ఎన్టీఆర్ కు భారతరత్న కోసం కృషి చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి
Request for Bharata Ratna to NTR
మనభారత్ న్యూస్, 30 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- పిఠాపురం పట్టణానికి చెందిన యువ సాహితీవేత్త, రచయిత, విశ్లేషకుడు, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ కోఆర్డినేటర్, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కిలారి గౌరీ నాయుడు నాల్గవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడుని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావుకి భారతరత్న ప్రకటించడానికి విశేష కృషి చేయాలని తెలియజేస్తూ వినతి పత్రం అందించారు. పరిపాలన, సామాజిక, సాంస్కృతిక కళా రంగాలలో ఎన్టీఆర్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు అందించిన సేవలను స్మరిస్తూ, భారతరత్న ఎన్టీఆర్ కు ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ రాసిన దీర్ఘ కవితను కూడా చంద్రబాబుకు బహుకరించారు. నీతి, నిజాయితీ, యథార్థత, విశ్వసనీయత, విలువలకు ఎన్టీ రామారావు ప్రతీకగా నిలుస్తారని గౌరీ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా గౌరీ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు, నాయకులు ఎన్టీ రామారావు గారికి భారతరత్న తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని గౌరీనాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన ఘనత ఎన్టీ రామారావుకు దక్కుతుందని గౌరీ నాయుడు తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మేలు చేయడమే కాక పేదరిక నిర్మూలనకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. చలనచిత్ర రంగంలో, రాజకీయాలలో, సామాజిక సేవా రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన గొప్ప మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయంకు ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సత్య కుమార్ కి గౌరీ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు . నందమూరి తారక రామారావుకు భారతరత్న సాధించడానికి సాహితీ సంస్థల తరఫున కృషి చేస్తున్న గౌరీ నాయుడుని కవులు, రచయితలు కళాకారులు అభినందనలు తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, నందమూరి తారక రామారావు అభిమానులు హర్ష వ్యక్తం చేశారు.
What's Your Reaction?