‘స్వదేశంలో మా అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది’: మోదీ భారత్‌లో ముస్లింల జీవితం ఎలా ఉంది?

Apr 30, 2024 - 19:30
Apr 30, 2024 - 19:40
 0
‘స్వదేశంలో మా అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది’: మోదీ భారత్‌లో ముస్లింల జీవితం ఎలా ఉంది?

మనభారత్ న్యూస్, 30 మార్చి 2024  :-   ఆరేళ్ల క్రితం, ఆగ్రాలోని ప్రముఖ పాఠశాలలో చదువుకునే ఓ ముస్లిం అబ్బాయి ఎర్రగా కందిపోయిన ముఖంతో ఇంటికి వచ్చాడు.

ఏమైందని తన తల్లి అడిగితే.. ‘‘నా క్లాస్‌మేట్స్ నన్ను పాకిస్తానీ ఉగ్రవాది అంటున్నారు’’ అని ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు బాధపడుతూ చెప్పాడు.

‘‘మా అబ్బాయి చాలా కోపంతో ఉన్నాడు. చేతులను గట్టిగా బిగించుకోవడం వల్ల అరచేతిలో గోళ్ళ అచ్చులు పడ్డాయి’’ అని రీమా అహ్మద్ చెప్పారు.

రచయిత, కౌన్సిలర్ అయిన రీమా అహ్మద్‌కు ఆ రోజు చాలా స్పష్టంగా గుర్తుంది.

క్లాస్ నుంచి టీచర్ వెళ్లిపోగానే పిల్లలు సరదాగా కొట్లాడుకుంటున్నారని, ఇంతలో

‘‘ఒక గ్రూప్‌కు చెందిన అబ్బాయిలు, తనని ఉద్దేశించి ‘‘ఇతడు పాకిస్తానీ ఉగ్రవాది. చంపేయండి’’ అని చెప్పినట్టు ఆ బాలుడు తల్లికి వివరించాడు.

అంతేకాక, కొందరు క్లాస్‌మేట్స్ తనను ‘అశుద్ధ పురుగు’ అని దూషించినట్టు తెలిపాడు.

ఈ విషయంపై రీమా అహ్మద్ స్కూల్‌లో ఫిర్యాదు చేశారు. ‘‘మీరు ఊహించినట్లు అలాంటి ఘటనలేమీ జరగలేదు’’ అని స్కూల్ వారు చెప్పినట్లు తెలిపారు.

ఈ ఘటన తర్వాత తన కొడుకును ఆ స్కూల్ నుంచి బయటకు తీసుకొచ్చేశారు.

ఇప్పుడు ఆ 16 ఏళ్ల అబ్బాయి ఇంట్లోనే చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

‘‘నా కొడుకు అనుభవాల ద్వారా కమ్యూనిటీ భయాలను నేను అర్థం చేసుకోగలను. ఇక్కడే పెరిగిన నాకు ఇలాంటి ఘటనలు జరిగినట్లు కనీసం గుర్తులేదు’’ అని రీమా చెప్పారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, దేశంలో దాదాపు 20 కోట్ల మంది ముస్లింల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.

గో వ్యాపారులని అనుమానిస్తూ కొందరిపై హిందూ ముసుగు వేసుకున్న కొన్ని అల్లరి మూకలు దాడులు చేశాయి. ముస్లింలకు చెందిన చిన్నచిన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

మసీదులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశాయి. ఇంటర్నెట్ ట్రోలర్లు ముస్లిం మహిళలను ఆన్‌లైన్‌లో వేలం వేయడం, మితవాద గ్రూప్‌లు, ప్రధాన మీడియాలో కొన్ని వర్గాలు ‘‘జిహాద్-లవ్ జిహాద్’’ పేరుతో హిందూ యువతులను ముస్లిం అబ్బాయిలు ప్రేమ పేరుతో పెళ్ళిచేసుకుని ముస్లిం మతంలోకి మారుస్తున్నట్టు తప్పుడు ఆరోపణలతో ఇస్లామోఫోబియాను పెంచి పోషించాయి.

