రాజకీయ సంగ్రామం లో సమిధలు ఎవరు
మనభారత్ న్యూస్, 26 సెప్టెంబర్ 2023, ఆంధ్రప్రదేశ్ :మామూలుగా ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత... అధికారం కోసం తలపడే పార్టీల మధ్య యుద్ధం మొదలైపోయినట్లుగానే భావిస్తుంటాం. ఈ యుద్ధం ప్రతి ఎన్నికల సమయంలోనూ మనం చూస్తున్నదే. ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేస్తుంటారు. తమ ప్రత్యర్థులు ఏ రకంగా పాలకులుగా పనికిరారో నిరూపించడానికి ప్రయత్నిస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే ఏ రకంగా అద్భుతాలు చేయగలమో నమ్మించడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. ఆ యుద్ధం మొత్తం ఇంతవరకే పరిమితం అవుతుంది. కానీ... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ యుద్ధం మొదలైపోయింది. అయితే ఇది కేవలం అధికారం కోసం జరుగుతున్న యుద్ధం అని అనుకోవడానికి వీల్లేదు. అంతకుమించి అనేక అసహ్యకరమైన ధోరణులు ఈ యుద్ధంలోకి చౌరబడిపోయాయి.
ఇప్పుడు జరుగుతున్న యుద్ధం యొక్క పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి... ఇప్పుడు ఇలాంటి ధోరణులను అనుసరిస్తున్న పార్టీలు... భవిష్యత్తులో స్పందించే తీరు ఎలా ఉండబోతున్నది? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ పోకడల భవిష్యత్తు కోపాలను ఊహించుకోవాలంటే భయం వేస్తుంది.
జంకూగొంకూ విడిచిన తెలుగుదేశం!
చంద్రబాబు నాయుడు ఆరెస్టు కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిరసనలు తెలియజేసిన సందర్భంలో ఆయన అరెస్టు అయ్యారు. అలాంటి రాజకీయ ఆందోళనలు, ప్రజా సమస్యలపై ఉద్యమాల నేపథ్యంలో ఒక నాయకుడు అరెస్టు అయితే... ఆ పార్టీ మొత్తం గర్వంగా చెప్పుకోవచ్చు. తమ నాయకుడి అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటే ఎలా ఆందోళనలు చేయవచ్చు.
ప్రజా సమస్యలపై పని చేస్తూ అరెస్టు అయిన నాయకుడి మీద ప్రజలలో కూడా సానుభూతి ఉంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు అరెస్టు అయిన సందర్భం ఏమిటి? స్వరూప స్వభావాలను ఇప్పుడు గమనిస్తే. కేవలం డబ్బులు కాజేయడం కోసమే ఏర్పాటు చేశారేమో అనిపించే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడినందుకు ఆయనను ఆరెస్టు చేశారు. 44 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు ఇటువంటి అవినీతి కేసులో అరెస్టు అయినందుకు ఆ పార్టీ కార్యకర్తలు శ్రేణులు మొత్తం సిగ్గుతో కుమిలిపోవాలి. జనంలోకి రావడానికి జంకాలి. కానీ వాస్తవంలో ఏం జరుగుతోంది?
జాతినేతను అరెస్టు చేస్తే నిరసనలు వ్యక్తం అయినట్లుగా... తెలుగుదేశం నాయకులు జంకు, బొంకు లేకుండా ప్రదర్శనలు ధర్నాలు చేస్తున్నారు. ప్రాతిపదిక కులం కావచ్చు, పార్టీ కావచ్చు. చంద్రబాబు అనుకూల శక్తులు ఉండే ప్రతి చోటా... దేశ విదేశాలలో సైతం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక కోణంలో చూసినప్పుడు ఈ ఆందోళనలు చాలా తమాషాగా అనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఇన్నాళ్లపాటు వేసిన నిందలు ఏమిటి? ఆయన వ్యవస్థలను తొక్కేస్తున్నారని, పనిచేయనివ్వడం లేదని, వ్యవస్థలను అణచివేస్తూ అధికారం చెలాయిస్తున్నారని అంటుండేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు వ్యవహారంలో వ్యవస్థలన్నీ తమ పని తాము చేసుకుపోతున్నాయి.
కేసు నమోదు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా పలువురు వ్యక్తులను విచారించిన అనంతరం, దొరికిన సాక్షాధారాలను అనుసరించి సిఐడి చంద్రబాబును అరెస్టు చేసింది. వారు సమర్పించిన ఆధారాలు, వినిపించిన వాదనలలో బలం ఉండబట్టి న్యాయస్థానం చంద్రబాబును రిమాండుకు పంపింది.
