జీవించే హక్కును కాలరాస్తున్న వాయు కాలుష్యం.

ఆయుర్దాయం కోల్పోతూ మసకబారుతున్న మానవ వనరులు

Jun 22, 2023 - 14:06
Jun 22, 2023 - 19:02
 0
జీవించే హక్కును కాలరాస్తున్న వాయు కాలుష్యం.
మనభారత్ న్యూస్, 22 జూన్ 2023, ఇండియా : 
  • జీవించే హక్కును కాలరాస్తున్న వాయు కాలుష్యం.
  • ఆయుర్దాయం కోల్పోతూ మసకబారుతున్న మానవ వనరులు.
  • గతి తప్పిన కాలుష్య నియంత్రణ
  • పట్టు తప్పిన ప్రభుత్వ నిర్వహణ.
  • పాలకవర్గాల బాధ్యతారాహిత్యంతో విషవాయు ముట్టడిలో భారత్ అగ్రస్థానం...

ప్రపంచంలోనే అత్యంత దయనీయ స్థితిలో వాయు కాలుష్యం భారత దేశంలో ఉండడాన్ని గమనిస్తే, అంతర్జాతీయ సంస్థలు ఇతర దేశాల విశ్వవిద్యాలయాలు  మన దుస్థితిని అంచనా వేయడం భవిష్యత్తుకు తీసుకోవలసిన చర్యలను సూచించడం  మన ప్రభుత్వాలను హెచ్చరించడాన్ని చూస్తే  పౌర సమాజంతో పాటు పాలకవర్గాలు కూడా సోయి లేకుండా ఉన్నాయనే విషయం స్పష్టం కాక మానదు.  వాయు కాలుష్యం మూలంగా  శ్వాసకోశ వ్యాధులతో పాటు శారీరక మానసిక సమస్యలను సృష్టించడం, గర్భస్థ పిండాలను కూడా  కబళించడాన్ని బట్టి  వాయు కాలుష్య తీవ్రతను అంచనా వేయవచ్చు. అంతేకాకుండా  ఇబ్బడి ముబ్బడిగా వ్యాపిస్తున్న పొగల కారణంగా  మెదడుపై  తీవ్రమైన ప్రభావం తప్పదని ఇటీవల అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించడం  ఆందోళన కలిగించే విషయమే.  ఈ కాలుష్య ప్రమాదం వలన అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు కూడా  కట్టడి చేయడంలోనూ,  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ, అనారోగ్య సమస్యల నుండి అధిగమించడానికి  ఏటా సుమారు 7 లక్షల కోట్ల రూపాయలను ఈ దేశం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నదనే  అంచనాను గమనిస్తే, దిద్దుబాటు చర్యలను వేగవంతం చేయడం ద్వారా అటు అనారోగ్యాల నుండి అధిగమించడానికి  ఆర్థికంగా నష్టపోకుండా  కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందనే స్పృహ పాలకవర్గాలకు ఉంటే మంచిది .

    
భారత్ లో వాయు కాలుష్యం - పరిణామాలు- నిజా నిజాలు.
******************************
ప్రపంచవ్యాప్తంగా  కాలుష్యము కారణంగా విషవాయు ముట్టడిలో  ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి   20 నగరాల్లో  14 నగరాలు ఇండియాలోనే ఉండడం అత్యంత ఆందోళనకరం కాదా?  ప్రమాదకరమైన ధూళికణాలు అధికంగా  వెంటాడుతున్న  100 ప్రపంచ నగరాల్లో  63 భారతదేశానికి చెందినవే అనే  వాస్తవం ప్రమాద పరిస్థితికి దర్పణం పడుతున్నది .
సుమారుగా గత దశాబ్ద కాలంగా దేశ రాజధాని ఢిల్లీ నగరం  పొగ వాయు కాలుష్యంతో  ప్రజా జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషయం మనం ఎరి గినదే.  కానీ ప్రస్తుతం ఢిల్లీ లాంటి నగరాలు ప్రాంతాలు భారతదేశంలో అనేకం ఉండడాన్ని బట్టి కాలుష్య తీవ్రతను అంచనా వేయవచ్చు. పరిసర ప్రాంతాలైన మురాదాబాద్, హాపూర్  వాయు కాలుష్యంలో పోటీ పడుతుండగా  ఢిల్లీ వాసులకు 10 ఏళ్ల పాటు గంగా సింధు పరివాహక ప్రాంతంలోని సుమారు 50 కోట్ల మందికి ఏడున్నర సంవత్సరాల పాటు ఆయుర్దాయం కోల్పోయే ప్రమాదం ఉన్నట్లుగా అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం గత సంవత్సరం చేసిన హెచ్చరిక  ఇప్పటికీ మనలను కార్యోన్ముఖులను చేయకపోతే ఎలా ? ప్రపంచవ్యాప్తంగా  ప్రజలు పీలుస్తున్నటువంటి గాలి 99% కాలుష్యంతో నిండినదే అనే  చేదు వాస్తవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంటే, ఏటా ప్రపంచవ్యాప్తంగా  కలుషితమైన గాలి కారణంగా సుమారు 67 లక్షల మంది ప్రాణాలు కోల్పోవలసి వస్తున్నదని అంచనా. ప్రపంచవ్యాప్తంగాను ముఖ్యంగా భారతదేశంలోనూ  వాయు కాలుష్య తీవ్రతను తెలియజేస్తున్నది. ఈ గణాంకాలు   కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ దురవస్థను అధిగమించే క్రమంలో  వాయు కాలుష్య నియంత్రణ చర్యలను  భారత ప్రభుత్వం  నిరంతరము పర్యవేక్షించాలని,  అదుపు చేయడానికి ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరిస్తున్నా, ఆ స్థాయిలో చర్యలు లేకపోవడం వల్లనే  భారత్ లో ఈ దుస్థితి తాండవిస్తున్నది.
        
