత వాటాను అప్పటి (2011 నుంచి 2021) ఫుడ్‌ అండ్‌ సప్లయిస్‌ మినిస్టర్‌గా ఉన్న జ్యోతి ప్రియా మల్లిక్‌కు సంబంధించిన కంపెనీలకు తరలించేవారు. ఇడి 2023 అక్టోబరు 14న అరెస్టు చేసిన బాకీబుర్‌ రహమాన్‌ యిలాటి మిల్లర్లలో ఒకడు. అతను మల్లిక్‌ అనుచరులలో ఒకడు. అతని దగ్గర దొరికిన సమాచారంతో మల్లిక్‌ యింట్లో 20 గంటలు సోదా చేసి అక్టోబరు 27న అరెస్టు చేశారు. 2022 జులైలో రిక్రూట్‌మెంట్‌ స్కాములో పార్థా చటర్జీ అరెస్టయ్యాక అరెస్టయిన రెండవ మంత్రి యితను. 

మల్లిక్‌ను అరెస్టు చేశాక, అతని యితర అనుచరులపై కూడా ఇడి దృష్టి సారించింది. ఆ క్రమంలోనే జనవరి 5న ముగ్గురు ఇడి అధికారులు సందేశ్‌ఖాలీ వెళ్లారు. షాజహాన్‌ అనుచరులు కర్రలతో, రాళ్లతో వాళ్లపై దాడి చేసి, వాళ్ల వాహనాలు ధ్వంసం చేసి, వాళ్ల సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, పర్సులు లాక్కున్నారు. వారి వెంట తీసుకెళ్లిన జర్నలిస్టులను కూడా వదిలి పెట్టలేదు. ఈ ఊళ్లో మాత్రమే కాదు, అదే జిల్లాలోని బోన్గావ్‌ అనే మరో ఊళ్లో మల్లిక్‌ మరో అనుచరుడు, బోన్గావ్‌ మునిసిపాలిటీ చైర్మన్‌ ఐన శంకర్‌ ఆధ్యా యింటి సోదాకు వెళ్లిన అధికారులపై కూడా దాడి జరిగింది. శంకర్‌కు అనేక మనీ ఛేంజర్‌ కంపెనీలున్నాయి. వీళ్ల అక్రమ సంపాదన అతని ద్వారా విదేశాలకు తరలిపోయిందని ఇడి అనుమానం. ఇడి అధికారులపై గూండాల దాడి చూసి తృణమూల్‌ నాయకత్వం బిత్తరపోయింది. రాష్ట్రంలో గూండారాజ్యం ఎలా నడుస్తోందో అందరికీ తెలిసిపోవడంతో పాటు, పట్టుబడిపోతామన్న భయంతోనే తృణమూల్‌ నాయకులు యిలా ప్రవర్తిస్తున్నారనే భావం ప్రజల్లో కలుగుతోందని గ్రహించింది. 

అందుకని “ఇది ముందుగా అనుకుని చేసిన దాడి కాదు. ఆ నాయకులపై ప్రేమాభిమానాలతో స్థానికులు అప్పటికప్పుడు అలా ప్రతిస్పందించారంతే' అని చెప్పుకుంది. పరిశ్రమల మంత్రి శశి పాంజా “మా పార్టీ ఏ రకమైన హింసను ప్రోత్సహించదు, కాపాడదు, సమర్ధించదు. ఇడి సెలక్టివ్‌గా కొంతమందిపై మాత్రమే దాడి చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. ఇడి, సిబిఐ తమ పని తాము చేసుకోవచ్చు. కానీ వారి లక్ష్యం, ఉద్దేశాలు మాత్రం ప్రశ్చార్థకం.' అన్నాడు. అవినీతిలో కూరుకుపోయిన కొందరు తృణమూల్‌ నాయకులు బిజెపిలోకి ఫిరాయించాక వారిపై ఇడి, సిబిఐ విచారణలు ఆగిపోయాయి. తృణమూల్‌ను అంటిపెట్టుకుని ఉన్నవారిపై మాత్రం సోదాలు, దాడులు జరుగుతున్నాయి. అదీ అతని భావం.  