ఎంతగా అంటే, చంద్రబాబు నాయుడు న్యాయవాదులు ఎవరికి ఆయన తప్పు చేయలేదని చెప్పే సాహసం లేకపోయింది. ఎంతసేపూ ఆయన ఆరెస్టు అక్రమం అంటారే తప్ప... తప్పు గురించి ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. ప్రభుత్వం మీద బురద చల్లడానికి... అర్ధరాత్రి ఒంటిగంటకే పోలీసులు వచ్చారు గనుక... అప్పుడే అరెస్టు చేసినట్టుగా పరిగణించాలని... 24 గంటలు గడచిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా చూడాలని... రకరకాల వంకర వాదనలు వినిపించి చంద్రబాబు న్యాయవాదులు భంగపడ్డారు. అలాగే... చంద్రబాబును 17ఏ ప్రకారం గవర్నరు అనుమతి లేకుండా ఆరెస్టు చేశారనే గోల తప్ప... ఆయన నేరం గురించిన వాదన వారి వద్ద లేదు. సదరు 17ఏ అనేది కోర్టు ఎదుట నిలబడలేదు. వారి వాదనలను న్యాయస్థానం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
ఈ మొత్తం ఎపిసోడ్ ను గమనించినప్పుడు... తెలుగుదేశం పార్టీ నైతికవిలువలు మొత్తం విడిచిపెట్టేసి, దిగజారుడుతనంతో నేరం గురించి మాట్లాడకుండా, అసలు ఏ తప్పూ జరగలేదు అని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగల పరిస్థితి లేకపోగా... చంద్రబాబు అరెస్టు చేయడం తప్పు, ఆయనకు జైల్లో వసతులు లేవు, ఏసీ కావాలి లాంటి పసలేని మాటలతో మరింతగా పరువు పోగొట్టుకుంటున్నారు.
చంద్రబాబునాయుడు వ్యవస్థలను గౌరవించే వ్యక్తే అయితే గనుక... ఈ అరెస్టు పట్ల మౌనంగా స్పందించి ఉండాలి. బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవడం ఆయన హక్కు. అయితే న్యాయస్థానం తీర్చును గౌరవించాలి. తాను తప్పు చేయలేదని, రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని న్యాయమూర్తి ఎదుట జేల పలుకులు పలికేబదులు... ఆ విషయాన్ని న్యాయస్థానంలో విచారణ సందర్భంగా నిరూపించగలగాలి.
తాను సత్యసంధుడినని, ఏ పొరబాటూ తప్పూ చేయలేదని నిరూపణ అయిన తర్వాత... ఆయన వందిమాగధులు చెబుతున్నట్టుగా కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిన తర్వాత... అప్పుడు ప్రభుత్వం మీద తన విమర్శల దాడిని ప్రారంభించాలి. చేయని తప్పునకు తనను రాజకీయంగా కక్షసాధించి వేధించారంటూ... ప్రజల ఎదుటకు వెళ్లి ప్రభుత్వం దుర్మార్గం చేసిందని చెప్పుకోడానికి ఆయనకు అధికారం ఉంటుంది.
కేసు విచారణ తేలకుండానే... అరెస్టు చేసినందుకే కక్ష సాధింపు అంటూ... గోబెల్స్ ప్రచారానికి తెగబడితే ఎలా? ఎంత అవమానకరమైన ఎత్తుగడ అది! ఇలాంటి ఎత్తుగడలకు పడిపోయే స్థితిలో ప్రజలు ఇప్పుడు లేరు. పార్టీ శ్రేణులు, ఆయన కులం వారు, ప్రాపకం కోరుతున్న వారు, దత్తపుత్రుడు మరియు ఆయన అనుచరులు గోల చేయాల్సిందే తప్ప... ఆయన తన నిజాయితీని కోర్టులో నిగ్గుతేల్చుకునే వరకు... ప్రజల యొక్క నిజమైన సానుభూతి ఆయనకు దక్కదు!
పగ, కక్షల రూపంగా వైఎస్సార్ కాంగ్రెస్!
చంద్రబాబునాయుడు అరెస్టు వ్యవహారంలో ఆయనకు తటస్టులైన ప్రజల్లో ఏ కొంత సానుభూతి ఏర్పడి ఉన్నా సరే అది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క అతిశయమైన చేష్టల ఫలితమే అని చెప్పి తీరాలి. చంద్రబాబునాయుడు అరెస్టు సమయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ యాత్రలో ఉన్నారు. వచ్చిన తర్వాత కూడా ఆయన పెద్దగా ఈ వ్యవహారంపై స్పందించలేదు. కానీ, స్వామిని మించిన స్వామిభక్తిని ప్రదర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివులు అనేకులు... తమ చేష్టల ద్వారా పార్టీ పరువును దిగజార్చారు. ప్రభుత్వానికి మచ్చ తెచ్చారు.
చంద్రబాబునాయుడు నేరం చేశాడు... ఆయన పాత్రపై ఆధారాలున్నాయి గనుక అరెస్టు జరిగింది... నిజాలను తేల్చే న్యాయప్రక్రియలో భాగంగా రిమాండుకు వెళ్లారు. తుదితీర్చు వచ్చిన తర్వాత ఆయన నిజాయితీపరుడో, అవినీతిపరుడో తేలుతుంది... అనే తరహా మాటల వరకు పరిమితమై ఉంటే గనుక... చాలా బాగుండేది. చంద్రబాబుకు కోర్టు శిక్ష వేయలేదు... కేవలం రిమాండుకు మాత్రమే పంపింది. ఆక్కడికేదో నరకాసుర వధ జరిగిపోయినట్టుగా... లోకానికి పట్టిన పీడ విరగడైనట్టుగా బాణసంచా పేల్చి పండగలు చేసుకున్నారు. డ్యాన్సులు చేశారు. అక్కడికేదో వారి జీవితపరమార్థం నెరవేరినట్లుగా చాలా వెకిలిగా ప్రవర్తించారు. ఇలాంటి దిగజారుడు చేష్టలు ప్రజల్లో ఆ పార్టీని చులకన చేశాయి.
