అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు..
మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ గెజిట్ జారీ..
మనభారత్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ : అమరావతి కేపిటల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. గతంలో ఉన్న జోన్లలో కొన్ని భాగాలతో కొత్తగా R-5 జోన్ ఏర్పాటు చేసింది సర్కార్. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని జోన్ ఏర్పాటుచేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానంగా పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు అందుబాటులో ఉండే ధరలతో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా జోన్ ఏర్పాటు చేసింది.
మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లుతో పాటు తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లోని 900.97 ఎకరాలతో జోన్ ఏర్పాటు చేసింది. దీంతో ఆయా గ్రామాల్లో గతంలో ఉన్న జోన్లలో పలు సర్వే నెంబర్లు కొత్త జోన్ పరిధిలోకి వచ్చాయి. ఈ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, ఏవి చేపట్టకూడదనే వివరాలన్నీ గెజిట్‌లో స్పష్టం చేసింది ప్రభుత్వం.
కొన్ని నిర్మాణాలకు కండిషనల్ అనుమతులు ఇచ్చింది. సర్వీస్ అపార్ట్‌మెంట్స్, ఇండస్ట్రియల్ అవసరాల కోసం, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌కు అనుమతులు ఇవ్వకూడదని జీవోలో పేర్కొంది. ఇక నిర్మాణాల విషయంలో కూడా ఎన్ని ఫ్లోర్‌లు నిర్మించాలి? ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి ? పార్కింగ్ స్థలం ఎంత ఉండాలనేది కూడా జీవోలో పేర్కొంది. ఈ జోన్‌లో ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల ప్రకారమే ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టాలనేదే ప్రధాన విషయం.
మొత్తంగా గతంలో R-5 జోన్ పై వచ్చిన అభ్యంతరాలు, ఆ తర్వాత కోర్టు క్లియరెన్స్‌తో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ఇప్పటికే ఈ వ్యవహారంలో న్యాయ పోరాటం చేశారు రైతులు.. ప్రభుత్వ తాజా నిర్ణయంపై వారు ఎలా స్పందిస్తారు అనేది వేచిచూడాలి.
What's Your Reaction?