ముస్లింలపై విద్వేష ప్రసంగాలు పెరిగాయి. వీటిల్లో మూడొంతుల ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే జరిగాయి.

‘‘ముస్లింలు రెండవ తరగతి పౌరులుగా మారారు. వారు తమ సొంత దేశంలోనే తమ అస్తిత్వాన్ని చెప్పుకోలేకపోతున్నారు’ అని బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా పుస్తకాన్ని రాసిన జియా అస్ సలామ్ చెప్పారు.

తన కొడుకును పాకిస్తానీ ఉగ్రవాది అని క్లాస్‌మేట్స్ పిలిచిన తర్వాత స్కూల్ నుంచి బయటకు తీసుకొచ్చిన రీమా అహ్మద్

కానీ, భారత్‌లో మైనార్టీల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను మోదీ సహా బీజేపీ నేతలు తోసిపుచ్చుతున్నారు.

‘‘గిరిగీసుకుని బతికే కొంతమంది అలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. వాళ్లు బయటకు వచ్చి ప్రజలను కలవరు. వారు చెప్పే మాటలను ఈ దేశంలోని మైనారిటీలు కూడా నమ్మరు’’ అని న్యూస్‌వీక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి మోదీ చెప్పారు.

రీమా అహ్మద్ కుటుంబం దశాబ్దాలుగా ఆగ్రాలో నివసిస్తోంది. కిక్కిరిసిపోయిన ఇళ్ళు, మెలికలు తిరిగిన వీధులతో ఉండే ఈ నగరంలో రీమాకు అనేకమంది హిందూ స్నేహితులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదో మార్పు కనిపిస్తోంది.

రీమా అహ్మద్ 2019లో స్కూల్ వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలిగారు. ఈ గ్రూప్‌లో ఉన్న ఇద్దరు ముస్లింలలో ఆమె ఒకరు. పాకిస్తాన్‌లోని మిలిటెంట్లపై భారత్‌ వైమానిక దాడులు చేసిన తర్వాత ఆ గ్రూప్‌లో వచ్చిన ఒక పోస్టు చూసి, ఆమె ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చారు.

తీవ్రవాదులను, భారతదేశ శత్రువులను వారి ఇళ్ళలోనే మట్టుపెడతామనే మోదీ మాటలు ప్రతిధ్వనించేలా ‘‘వారు మాపై క్షిపణులతో దాడిచేస్తే మేం వారి ఇళ్లలోకి వెళ్ళి వారిని చంపుతాం’’ అంటూ గ్రూపులో వచ్చిన సందేశమది.

‘‘అది చూసి నేను నా సహనాన్ని కోల్పోయాను. మీకేమైందని నా స్నేహితులను అడిగాను? పౌరులను, పిల్లలను చంపడాన్ని మీరు వ్యతిరేకించరా?’’ అని అడిగినట్లు రీమా అహ్మద్ గుర్తు చేసుకున్నారు. శాంతియుతంగా ముందుకు వెళ్ళాలన్నదే తన అభిమతం అని ఆమె చెప్పారు.

కానీ, దీనిపై ప్రతిస్పందన వేగంగా వచ్చింది.

‘‘మీరు ముస్లిం కావడం వల్ల మీరు పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నారా? అని ఒకరు అడిగారు. దేశ ద్రోహి అని వారు నాపై ఆరోపణలు చేశారు’’ అని ఆమె చెప్పారు.

‘‘అహింస గురించి మాట్లాడటం హఠాత్తుగా దేశద్రోహంతో సమానమైంది. నా దేశాన్ని సమర్థించడానికి నేను హింసాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని వారికి చెప్పి గ్రూపు నుంచి బయటికి వచ్చాను’’ అని ఆమె తెలిపారు.

ఈ మారిన సామాజిక వాతావరణం ఇతర విషయాలలోనూ ప్రతిబింబించడం మొదలైంది.

ఎంతోకాలంగా, విశాలమైన తమ ఇల్లు, లింగం లేదా మతంతో సంబంధం లేకుండా తన కొడుకు క్లాస్‌మేట్స్‌కు హాయిగా కూర్చుని మాట్లాడుకోవడానికి ఒక ప్రదేశంగా ఉండేది.