ఇడి, సిబిఐల ఉద్దేశాలు ఏమైనా వారిపై దాడి జరగడాన్ని ఖండించాలి కదా. ఈ దాడిని చేయించిన షాజహాన్‌ను రాష్ట్ర పోలీసులు వెతికి పట్టుకుని, వెంటనే అరెస్టు చేయాలి కదా, అది జరగలేదేం? అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. తక్కినవారిని అరెస్టు చేసినా షాజహాన్‌ను చాలాకాలం పాటు, ఫిబ్రవరి 29 దాకా అరెస్టు చేయలేదు. (అరెస్టయ్యాక పార్టీ అతన్ని ఆరేళ్ల పాటు సస్పెండ్‌ చేసింది) ఇది కొత్తగా నియమితుడైన డిజిపి (డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌) రాజీవ్‌ కుమార్‌కి చాలా చెడ్డపేరు తెచ్చింది. (ఎన్నికల ప్రకటన వెలువడిన 48 గంటల తర్వాత ఎన్నికల కమిషన్‌ అతన్ని మార్చేసి, వివేక్‌ సహాయ్‌ని వేసి, 24 గంటలు గడవకుండా అతన్నీ మార్చేసి సంజయ్‌ ముఖర్జీని నియమించింది). పోలీసులతో వ్యవహారం జరిగేట్లు లేదనుకుని ఇడి కలకత్తా హైకోర్టుకి వెళ్లింది. జనవరి 17న హైకోర్టు సిబిఐ, బెంగాల్‌ పోలీసులతో కలిపి జాయింటు సిట్‌ (స్పెషన్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌) ఏర్పాటు చేసి అధికారులపై దాడి గురించి విచారించమంది. 

అక్టోబరులో మల్లిక్‌ అరెస్టయినప్పుడు మమతా బెనర్జీ యీ వ్యవహారంలో వేలు పెట్టకూడదనుకుంది. మల్లిక్‌ తన న్యాయపోరాటం తను చేసుకోవలసినదే. ప్రభుత్వానికి, పార్టీకి దీనిలో ప్రమేయం లేదు” అంది. జనవరి 5 ఘటన తర్వాత “ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతోంది. అక్కడి నుంచి బిజెపి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలనుకుంటోంది. స్థానికంగా బలంగా ఉన్న తృణమూల్‌ నాయకులను రంగంలోంచి తప్పిస్తే కానీ గెలవలేమనే భయం వారిది. అందుకే యిదంతా జరుగుతోంది. ఇల్లిల్లూ సోదా చేసి నాయకులను పట్టుకెళ్లి లోపల పడేస్తున్నారు.” అని ఆరోపించింది. ఇప్పుడు బిజెపి సందేశ్‌ఖాలీ బాధితురాలు అంటూ రేఖా పాత్రా అనే ఒకామెను బసీర్‌హాట్‌ పార్లమెంటు స్థానానికి బిజెపి అభ్యర్థిగా నిలబెట్టింది, ఆమె తమ పార్టీలో అప్పటికి చేరకపోయినా!  

ఈ పిడిఎస్‌ స్కాము బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బయటపడింది. ప్రతిపక్షాలు దాన్ని పెద్ద అంశంగా చేశాయి కూడా. అయినా తృణమూల్‌ 294లో 215 సీట్లు గెలిచింది. పథకాల ఆకర్షణ ముందు అవినీతి తేలిపోయింది. ఈ సారి దౌర్జన్యం, హింసకు వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు తిరగబడ్డారు. ఎన్నికలపై దీని ప్రభావం ఎంత ఉంటుందో గమనించాలి. ఇడిపై షాజహాన్‌ అనుచరులు చేసిన దాడితో దేశ ప్రజలందరి దృష్టి యీ ఊరిపై పడడంతో అక్కడి ప్రజలకు ధైర్యం వచ్చి, యిన్నేళ్ల తమ అవస్థలను చెప్పుకోసాగారు. షాజహాన్‌పై గత నాలుగేళ్లగా 40 కేసులు నడుస్తున్నాయి. అయినా అతను దర్జాగా జనాల్లో తిరుగుతున్నాడు. కిరీటం లేని మహరాజుగా పిలవబడిన షాజహాన్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడనిస్తే తమ పట్టు పోతుందనే బెదురుతో షాజహాన్‌ మనుషులు ఫిబ్రవరి 7న ఊరిపై పడి జనాలందర్ని చావగొట్టి, దాడి గురించి విచారణ చేయడానికి వచ్చే అధికారుల ముందు నోరు విప్పితే చంపుతాం అని అడలగొట్టారు. దాంతో ఊళ్లో మగాళ్లందరూ వేరే చోట తలదాచుకున్నారు. స్త్రీలే తిరగబడి షాజహాన్‌ మనుష్యులను తరిమివేశారు. అతని మనుష్యులనే కాకుండా, అవినీతిలో పాలు పంచుకున్న తృణమూల్‌ నాయకుల యిళ్లనూ, దుకాణాలనూ కూల్చివేశారు. పశువుల పాకలను దగ్ధం చేశారు. 