చంద్రబాబు నాయుడును నేరం చేసినందుకు కాకుండా, తమ ఆనందం కోసం, తమ నాయకుడి కళ్లలో సంతోషం చూడడం కోసం అరెస్టు చేయించారని ప్రజల్లో ఏ ఒక్కరైనా అనుకుంటే గనుక... అది కేవలం వైసీపీ నేతల పుణ్యమే. చంద్రబాబునాయుడు అవినీతి కేసులో అరెస్టు కావడం వలన ఆయనకు ప్రజల్లో రాగల సానుభూతి సున్నా. కానీ... ఆయన అరెస్టు విషయంలో పోలీసులు కొంత దూకుడుగా వ్యవహరించారనే పేరు తెచ్చుకున్నారు.
హెలికాప్టర్ వద్దని చంద్రబాబు నిరాకరించినట్టుగా సీఐడీ చెప్పింది గానీ... 73 ఏళ్ల వృద్ధ నాయకుడిని రోడ్డు మార్గాన సుమారు 11 గంటలపాటు తీసుకువెళ్లడం కూడా విమర్శల పాలైంది. ఒకసారి అరెస్టు చేసిన తర్వాత... చంద్రబాబు మాటను సీఐడీ వినాల్సిన అగత్యం ఏమిటి? ఆయన ఇష్టాయిష్టాలతో వారికి పనేమిటి? తాము హెలికాప్టర్ ఏర్పాటుచేశాం.. అందులో రావాల్సిందేఅని ఆదేశించి తీసుకుని వెళ్లి ఉంటే... ఈ “అరాచకమైన ఆరెస్టు' అనే విమర్శలు తప్పేవి. రోడ్డు మార్గం అనే ఆప్షన్ చంద్రబాబుదే కావొచ్చు గానీ... ఆయన ఉచ్చులో వారు పడి విమర్శలు మూటగట్టుకున్నారు. దానికి తోడు... వైసీపీ నేతల సంబురాలు ప్రభుత్వానికి మరింత అపకీర్తి తెచ్చి పెట్టాయి. ఏతా వతా పగ సాధించడానికి, కక్ష తీర్చుకోడానికే అరెస్టు చేశారేమో అనే అభిప్రాయం చాలా మందికి కలిగించాయి.
పర్యవసానాలు ఏంటి?
ఒక పార్టీ అవమానాలను ఖాతరు చేయకుండా దిగజారుడుతనంతో పతనాలకు వెళుతోంది... మరో పార్టీ రాజకీయాల స్వరూప స్వభావాలను పగ, కక్షలకు ప్రతిరూపంగా మార్చేస్తోంది. ఈ పరిణామాల భవిష్యత్తు ఏమవుతుంది?
రాజకీయం అంటే ప్రజలకు, సమాజానికి ఏదైనా మంచి చేయడానికి నాయకులు ఈ రంగంలో అడుగుపెట్టే పరిస్థితి ఒకప్పట్లో ఉండేది. సేవాభావంతో పాటు తొలినాళ్లనుంచి కూడా... రాజకీయ పదవుల ద్వారా దక్కగల అధికార వైభవం, అధికార హోదాల మీద కాంక్ష అందరినీ ఈ రంగంలోకి తీసుకువచ్చేవి.
అధికారంలో ఉండే మజా కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు. కాలక్రమంలో రాజకీయాల గమనరీతులు మారాయి. రాజకీయాల్లోకి రావడం అనేది ఇబ్బడిముబ్బడిగా సంపాదన కోసం అనుకునే రోజులు వచ్చాయి. ఎమ్మెల్యే కావడానికి పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టేవారు... ఎంపీ కావడానికి వంద కోట్ల ఖర్చుకైనా వెనకాడని వారు... తమ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయం రూపురేఖలను మార్చేస్తూ వచ్చారు. ఈ దశను కూడా సమాజం వేరే గత్యంతరం లేని స్థితిలో అంగీకరించింది.
కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలను చూస్తోంటే... సిగ్గు విడికేయడమూ, ప్రతీకారం- కక్షల రూపు సంతరించుకోవడమే నవీనతరం రాజకీయాల శైలిగా కనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. అధికారంలో ఎవరైనా ఉండవచ్చు... కానీ... తాము ఎలాంటి రాజకీయాలకు ప్రతినిధిగా ఉన్నామో ఒకసారి ఆత్మసమీక్ష చేసుకోవడం అనేది చాలా అవసరం! లేకపోతే పతన రాజకీయాలే ఎప్పటికీ పరిఢవిల్లుతూ ఉంటాయి.
What's Your Reaction?