కానీ, ‘‘లవ్ జిహాద్’’ భయంతో, గంట లోపలే హిందూ అమ్మాయిలు వెళ్లిపోవాలని, అతని గదిలో ఎక్కువ సమయం ఉండటానికి వీలులేదని ఆంక్షలు పెట్టారు రీమా.

‘‘నాన్న, నేను కూర్చుని బయట వాతావరణం బాగాలేదని మా అబ్బాయికి వివరించాం. స్నేహాలను తగ్గించుకోవాలని చెప్పాం. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలని, బయట ఎక్కువసేపు ఉండొద్దని సూచించాం. ఏ సమయంలోనైనా పరిస్థితులు ‘‘లవ్ జిహాద్’’గా మారొచ్చు’’ అని చెప్పామని తెలిపారు.

ఆగ్రాలో ఐదవ తరానికి చెందిన పర్యావరణ వేత్త ఎరుమ్ స్థానిక పాఠశాలల్లో పనిచేస్తుంటారు. ఆమె నగరంలోని పిల్లల మధ్య జరిగే సంభాషణల్లో చోటుచేసుకుంటున్న మార్పును గమనించారు.

‘‘నువ్వు నాతో మాట్లాడొద్దు. నన్ను కూడా మా అమ్మ నీతో మాట్లాడొద్దని చెప్పింది’’ అని ఓ పిల్లాడు తన సహచర ముస్లిం విద్యార్థికి చెప్పడం ఎరుమ్ విన్నారు.

‘‘ ఇదే నిజమేనా? అని ఆలోచిస్తున్నాను. ఇది ఇది ముస్లింల విషయంలో లోతుగా పాతుకుపోయిన ఫోబియాను ప్రతిబింబిస్తోంది. ఇదంత తేలికగా పోదు’’ అని ఎరుమ్ చెప్పారు.

కానీ, ఎరుమ్‌కు చాలామంది హిందూ స్నేహితులున్నారు, కానీ ఆమె ఏనాడూ అభద్రతకు గురవ్వలేదు.

అయితే ఇది కేవలం పిల్లలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. రద్దీగా ఉండే ఆగ్రాలోని ఓ వీధిలో తన చిన్న కార్యాలయంలో కూర్చున్న స్థానిక జర్నలిస్ట్, సర్వమతాలను విశ్వసించే కార్యకర్త సిరాజ్ ఖురేషి హిందూ ముస్లింల మధ్య బంధం తెగిపోతుండటంపై ఆవేదన చెందుతున్నారు.

ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.

నగరంలో మాంసాన్ని సరఫరా చేసే ఒక వ్యక్తిని, హిందూ మితవాద సంస్థకు చెందిన సభ్యులు పోలీసులకు అప్పజెప్పారు. ఆయన్ను జైలులో వేశారు.

‘‘ఆయన వద్ద సరైన లైసెన్స్ ఉన్నప్పటికీ, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడుదల చేశారు’’ అని ఖురేషి చెప్పారు.

గోవు మాంసాన్ని తీసుకువెళుతున్నారనే ఆరోపణలపై రైళ్లలో ప్రయాణించే ముస్లింలపై దాడులు పెరగడంతో రైళ్లలో ప్రయాణించేటప్పుడు వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది.

‘‘ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ప్రజా రవాణా వాహనంలో మాంసాహారాన్ని తీసుకెళ్లడం లేదు. ఖర్చులు భరించే స్తోమత ఉంటే ప్రైవేటు వాహనాలలో ప్రయాణిస్తున్నాం’’ అని రీమా అహ్మద్ చెప్పారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి, జ్యూవెల్లరీ డిజైనర్, మ్యుజీషియన్‌గా మారిన కలీమ్ అహ్మద్ ఖురేషి ఆగ్రాకు చెందిన ఏడవ తరం వ్యక్తి. ఆయన నగరంలో హెరిటేజ్ వాక్‌కు కూడా నాయకత్వం వహిస్తుంటారు.