దిద్దుబాటు చర్యలు నామమాత్రం  -  వేగవంతం చేయవలసిన నష్ట నివారణ చర్యలు  :-
***************************************
ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ప్రజల పైన  తీవ్ర ప్రభావము చూపుతున్న అంశాలకు సంబంధించి  పాలకవర్గాలతో పాటు ప్రజలకు కూడా  స్పృహ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడికి అక్కడ చర్యలు తీసుకునే అవకాశం, నివారించే వీలుంటుంది. ఆలోచన లేకపోతే, అది మన బాధ్యత అని గుర్తించకపోతే,  ఎవరో చేస్తారని ఎదురు చూస్తే ఆ ఫలితాన్ని అందరం ఉమ్మడిగా కూడా అనుభవించవలసి వస్తున్నది. అందుకే ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రభుత్వాలకు, సామాజిక కార్యకర్తలకు  నిర్లక్ష్యం పనికిరాదనే చేదు నిజం ఈ సంఘటనలు, గణాంకాల ద్వారా తెలుస్తున్నది కదా  !
పలు హెచ్చరికల మేరకు  వాయు శుద్ధి కార్యక్రమములో భాగంగా  నాలుగేళ్ల క్రితం ప్రారంభించినా,  2025- 26 నాటికి 130 నగరాలలో  సూక్ష్మ ధూళికణాల వాయు కాలుష్యాన్ని 40 శాతం నియంత్రించాలన్న లక్ష్యం నెరవేరకపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం.  అంతేకాదు ఈ కార్యక్రమానికి 6900 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా  ఫలితం ఆశాజనకంగా లేకపోవడాన్ని  ఇందన వాయు శుద్ధి పరిశోధనా కేంద్రం ఆందోళన చెంది,  ధ్రువీకరించడం మన పాలకుల చిత్తశుద్ధిని శంకించవలసి వస్తున్నది. జాతీయ వాయు శుద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి  తీసుకోవలసిన చర్యల పైన హరిత ట్రిబ్యునల్, పాతబడిన థర్మల్ విద్యుత్ కేంద్రాల మూసివేతకు సంబంధించి నీతి ఆయోగు చేసిన సూచనలు కూడా  కార్యక్షేత్రం లో అమలు కాకపోవడం మన పాలనలోని డొల్లతనాన్ని తెలియజేస్తున్నది .
     
ప్రభుత్వం ఇప్పటికీ బాధ్యత గుర్తించకపోతే ఎలా?
**********************************
ప్రపంచవ్యాప్తంగా  ఉన్న ప్రమాదంలో భాగంగా భారతదేశం మరింత అగ్రస్థానంలో ఉండడం  ఆందోళన కలిగించే విషయమే కాదు సిగ్గుపడాల్సిన అవసరం కూడా.  దీని నివారణకు సంబంధించి  పలు సంస్థలు చేసిన సూచనలు ఆచరించిన కొన్ని చర్యల కారణంగా కూడా ఫలితాలు ఆశించిన మేరకు రాకపోవడాన్ని  ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి మేధావులను సంప్రదించి విస్తృత ప్రాతిపదికన  నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.

1)వాయు కాలుష్య నియంత్రణ చర్యలను  వాహనాల కట్టడిని  వేగవంతం చేయాలి .

2)కాలుష్య నియంత్రణకు కట్టడి చట్టాలు రూపొందించాలని , పంట వ్యర్థాలను తగలబెట్టకూడదని , అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలను అరికట్టాలన్న సిఫార్సుల అమలుపై  ప్రభుత్వం చురుకుగా కదలాలి. 

3)కాలుష్యకారక వాహనాల పైన  భారీ జరిమాణాలు విధిస్తున్న ఆస్ట్రియా, కెనడా, ఫ్రాన్స్, డెన్మార్క్, సింగపూర్ దేశాల వలె  భారతదేశంలోనూ  కఠినంగా వ్యవహరించి అదుపు చేయాలి .
4) కలుషిత పరిశ్రమల కట్టడికి అటవీ ప్రాంతాల స0 రక్షణకు చైనా అమలు చేస్తున్న పథకాలను  భారత ప్రభుత్వం సీరియస్ గా  అమలు చేయాలి.
5)బొగ్గు స్థానంలో ప్రత్యామ్నాయ  ఇందన వనరుల వినియోగానికి  కాలుష్యకారక పరిశ్రమలు వాహనాల నియంత్రణకు  పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలి .
6)నిపుణులు మేధావులు సామాజిక కార్యకర్తలతో  క్షేత్రస్థాయి నుండి జాతీయస్థాయి వరకు  కాలుష్య నివారణ కమిటీలను ఏర్పాటు చేసి  విస్తృతస్థాయిలో ప్రచారానికి పూనుకోవాలి .
7)గాలి కాలుష్యాన్ని కట్టడి చేయడం అంటే మొక్కుబడిగా ప్రభుత్వం  చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు . అది మనిషి యొక్క జీవించే హక్కును  కాపాడట మని  అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు గుర్తించాలి .
అందుకు అనుగుణంగా వ్యవహరించాలి  .అప్పుడు మాత్రమే గాలిలో దీపం లాగా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి  అత్యంత విలువైన మానవ వనరుల  జీవన హక్కును  రక్షించడం ద్వారా భారతదేశం  వాయు కాలుష్య  నివారణలో తనదైన స్థాయిని  స్థానాన్ని పదిలపరుచుకుంటే  ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటుంది. ఆ వైపుగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.
షేక్ హమీద్ 
(జర్నలిస్టు)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News