ఈ విధంగా దశాబ్దాలుగా వారిపై జరుగుతున్న దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఉత్తమ్‌ సర్దార్‌, శివప్రసాద్‌ హజ్రా అనే గూండాలు షాజహాన్‌ అండతో వీళ్ల భూములు కబ్దా చేశారు, వీళ్ల పొలాలను ఆక్రమించి చేపల చెరువులుగా మార్చుకున్నారు, హఫ్తాలు వసూలు చేశారు, వీళ్ల పేర వచ్చిన ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులను స్వాహా చేశారు, అర్ధరాత్రి యింటికి వచ్చి యింట్లో ఆడవాళ్లను తమ ఆఫీసుకి వచ్చి పాచి పని చేయమనేవారు, వంటలు వండించుకునేవారు, కంటికి నదురుగా అనిపించిన కొందరిని శారీరకంగా అనుభవించేవారు. మగవాళ్లెవరైనా యిదేమిటని ప్రతిఘటిస్తే వాళ్ల చేతులు, కాళ్లు విరిచేవారు. దుకాణాల్లోంచి వస్తువులు తీసుకుని పోయి సరిగ్గా డబ్బిచ్చేవారు కాదు. షాజహాన్‌ సోదరుడు సిరాజుద్దీన్‌, అజిత్‌ మైటీ, శంకర్‌ సర్దార్‌, సిద్దిఖ్‌ మొల్తా... వీళ్లందరూ షాజహాన్‌, తృణమూల్‌ తమ వెనక్కాల ఉన్నాయి కదాన్న ధైర్యంతో చెలరేగి పోయారు. ఇప్పుడు తృణమూల్‌ వారిపై చర్యలు తీసుకుంటోంది.  

ఇడిపై అధికారులపై దాడి జరిగిన తర్వాత కూడా తృణమూల్‌ నిజాలు బయటకు రాకుండా చేయాలని ప్రయత్నించింది. ఒక ప్రయివేటు ఛానెల్‌కు చెందిన శంతూ పాన్‌ అనే రిపోర్టరు ఫిబ్రవరి మూడోవారంలో అక్కడకు వెళ్లి జరిగిన అక్రమాలను రికార్డు చేస్తూ ఉంటే తృణమూల్‌ వాళ్లు అతనిపై ఒక దొంగ కేసు బనాయించారు. తను బట్టలు కట్టుకుంటూ ఉంటే యీ రిపోర్టరు యింట్లోకి చొరబడి వీడియో తీశాడని ఒక అమ్మాయి చేత ఫిర్యాదు చేయించారు. వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కానీ పోనుపోను జాతీయ మీడియా కూడా అక్కడికి చేరి, అక్కడ మహిళలతో మాట్లాడి, విస్తృతంగా రిపోర్టు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి గతి లేక బాధితుల శిబిరం అంటూ పెట్టింది. ఫిర్యాదులు వెల్లువెత్తి రెండు రోజుల్లో 400 కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. షాజహాన్‌ అరెస్టయ్యే నాటికే 150 మంది గ్రామస్తులకు వాళ్ల భూములు వాళ్లకు తిరిగి దక్కాయి. 

ఇటువంటి పరిస్థితిని బిజెపి ఎన్‌క్యాష్‌ చేసుకోవడం సహజం. దీన్ని గిరిజనులపై జరిగిన అక్రమంగా, దాడిగా చూపి విమర్శిస్తే బాగుండేది. కానీ దీనికి మతకోణం కూడా చేర్చిందది. స్మృతి ఇరానీ 'తృణమూల్‌ ఆఫీసులో హిందూ వివాహిత మహిళలను ప్రతీ రాత్రీ బలాత్కారం చేయడానికి మమతా బెనర్జీ అనుమతిస్తోంది.' అంది. ఇక్కడ 'హిందూ” అనే మాట అప్రస్తుతమని నా భావన. ఇక మోదీ అయితే “సందేశ్‌ఖాలీ మహిళల వేదన కంటె కొందరి ఓట్లే ముఖ్యమా అని బెంగాల్‌ ప్రజలు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు.” అన్నారు. కొందరి ఓట్లు అనేది ఎవర్ని ఉద్దేశించో అందరూ ఊహించగలరు.  

ఇవన్నీ రాజకీయాలు. ఓట్లే వాటి పరమావధి. ఎన్నికల తర్వాత కూడా అక్కడి పరిస్థితిని చక్కదిద్ది, దౌర్జన్యాన్ని ఎదిరించే శక్తిని ప్రజలకు అందించడమనే లక్ష్యంతో పార్టీలు, సామాజిక సంస్థలు పని చేస్తే బాగుంటుంది. ఏ పార్టీ, ఏ సంస్థ సహకారం లేకుండా దళిత మహిళలు కలిసికట్టుగా నిలబడి యింత సాధించ గలిగారంటే యితర ప్రాంతాల్లో యింకెంతో సాధ్యపడుతుందని సందేశఖభాలీ సందేశం యిస్తోంది. దోపిడీకి, హింసకు గురవుతున్న యితర ప్రాంతాల వారు అది అందుకోవాలి. వారు తిరగబడి, తరిమికొట్టకుండా ముందుగానే తప్పులు సరిదిద్దుకోవాలనే సందేశం పార్టీలు అందుకోవాలి. (ఫోటో సందేశ్‌ఖాలీ మహిళల ఆందోళన, ఇన్‌సెట్‌లో షాజహాన్‌) 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్