అఫ్గానిస్తాన్‌లో ఎక్కువగా వాయించే వీణలా కనిపించే గిటార్ లాంటి సంగీత వాయిద్యం రుబాబ్‌ను పట్టుకుని, ఓ హిందూ ప్రయాణికునితో కలిసి దిల్లీ నుంచి ఆగ్రాకు షేరింగ్ టాక్సీలో బయలుదేరారు.

‘‘ఆయన నా దగ్గరున్న పెట్టెను చూసి అందులో గన్ ఉందని భయపడి, దాన్ని తెరవమని అడిగారు. నా పేరు వల్ల ఆయన అలా అనుకుని ఉంటారని నేను గ్రహించగలిగాను’’ అని ఖురేషి చెప్పారు.

‘‘ఈ భయంతోనే మేం బతుకుతున్నాం. నేను ప్రయాణిస్తున్నప్పుడు, నేనెక్కడ ఉన్నాననే విషయంపై నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏం చెప్పాలి, ఏం చేయాలి అనే విషయాలు తెలుసు. రైలులో ప్రయాణించేటప్పుడు టీసీకి నా పేరు చెప్పడం కూడా అసౌకర్యంగా భావిస్తాను’’ అని తెలిపారు.

ఈ సమస్య మూలాలను ఖురేషి స్పష్టంగా చూడగలుతున్నారు. ‘‘మతాల మధ్యనున్న సంబంధాలలో రాజకీయాలు విషాన్ని కలిపాయి’’ అని చెప్పారు.

‘‘ముస్లింలు భయపడేందుకు, ఆందోళన చెందేందుకు ఎలాంటి కారణం లేదు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం దిల్లీలోని ఓ మధ్యాహ్నం వేళ నాతో అన్నారు.

పెరుగుతున్న ఇస్లామోఫోబియాకు బాధ్యతారహితమైన మీడియా సంస్థలే కారణమని చెప్పారు.

‘‘ఎక్కడైనా ఏదైనా చిన్న సంఘటన జరిగితే, అంతకుముందు ఇలాంటివి జరగలేదని మీడియా ఎక్కువ చేసి చెబుతుంది. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఇలాంటి కొన్ని ఘటనలు కమ్యూనిటీ మధ్యలో లేదా కమ్యూనిటీల్లోనే చోటు చేసుకుంటుంటాయి’’ అని తెలిపారు.

‘‘ఒకటి లేదా రెండు సంఘటనలను సాధారణీకరించి, అధికార పార్టీ ముస్లింలకు వ్యతిరేకి అనొద్దు. ముస్లింలకు వ్యతిరేకంగా ఏదో జరుగుతుందని ఎవరైనా చిత్రీకరిస్తే అది పొరపాటే’’ అని చెప్పారు.

మతాన్ని బట్టి ఒక పిల్లవాడిని అతని క్లాస్‌మేట్స్ ‘‘పాకిస్తాన్ ఉగ్రవాది’’అని పిలవడం మీకెలా అనిపించిందని మేం ఆయన్ను అడిగాం.

‘‘ఇతర తల్లిదండ్రుల మాదిరిగానే, నాకు బాధగా అనిపించింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్‌దే. ఇలాంటివి అనకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పించాలి’’ అని ఆయన చెప్పారు.

సయ్యాద్ జాఫర్ ఎక్స్ బ్యాంకర్. ఆయన 2014లో పార్టీలో చేరారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు స్కూల్‌లో చదువుతున్నారు.

79 శాతం హిందూవులున్న దేశంలో బీజేపీ హిందూరాజ్యాన్ని స్థాపిస్తుందనే మాటలపై కూడా ఆయన స్పందించారు.

‘‘ఇవి తప్పుడు మాటలేనని ప్రజలకు తెలుసు. మా ప్రభుత్వం కానీ లేదా పార్టీ కానీ ఇలాంటివి చెప్పిందా? ఇలాంటివి మాట్లాడేవారికి మీడియా ఎందుకింత ప్రాముఖ్యం ఇస్తుంది. ఇలాంటి వారికి మీడియా ప్రాధాన్యత ఇస్తుండటంపై మాకు చాలా బాధగా ఉంది’’ అని చెప్పారు.

