వడ్డీతో సహా చెల్లించేస్తా.. మెత్తగా ఉండే ప్రసక్తే లేదు..

చంద్రబాబు సీరియస్ వార్నింగ్

May 6, 2023 - 12:12
 0
వడ్డీతో సహా చెల్లించేస్తా.. మెత్తగా ఉండే ప్రసక్తే లేదు..

మనభారత్ న్యూస్, 06 మే 2023, అంధ్రప్రదేశ్ : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్టైల్ మారుస్తారా..

గతంలో ఉన్నట్టు ఇకపై ఉండరా..

తాజాగా ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారు.. ఇకపై మెత్తగా ఉండే ప్రసక్తే లేదు అన్నారు. ఇంతకు ఇంత వడ్డీతో కలిసి అందరికీ తీర్చేస్తాను అన్నారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయన.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (MLA Adi Reddy Bhavani) కుటుంబాన్ని పరామర్శించారు. భవాని కుటుంబం.. ఒక రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అని అన్నారు.. అలాగే వెనకబడిన కుటుంబం అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి నీతిగా వ్యాపారం చేసుకుంటున్నారని, ఒక్క ఫిర్యాదు కూడా లేదని, ఒక్క కస్టమర్ కూడా ఫిర్యాదు చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్సీ అప్పారావును అరెస్ట్ చేస్తామని బెదిరించారని, 8 సంవత్సరాల చిన్న పిల్లాడిని కూడా బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు. తనకు ములాఖాత్ ఇచ్చినందుకు ఏకంగా జైల్ సూపరింటెండెంట్ నే బదిలీ చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పారావు కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారన్న చంద్రబాబు.. అప్పారావు కుటుంబం ఏ తప్పు చేసిందని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినదగ్గర నుంచి వెనకబడిన వర్గాలను అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకుందని.. ఈ దుర్మార్గాలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలన్నారు. వెంటనే పార్టీ మారాలని ఆదిరెడ్డి కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు. అప్పారావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

ఇకపై తాను మెత్తగా ఉండను అన్నారు. జగన్ అండ చూసుకుని ఎవరు తప్పు చేశారో వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని పరోక్షంగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే నీతి నిజాయితీతో ఉన్న అధికారులకు తప్పకుండా న్యాయం చేస్తానన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లిన చంద్రబాబు.. ములాఖత్‌పై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను పరామర్శించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు , గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.

ఇంతకీ వివాదం ఏంటంటే..? జగత్‌జనని చిట్ ఫండ్‌ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌లను (వాసు-టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త) సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు వారికి మే 12 వరకు రిమాండ్‌ విధించింది. దాంతో పోలీసులు అప్పారావు, వాసులను రాజమహేంద్రవరం జైలుకి తరలించారు. సీఐడీ అధికారులు రాజమహేంద్రవరంలోని ఆదిరెడ్డి ఇంటికి వెళ్లి తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్ట్‌ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఆరోపించారు. కష్టమర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారన్నది టీడీపీ నేతల వాదన..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్