‘‘కానీ, ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవడంపై మీరేమంటారు? బీజేపీలో అసలు ముస్లిం మంత్రులే లేరు. పార్లమెంట్‌ రెండు సభలలో ఎంపీలు లేరు. దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలలో కేవలం ఒకే ఒక్క సభ్యుడు ఉన్నారు’’ దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించాం.

అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఈ మాజీ బీజేపీ ఎంపీ చెప్పారు.

‘‘బీజేపీపై గెలిచేందుకు కాంగ్రెస్, ఇతర విపక్షాలు ముస్లింలను వాడుకుంటున్నాయి. ఏ పార్టీ అయినా ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించితే, ముస్లింలే ఓటేయడం లేదు. అలాంటప్పుడు ఏ పార్టీ అయినా వారికి టిక్కెట్ ఎందుకు ఇస్తుంది?’’ అని అన్నారు.

2019లో బీజేపీకి కేవలం 8 శాతం ముస్లింలే ఓటేశారన్నది నిజం. మోదీ పార్టీకి వ్యతిరేకంగా ఓ కూటమిగా ఓటు వేయడం పెరిగింది.

2020లో బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమికి 77 శాతం మద్దతు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రాంతీయ పార్టీ అయినా తృణమూల్‌ కాంగ్రెస్‌కు 75 శాతం మంది మద్దతు ఇచ్చారు. 2022లో ఉత్తరప్రదేశ్‌లో విపక్ష సమాజ్‌వాదీ పార్టీకి 79 శాతం మంది మద్దతుఇచ్చారు.

అయితే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు ఈ కమ్యూనిటీ తమకు విధేయంగా ఉండటం కోసం వారిలో భయం, ఆందోళన నాటుతున్నాయని, కానీ మోదీ ప్రభుత్వం కమ్యూనిటీల్లో అలాంటి తేడాలు చూపదని ఇస్లాం వాదించారు.

‘‘ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయి. కొన్ని పథకాలలో అత్యధికంగా ముస్లింలే లబ్ది పొందుతున్నారు. గత పదేళ్లలో ఎలాంటి పెద్ద పెద్ద అల్లర్లు జరగలేదు’’ అని అన్నారు.

2020లో వివాదాస్పదమైన పౌరసత్వ చట్టం విషయంలో దిల్లీలో జరిగిన అల్లర్లలో 50 మంది మృతి చెందారు. వారిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. కానీ భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతకంటే దారుణమైన సంఘటనలను చవిచూసింది.

‘‘ముస్లింలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓటు బ్యాంకుగా వారిని పరిగణించడాన్ని తిరస్కరించాలి. మత పెద్దలతో ప్రభావితం చెందకూడదు’’ అని సూచించారు.

సమాజాన్ని ఒకతాటిపైకి తీసుకురావాలని, ప్రజలందరూ కలిసి సంతోషంగా జీవించేలా మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో తప్పుదోవ పట్టకూడదని సూచించారు.

మోదీ నాయకత్వంలో భారత దేశంలో ముస్లింల భవిష్యత్ ఎలా కనిపిస్తోంది? అని మేం ఆయన్ను అడిగాం.

‘‘చాలా బాగుంది. ఆలోచనలు నెమ్మదిగా మారుతున్నాయి. చాలా మంది ముస్లింలు బీజేపీలో చేరుతున్నారు. పరిస్థితులు మెరుగుపడుతున్నాయి’’ అని చెప్పారు.

అయితే, పరిస్థితులు మెరుగుపడుతున్నాయా లేదా అన్నది చెప్పడం కష్టం.

ఈ అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో, తమ కమ్యూనిటీ ప్రస్తుతం సంస్కరణ ప్రక్రియలో ఉన్నట్లు చాలా మంది ముస్లింలు చెప్పారు.

‘‘ముస్లింలు విద్యావంతులుగా మారేందుకు చూస్తున్నారు. చదువుకుంటున్నారు. అర్హత కలిగిన, అవసరమైన తమ కమ్యూనిటీ విద్యార్థులకు చదువు ఇప్పించేందుకు ముస్లిం విద్యావేత్తలు, మేధావులు ప్రయత్నిస్తున్నారు. సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్వీయ ప్రయత్నం ప్రశంసనీయమే. కానీ అదే సమయంలో ఇది ప్రభుత్వంపై అపనమ్మకాన్ని తెలియజేస్తుంది’’ అని సలామ్ చెప్పారు.

బిహార్‌లోని తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేయడానికి చదవుకోవాలని తాపత్రయ పడుతున్న వారిలో అర్జూ పర్వీన్ ఒకరు.

రీమా అహ్మద్ కొడుకు లాగా ఆమెకు మతపరమైనకారణాలు అడ్డంకిగా మారలేదు కానీ,

ఇతరులు ఏమనుకుంటారో అని ఆమె తండ్రి భయపడ్డారు.

‘‘ఇంట్లో ఆర్థిక సమస్యలున్నాయి. నువ్వేమో పెరుగుతున్న అమ్మాయివి. దీని గురించి మన ఊళ్ళో వాళ్లు ఏమనుకుంటారని నాన్న అన్నారు. మనం ఇలా బతకలేమని నాన్నకు చెప్పాను. మహిళలు ముందుకెళ్లాలి. మా భవిష్యత్‌ ఇలా నిలిచిపోకూడదు’’ అని చెప్పినట్లు పర్వీన్ తెలిపారు.

డాక్టర్ కావాలన్నది అర్జూ పర్వీన్ కల. తన తల్లి స్థానిక ఆస్పత్రిలో సరైన వైద్యం అందక చనిపోయినట్లు తెలుసుకున్న పర్వీన్, డాక్టర్ కావాలనుకున్నారు.

మహిళలు ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నట్లు టీచర్లు చెబుతున్న కథనాలు విన్న తర్వాత, నాకెందుకు సాధ్యం కాదు? అని తనను తాను ప్రశ్నించుకున్నారు.

ఏడాది వ్యవధిలోనే తన కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన తొలి మహిళగా అర్జూ పర్వీన్ పేరు దక్కించుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ కావాలనే తన కల సాకారం కాదని, ముస్లిం మాజీ రాజకీయవేత్త, విద్యావేత్త మౌలానా వాలి రహ్మానీ వెనుకబడిన ముస్లిం విద్యార్థుల కోసం 2008లో స్థాపించిన ఉచిత కోచింగ్ స్కూల్ రహ్మానీ30లో పర్వీన్ చేరారు.

రహ్మానీ30 ప్రస్తుతం బిహార్ రాజధాని పట్నాతో పాటు మూడు నగరాల్లోని 850 మంది అమ్మాయిలు, అబ్బాయిలకు ఉచిత కోచింగ్ ఇస్తుంది.

స్కూల్ అద్దెకు తీసుకున్న భవనాల్లోనే విద్యార్థులు బస చేయవచ్చు. ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు.

ఈ కోచింగ్ సెంటర్ తొలి తరం విద్యార్థులలో , పండ్ల దుకాణాల, రైతుల, కార్మికుల, నిర్మాణ రంగ కార్మికుల పిల్లలు ఉన్నారు.

ఈ కోచింగ్ సంస్థకు చెందిన 600 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా, సీఏలుగా, ఇతర ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆరుగురు డాక్టర్లు అయ్యారు.

అర్జూ పర్వీన్

ఫొటో సోర్స్,ANSHUL VERMA

ఫొటో క్యాప్షన్,డాక్టర్ కావాలనుకుంటున్న అర్జూ పర్వీన్

దేశంలో ఉన్న 707 మెడికల్ కాలేజీల్లో ఉన్న లక్ష సీట్ల కోసం ఏటా నిర్వహించే పోటీ పరీక్ష కోసం అర్జూ పర్వీన్ కూడా సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులతో పోటీ పడనున్నారు.

‘‘నేను సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా. గైనకాలజిస్ట్ కావాలనుకుంటున్నా’’ అని ఆమె తెలిపారు.

రహ్మానీ30లో కోచింగ్ తీసుకోవడం తన మెరుగైన జీవితానికి సోపానం లాంటిదని మొహమ్మద్ షకీర్ అన్నారు. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న తన కుటుంబాన్ని చూసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు.

15 ఏళ్ల ఈ బాలుడు, అతని స్నేహితుడు హిందూ ఉత్సవ ఊరేగింపు కారణంగా మతకల్లోలాలు చెలరేగిన జిల్లా గుండా ఆరుగంటలు ప్రయాణించి పట్నా చేరుకున్నారు. కేవలం ఒక మంచినీళ్ల బాటిల్, కొన్ని ఖర్జూరాలతో కడుపు నింపుకుని ప్రయాణం చేసిన వీరిద్దరూ, రాత్రంతా మసీదులోనే తలదాచుకుని, ఆ తర్వాత రోజు రహ్మానీ30 ప్రవేశపరీక్ష రాశారు. వారికి ఈ కోచింగ్ సంస్థలో సీటు లభించింది.

‘‘మా తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. వారు వెళ్లొద్దన్నారు. ‘ ఒకవేళ నేనిప్పుడు వెళ్లకపోతే, నా భవిష్యత్ ఏంటన్నది నాకు తెలియదు’ అని వారికి చెప్పాను’’ అని షకీర్ తెలిపారు.

ఈ టీనేజర్‌క కంప్యూటర్ సైంటిస్ట్ అవ్వాలనేది కల. మత ఉద్రిక్తతలు అనేవి అతని బాధల ముందు చిన్నవిగా కనిపిస్తున్నాయి.

‘‘పరీక్ష అయిపోయిన తర్వాత తిరిగి వస్తానని అమ్మకు చెప్పాను. వెళ్లేదారిలో నాకేం జరగదని తెలిపాను. ఏదో ఎందుకు జరుగుతుంది? మా ఊర్లో, హిందూ, ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారు’’ అని చెప్పారు.

వర్గం, కులం, తెగ, మతం పేరుతో విభజనకు గురవుతున్న ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంలో భారతీయ ముస్లింల భవిష్యత్ ఏంటి? అని అడిగాం..

పెరుగుతున్న భయాల గురించి సలాం మాట్లాడారు.

‘‘ముస్లిం కమ్యూనిటీలో ఉద్యోగాల కొరత, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఇది కేవలం ద్రవ్యోల్బణం, ఉపాధి మాత్రమే కాదు. ఇది జీవించే హక్కుకు సంబంధించినది’’ అని చెప్పారు.

ముస్లిం యువత కూడా ఇటీవల ఇలాంటి భయాందోళనలను గుర్తు చేసుకున్నారు.

‘‘అనివార్య పరిస్థితులు తలెత్తినప్పుడు ఎక్కడికి వెళ్లాలనే దానిపై ప్రతి ఒక్కరూ ఒక దేశాన్ని ఎంచుకున్నారు. కెనడా,అమెరికా, తుర్కియే, బ్రిటన్‌లో నివసించే తమ అంకుల్స్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. మతహింస చెలరేగిన సమయాలలో కూడా మనకేంకాదు, సురక్షితంగానే ఉంటామని భావించిన నాలాంటివారు కూడా ఇప్పుడు నా సొంత దేశంలో నా కుటుంబం భవిష్యత్తు ఏమిటని చింతిస్తున్నారు’’ అని సిటీ ఆన్ ఫైర్: ఏ బాయ్‌హుడ్‌ ఇన్ అలీఘర్ పుస్తకంలో రాశారు జియాద్ మస్రూర్ ఖాన్.

ఆగ్రాలోని రీమా అహ్మద్ కూడా భవిష్యత్‌పై అనిశ్చితి పెరుగుతోందని భావిస్తున్నారు.

‘‘ముస్లింలపై విద్వేషం మొదట్లో చాలా తక్కువగా ఉందని భావించాం. అది సమసిపోతుందనుకున్నాం. కానీ అది పదేళ్ల క్రితం మాట. కానీ ఇప్పుడు చాలావాటిని శాశ్వతంగా కోల్పోయాం, నష్టపోయాం ’’ అని ఆమె అంటున్నారు.

అన్ని ఫోటోలకు బీబీసీ తెలుగు కాపీరైట్ వర్తిస్తుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్